మద్యం మత్తులోనే బెదిరింపు కాల్
చేవెళ్ల రూరల్: చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో బాంబు పెట్టానని కాల్ చేసిన ఓ యువకుడిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. స్థానిక ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఉపేందర్, ఎస్‌ఐ రాజశేఖర్‌లు కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 19న రాత్రి చేవెళ్ల పోలీస్‌స్టేషన్, బస్టాండ్, హనుమాన్ మందిర్‌లో బాంబులు పెట్టానని, కొద్దిసేపట్లో అవి పేలుతాయని పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిన విషయం తెలిసింది.
పోలీసులు బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ఉపేందర్‌లు అది ఆకతాయి కాల్‌గా నిర్ధారించారు. ఈ కేసును చేవెళ్ల పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. 24 గంటల్లోనే నిందితుడిని గుర్తించి కటకటాల వెనక్కి పంపారు. ఫోన్ నెంబర్, సిగ్నల్ ఆధారంగా విచారణ జరిపారు. నిందితుడు మెదక్ జిల్లా ఆందోల్ మండలం పోసాన్‌పేట గ్రామానికి చెందిన అయ్యప్పఅర్జున్(28)గా గుర్తించారు.
కాగా, అతడు 8 నెలల క్రితం బతుకుదెరువు కోసం చేవెళ్లకు వచ్చాడు. ఓ హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అయ్యప్పఅర్జున్ ఈనెల 19న రాత్రి మత్తులో 100 నంబర్‌కు కాల్ చేశాడు. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌తో పాటు స్థానిక హనుమాన్ మందిర్, బస్టాండ్‌లో బాంబులు పెట్టానని, కొద్దిసేపట్లోనే అవి పేలుతాయని చెప్పి కాల్ కట్ చేశాడు.
ఫోన్ నంబర్, సిగ్నల్ ఆధారంగా అతడిని 24 గంటలలోపే గుర్తించారు. మంగళవారం అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా మత్తులో తానే కాల్ చేసినట్లు అంగీకరించాడు. ఈమేరకు పోలీసులు నిందితుడిని బుధవారం రిమాండుకు తరలించారు. ఒక్కరోజులోనే కేసును ఛేదించిన చేవెళ్ల పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.