సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి తోడు చలి తీవ్రత పెరగడంతో స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి నెలకొంది. చలి ప్రభావంతో సాయంత్రమైందంటే చాలు శ్వాసనాళాలు మూసుకుపోతుండడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న రోగుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇన్‌హేలర్ సపోర్ట్ లేనిదే ఊపిరి తీసుకోవడం కష్టతరంగా మారింది. నగరంలో 12–15 శాతం మంది శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండగా... ప్రస్తుత సీజన్‌లో బాధితుల సంఖ్య 15–20 శాతానికి పెరిగినట్లు అంచనా. అంతేకాకుండా ప్రస్తుత వాతావరణం స్వైన్‌ఫ్లూ కారక వైరస్, ఇతర బ్యాక్టీరియాల వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, పిల్లలు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాహన, పారిశ్రామిక కాలుష్యానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆర్‌ఎస్‌పీఏం అధికం..
గ్రేటర్ పరిధిలో సుమారు 50వేల పరిశ్రమలు ఉండగా.. 55లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న ఉద్గారాలు వాతావరణంలో చేరుతున్నాయి. ఈ కాలుష్యానికి చలి తీవ్రత తోడైంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం పొగతో కూడిన మంచు కురుస్తోంది. వాతావరణంలో రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ (ఆర్‌ఎస్‌పీఎం)నిర్ణీత ప్రమాణాలకు మించి నమోదవుతోంది. సాధారణంగా వాతావరణంలో 60 మైక్రో గ్రాములు/క్యూబిక్ మీటరు వరకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దీపావళి తర్వాత వాతావరణ కాలుష్యం తీవ్రత మరింత పెరిగింది. శుక్రవారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 158గా నమోదైంది. అందులో పీఎం 2.5. పీఎం 1.0 ఉద్గారాల తీవ్రత నమైదైంది. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు కలిసిపోవడం, పొగమంచులో ఇవి కలిసిపోయి శ్వాస తీసుకున్నప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాససంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి.
జాగ్రత్తలు అవసరం
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరంలో వాహన కాలుష్యం ఎక్కువ. ముఖ్యంగా బేగంపేట, బాలానగర్, నెహ్రూ జులాజికల్ పార్క్, జీడిమెట్ల, పంజగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయా పరిసరాల్లో నివసించే వృద్ధులు, పిల్లల్లో ఎక్కువగా వెలుగుచూస్తున్న శ్వాస సంబంధ సమస్యలకు ఇదే కారణం. వాహనాల నుంచి వెలువడిన కాలుష్య కారక ఉద్గారాలు గాలి ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం, ఇంటి పరిసరాల్లో పచ్చదనాన్ని వృద్ధి చేసుకోవడం, సాధ్యమైనంత వరకు గ్రీనరీ ప్రదేశాల్లో ఎక్కువగా గడపడం వల్ల వీటి నుంచి బయటపడొచ్చు. సాధ్యమైనంత వరకు ఈ సీజన్‌లో జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ముక్కుకు మాస్క్ ధరించడం తప్పనిసరి. – డాక్టర్ రఫీ,ఫల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment