సాక్షి, సిటీబ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం జన జీవనాన్ని కకావికలం చేస్తోంది. అక్కడి ప్రజలు వాయు కాలుష్యంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విద్యాసంస్థలకుసెలవులిచ్చేశారు. ప్రజలు సైతం ఢిల్లీ నగరాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అంతటి తీవ్ర స్థాయిలో కాకున్నా.. హైదరాబాద్ నగరానికీ కాలుష్యం ముప్పు పొంచి ఉంది. దీని తీవ్రతను తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఢిల్లీ, ముంబై, థానే, పుణే, గోవా నగరాల్లో మాదిరిగా ఔట్‌డోర్ ఎయిర్ పొల్యూషన్ ప్యూరిఫైయర్స్ (ఓయాప్) ఏర్పాటు చేసే యోచనలో ఉంది. తొలి దశలో పైలట్‌గా నగరంలో రద్దీ కలి గిన, ఎక్కువ కాలుష్యం ఉండే.. ఎంపిక చేసిన వంద ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
విష వాయువుల్ని పీల్చేస్తాయి..
కలుషిత వాతావరణంలో పీఎం 2.5, పీఎం 10, కార్బన్ మోనాక్సైడ్, వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీ), హైడ్రో కార్బన్స్ వంటి విష వాయువులు మిళితమై ఉంటాయి. ఇవి తీవ్ర శ్వాస సంబంధ సమస్యలను కలుగజేస్తాయి. గాలిలోని ఈ విష వాయువుల్ని ‘ఓయాప్’లోని ప్యూరిఫైయర్స్ ఫిల్టర్ చేస్తాయి. తద్వారా గాలిలోని కాలుష్యం తీవ్రత తగ్గుతుంది.
నగరంలో పెరుగుతున్న కాలుష్యం..
నగరంలో ఇటీవల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. భారీ భవన నిర్మాణాలతో మున్ముందు సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఎస్సార్‌డీపీ పనుల్లో భాగంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్లు, 30 – 40 అంతస్తుల ఆకాశహరŠామ్యల నిర్మాణాలతో కాలుష్య సమస్యలు పెరగనున్నాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు.
ఆయువు తీస్తున్న విష వాయువులు..
- వాయు కాలుష్యం శ్వాసకోశ సమస్యలను కలిగించడంతో పాటు ఊపిరితిత్తులు, గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
- ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న అంశాల్లో వాయు కాలుష్యం ఐదో స్థానంలో ఉందని ఇటీవలి ఒక అధ్యయనంలో గుర్తించారు.
- పోషణ లేమి, మద్యపానం వంటి వాటి వల్ల జరిగే మరణాల కంటే వాయు కాలుష్యం మూలంగా సంభవిస్తున్న మరణాలే ఎక్కువ.
- 2017లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల మనుషుల ఆయుర్ధాయం సగటున 20 నెలలు తగ్గినట్లు గుర్తించారు.
అన్ని జోన్లలో ఏర్పాటు
సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద తొలిదశలో జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్లలో జోన్‌కు 13 చొప్పున మొత్తం వంద ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేస్తాం. వెలువడే ఫలితాలు, పీసీబీ నివేదికలను పరిగణనలోకి తీసుకొని మలి దశలో ఈ యూనిట్ల సంఖ్యను 500కు పెంచే ఆలోచన ఉంది. రద్దీగా ఉండే మెట్రో, బస్సు, రైల్వే స్టేషన్లు, పెట్రోలుబంక్‌లు, ఇతర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం.
– హరిచందన దాసరి, అడిషనల్ కమిషనర్ (జీహెచ్‌ఎంసీ)
నిర్వహణ బాధ్యత మాదే..
స్ట్రాటా ఎన్విరో కంపెనీకి చెందిన ఈ యూనిట్లను ఏర్పాటు చేసి.. నిర్వహిస్తాం. ఈ యూనిట్లపై ఏర్పాటుచేసే వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో నిర్వహణ చేస్తాం. ఇందుకు మేయర్, కమిషనర్ సూత్రప్రాయంగా అంగీకరించారు. పుణె, గోవా ఎయిర్‌పోర్ట్‌లతో సహా వివిధ నగరాల్లో ఇప్పటి వరకు 300కు పైగా ప్యూరిఫైయర్స్ ఏర్పాటు చేశాం. – సంజయ్ బహుగుణ (బహుగుణ టెక్నోమోటివ్స్)
ఓయాప్ పనిచేస్తుందిలా..
- ఐఓటీ ఇంటిగ్రేషన్ కంట్రోల్ ప్యానెల్ రిమోట్ ద్వారా ఓయాప్ సిస్టమ్ పని చేస్తుంది.
- ప్యూరిఫయర్ యూనిట్.. తన చుట్టూ 60 అడుగుల మేర వ్యాపించి ఉన్న విష వాయువులతో కూడిన గాలిని తన వైపు లాక్కుంటుంది.
- తొలుత యూనిట్‌లోని ఇన్‌లెట్‌లోకి విష వాయువులువెళ్తాయి. అందులోని ఫిల్ట్రేషన్ సిస్టమ్‌లో అవి ఫిల్టర్ కావడంతో విష వాయువుల తీవ్రత తగ్గుతుంది.
- అనంతరం అడుగున ఉండే ఎగ్జాస్టర్ ద్వారా గాలి బయటకు వస్తుంది. తద్వారా ప్యూరిఫయర్ యూనిట్ చుట్టూ గల 60 అడుగుల మేర ప్రాంతంలోని కాలుష్యం తీవ్రత తగ్గుతుంది.
- వీటి సామర్థ్యం 2000 సీఎఫ్‌ఎం (క్యూబిక్ ఫీట్ ఆఫ్ ఎయిర్ ఫర్ మినిట్).
- ఈ యూనిట్లు రోజూ సదరు ప్రాంతంలోని కాలుష్య స్థాయిల్ని కూడా నమోదు చేస్తాయి.
- ఒక్కో యూనిట్ ధర దాదాపు రూ.1.40 లక్షలు. వంద యూనిట్లకు రూ.1.40 కోట్లు ఖర్చు కానున్నాయి.
- ప్యూరిఫయర్స్ యూనిట్ పై భాగంలో వాణిజ్య, వ్యాపార ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. తద్వారా కొంత ఆదాయం సమకూర్చుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment