సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఫ్యాక్టరీ పొగగొట్టాల నుంచి విష వాయువులు.. మరోవైపు రోడ్లపై నిత్యం 50 లక్షల వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం.. వెరసి భాగ్యనగరం పొల్యూషన్‌కు కేరాఫ్‌గా మారుతోంది! ప్రతి ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ, స్థూల ధూళికణాల మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలో అనేక ప్రాంతాల్లో 90 నుంచి 100 మైక్రోగ్రాములు నమోదవుతోంది. బెంజీన్, టోలిన్, అమ్మోనియా, నైట్రోజన్, సల్ఫర్‌డయాక్సైడ్, కార్బన్‌డయాక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు కూడా పరిమితులను మించిపోతున్నాయి. ప్రధానంగా పారిశ్రామికవాడలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికితోడు లక్షల వాహనాల నుంచి వస్తున్న పొగ, ధూళితో శ్వాసకోశాలు దెబ్బతిని బ్రాంకైటిస్, అస్తమా, న్యుమోనియా తదితర వ్యాధులబారిన పడుతున్నారు. వాయుకాలుష్యంలో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ నాలుగోస్థానంలో నిలిచింది. తొలిస్థానంలో ఢిల్లీ, తర్వాతి స్థానంలో ముంబై, కోల్‌కతా ఉన్నాయి.
మామూలు జనాలు పట్టరా?
గతేడాది ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అమెరికా అధ్యక్షుడి తనయ ఇవాంక రాక నేపథ్యంలో.. అమెరికా అధికారులు ఆమె బస చేసే వెస్టిన్ హోటల్‌తోపాటు గోల్కొండ కోట పరిసరాల్లో గాలి నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు. వాయు కాలుష్యం నిర్దేశిత ప్రమాణాల్లోపే ఉందని నిర్ధారించిన తర్వాతే ఆమె పర్యటనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె పర్యటనకు వారం ముందుగానే.. నగరానికి ఆనుకొని ఉన్న పారిశ్రామిక వాడల్లో విషవాయువులు వెదజల్లే పరిశ్రమలను కట్టడి చేసింది. వాయు ఉద్గారాలను బయటికి విడిచిపెట్టరాదంటూ హుకుం జారీ చేసింది. అటు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) కూడా ఆపసోపాలు పడింది. అంత హడావుడి చేసిన అధికారులు.. సాధారణ పౌరుల పీల్చే గాలి విషయంలో ఇలా ఎందుకు ఆలోచించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహానగరంలో క్లీన్ ఎయిర్ అథారిటీ ఏర్పాటు ఎండమావిగానే మారింది.
నిలువెల్లా కాలుష్యమే
హైటెక్ సిటీలో నీళ్లు, పాలు, ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకునేందుకు గ్రేటర్‌లో పలు ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎంత కాలుష్యం వెలువడుతోంది? ఈ కాలుష్యం బారి నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం సిటీజనులకు ఎండమావిలా మారింది. నిరంతర వాయు కాలుష్య నమోదు కేంద్రాల ఏర్పాటు, వాయు కాలుష్య వివరాలను మొబైల్‌యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పిస్తామని పీసీబీ ఏడాదిగా చెబుతున్నా ఆచరణ రూపం దాల్చడం లేదు.
ప్రస్తుతానికి నాలుగు కేంద్రాలే...
మహానగరం పరిధిలో వాయుకాలుష్యాన్ని నిరంతరాయంగా లెక్కించి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేందుకు ఉపకరించే కంటిన్యూయెస్ యాంబియెంట్ ఎయిర్‌క్వాలిటీ మానిటరింగ్ సెంటర్‌లు జీడిమెట్ల, పాశమైలారం, హెచ్‌సీయూ, జూపార్క్ వద్ద మాత్రమే ఉన్నాయి. మరో 17 చోట్ల నమోదయ్యే వాయుకాలుష్యాన్ని వివిధ పరికరాల ద్వారా గాలి నమూనాలు సేకరించి సనత్‌నగర్‌లోని పీసీబీ కేంద్ర కార్యలయంలోని ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. ఈ ఫలితాలను ఎప్పుడో ఓసారి ప్రకటిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోజువారీగా ఏ సమయంలో ఎంత మోతాదులో కాలుష్యం వెలువడుతుందో తెలుసుకోవడం జనానికి కష్టతరంగా మారింది.
నగరంలో అధిక వాయు కాలుష్యం వెలువడే ప్రాంతాలివే...
బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, ప్యారడైజ్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాంపల్లి, చార్మినార్, జీడిమెట్ల, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, మాదాపూర్, హైటెక్‌సిటీ, నాచారం, మల్లాపూర్, ఆబిడ్స్, కేబీఆర్‌పార్క్, పంజగుట్ట, హెచ్‌సీయూ, గచ్చిబౌలి, ఆబిడ్స్, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బంజారాహిల్స్
మెట్రో నగరాల్లో ఇలా...
దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు మహానగరాల్లో వాయుకాలుష్యాన్ని పౌరులు నిరంతరాయంగా లెక్కించేందుకు కంటిన్యూయెస్ యాంబియెంట్ ఎయిర్‌క్వాలిటీ మానిటరింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన కూడళ్లలో ప్రతీ సిటీజన్ వాయు కాలుష్య మోతాదును తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే యంత్రాలున్నాయి. వీటిపై అక్కడి గాలిలో ఏఏ కాలుష్య మోతాదు ఎంత మోతాదులో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలోనూ ఇలాంటి ఏర్పాట్లు చేయాలని ప్రజలు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు రూ.10 కోట్ల లోపే ఖర్చు అవుతుందని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment