మహబూబ్‌నగర్ టౌన్: ఈనెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబసర్వేకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డాటా ఎంట్రీని ఎప్పటికప్పుడు పొందుపర్చాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఇక సర్వే ఫారాల్లోని వివరాలు నింపడంతోపాటు వాటిని సేకరించే విధానంపై జిల్లా, మండల స్థాయి రిసోర్సు పర్సన్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వే సమయంలో ఎన్యుమరేటర్లను వాహన సదుపాయం కల్పించేందుకు జిల్లాలకు బడ్జెట్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈసర్వేకు సంబంధించిన బుక్‌లెట్లను హైదరాబాద్ నుంచి తీసుకెళ్లేందుకు ప్రత్యేకాధికారిని నియమించాలని కోరారు.
సర్వేకు సిద్ధంగా ఉన్నాం: కలెక్టర్
కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. సర్వేకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రస్తుతం ఎన్యుమరేటర్లకు కేటాయించే బ్లాక్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సర్వేఫారంలో కుటుంబసభ్యుల వివరాలను సేకరించేందుకు ఇచ్చిన 8 కాలమ్స్ సరిపోవని వీటిని పెంచాలని కలెక్టర్ ప్రిన్సిపల్ కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అవసరమైన చోట అదనంగా పేపర్లు మంజూరుచేస్తామని తెలిపారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్‌ఓ రాంకిషన్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్‌ల కేటాయింపు పూర్తిచేయాలి
ఎన్యుమరేటర్లకు కేటాయించే బ్లాక్‌ల గుర్తింపు ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో మండల ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్రసర్వేపై ప్రతిఒక్కరూ దృష్టిసారించాలని కోరారు. ప్రతి గ్రామంలో ఇళ్లకు వేసే ప్రాథమిక నెంబర్లే కీలకమని, వీటి ఆధారంగానే ఎన్యుమరేటర్లు సర్వేకు వెళ్తారన్నారు. ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇంటినెంబర్లు, ఎన్యుమరేషన్ బ్లాకుల నమోదుపై ర్యాండమ్‌గా తనిఖీచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఒక ఫారం కేటాయించడంతో పాటు కిరాయిదారులకు కూడా ప్రత్యేక ఫారం కేటాయించనున్నట్లు కలెక్టర్ స్పష్టంచేశారు. ప్రతి ఎన్యుమరేటర్ 25 కుటుంబాలను మాత్రమే సర్వే చేస్తారని, తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని సూచించారు. 19న ఉదయం 6గంటలకే కేటాయించిన గ్రామాలకు చేరుకొని 7గంటల నుంచి సర్వే చేపట్టాలని కోరారు.
ఇళ్ల నెంబర్లు లేనివారు తహశీల్దార్లను సంప్రదించాలి
జిల్లాలో ఇదివరకే ఇళ్లకు నెంబర్లు వేశామని, ఎవరి ఇంటికైనా నెంబర్ వేయకపోతే వారు వెంటనే సంబంధిత తహశీల్దార్‌ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే, సర్వే సమయంలో ఉపయోగం ఉండదన్నారు. సమాచారం ఇవ్వని వారిని ప్రభుత్వ పథకాలేవీ అందవనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్‌ఓ రాంకిషన్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమగ్ర సర్వేకు సిద్ధంకండి
Published Sat, Aug 9 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement