
బడ్జెట్ పైనే.. పట్టాల ఆశలు
పుష్కర కాలంగా రైల్వేలైన్ కల ఈసారి బడ్జెట్‌లోనైనా సాకారమవుతుందా? అని మెతుకుసీమ ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు.
- అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ నిధుల కోసం ఎదురుచూపులు
- నిధులు మంజూరు చేయాలి: డిప్యూటీ స్పీకర్
మెదక్: పుష్కర కాలంగా రైల్వేలైన్ కల ఈసారి బడ్జెట్‌లోనైనా సాకారమవుతుందా? అని మెతుకుసీమ ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుపడుతూ అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో రైల్వేబడ్జెట్ పైనే ఆశలు పెంచుకుంటున్నారు.
అక్కన్నపేట-మెదక్‌కు 17.2 కిలో మీటర్ల దూరం రైల్వేలైన్ వేయాలని 12 ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు 2012-13బడ్జెట్‌లో రూ.129.32కోట్ల అంచనా వ్యయంతో రైల్వేలైన్ మంజూరైంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 50శాతం ఖర్చు భరిస్తూ రైల్వేలైన్ ఏర్పాటు కోసం ఉచితంగా భూమిని సమకూర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు 131.14హెక్టార్ల భూమి అవసరం ఉంటుందని, అందులో 9.66 హెక్టార్ల అరణ్యభూమి ఉందని సర్వేలో నిర్ధారణ అయింది. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు ఉన్న 17.20 కిలో మీటర్ల దూరంలో లకా్ష్మపూర్, శమ్నాపూర్, మెదక్ పట్టణాల వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ మధ్యలో 35వంతెనలు నిర్మించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందుకనుగుణంగా 19-01-2014న అప్పటి మెదక్ ఎంపీ విజయశాంతి, అప్పటి మంత్రి సునీతారెడ్డి రైల్వేలైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు విడుదల కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 35.26 కోట్లు మంజూరయ్యాయి. 2015 జనవరిలో భూ సేకరణ కోసం రూ.25 కోట్లు, రైల్వేలైన్ కోసం రూ.10.26 కోట్లు మంజూరు చేశారు.
కాగా రైల్వేలో సంస్కరణల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో కొత్త ప్రతిపాదనలకు అవకాశం ఉండదని భావిస్తూ పాత ప్రతిపాదనల నిధులను వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నిధులు మంజూరయితే అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది.
పూర్తిస్థాయి నిధులు మంజూరు చేయాలి: పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్
2015-16కి సంబంధించిన రైల్వే బడ్జెట్‌లో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ కోసం కేంద్ర ప్రభుత్వం తనవంతు పూర్తి నిధులను మంజూరు చేయాలి. మిగతా నిధులను ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రతిపాదనలు పంపారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తే త్వరలో పనులు ప్రారంభమై రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి. రైల్వేలైన్ ఏర్పడితే సామాన్య ప్రజలకు ఉపాధి దొరకడంతోపాటు ఎంతో మేలు జరుగుతుంది. మెదక్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతుంది.