gd priyadarshini
-
రెండేళ్ల పనిచేశా
మహబూబ్‌నగర్ టౌన్: జీడీ ప్రియదర్శిని ఐదు నెలల క్రితం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె వచ్చినప్పటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే, పింఛన్లు, ఆహారభద్రత కార్డుల సర్వే, జాబితా తయారు ఇలా వరుసగా కార్యక్రమాలతో తీరికలేకుండా ఉంది. వీటన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు అధికారులతో మాట్లాడుతూ వారికి సూచనలు అందజేస్తూ బిజీబిజీగా ఉన్నారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ఆమె బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లా గురించి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే... ‘జిల్లాకు వచ్చి కేవలం ఐదు నెలల 12 రోజులే. ఈ కొద్దికాలంలోనే రెండేళ్లలో చేయాల్సిన పనిని పూర్తిచేశా. ప్రభుత్వ ఆదేశాలపై నిక్కచ్చిగా వ్యవహరించమే నా ఉద్ధేశం. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగే అలవాటు లేదు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతోపాటు, సమగ్ర కుటుంబ సర్వే, పింఛన్లు, ఆహారభద్రత కార్దుల జారీని పకడ్బందీగా జారీ చేశా. ఇక పింఛన్ల విషయంలో అర్హులైన వారందరికీ అందించడమే లక్ష్యంగా రాత్రిబంవళ్లు పర్యవేక్షించా. ఇక ఆహారభద్రత కార్డుల జారీలోనూ ఇదే తీరును ప్రదర్శించడంతో ఈ రోజు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తిచేయగలిగాం. ఇక జిల్లా పెద్దది, దీనికితోడు చాలా శాఖల్లో అధికారుల కొరత కారణంగా కొంత ఒత్తిడికి గురికావాల్సి వచ్చింది. రాజకీయాల విషయానికొస్తే నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. ప్రభుత్వ ఉత్తర్వులను తుచ తప్పకుండా పాటించడమే విధుల్లో నేను నేర్చుకొన్నా. ఈ విషయంలో ఎవరు ఏమనుకొన్నా ఇలాగే వ్యవహరిస్తా. ఒక ఫైల్‌కు సంబంధిత ఆధారాలు పంపండని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా, అలాగే పంపించారు. ఈ కారణంగా ఆధారాలు ఇచ్చేంత వరకు వాటిని ఆపేశా. దీనివల్ల నామీద తప్పుడు ప్రచారం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను సామాన్యుడి నుంచి రాజకీయ నేతల వరకు పాటించా. ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు కలగొచ్చు, కానీ నిబంధనలు పాటించాననే సంతృప్తి నాకుంది. జిల్లాలో నేను పనిచేసిన 5నెలల 12రోజుల పాటు నాకు సహకరించిన ప్రజలు, అధికారులు, ఇతర నేతల సహకారం మర్చిపోలేనిది’. అని చెప్పారు. -
సేవ చేయకుంటే.. మూసుకోండి
మహబూబ్‌నగర్ టౌన్: ప్రజలకు సేవ చేయకుండా, మీ ఇష్టానుసారం వ్యాపారాలు చేసుకుంటే ఇకపై సహించేది లేదని, అలాంటి బ్యాంక్‌లో జిల్లాలో అవసరంలేదని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా లబ్దిదారులకు సబ్సిడీ, రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ముందస్తుగానే బ్యాంక్‌లకు నిధులు మంజూరు చేస్తున్నా, వాటితో అన్ని విధాల లబ్ధి పొందుతూ, ప్రజలకు అందించడంలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. ప్రజల సొమ్ముతో బ్యాంక్‌లను నడుపుకుంటూ వారికి సేవలు అందించే బ్యాంక్‌లను సహించేది లేదన్నారు. ప్రభుత్వం రైతులకు 25శాతం రుణమాఫీ ప్రకటిందని, వారందరికీ కొత్త రుణాలు ఇవ్వాలని చెబుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనంతరం బ్యాంక్లవారీగా సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల్లో ఖాళీ చేయూలి ప్రభుత్వం రుణమాఫీ కింద రూ.2కోట్లు మీ బ్యాంక్‌కు ఇచ్చి, మిగతా డబ్బులకు గ్యారంటీ ఇచ్చింది. అయినా రైతులకు రుణాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన మిమ్మల్ని క్షమించేది లేదు. మూడు రోజుల్లో జిల్లా కేంద్రంలోని బ్రాంచ్‌ను మూసివేయూలని ఐఎన్జీ వైశ్యాబ్యాంక్ అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జరిమానాతో సహా చెల్లించాలని, లేని పక్షంలో బ్యాంక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సి ఉంటుం దన్నారు. ఇదే తరహాలో పని చేస్తున్న బ్యాంక్‌లన్నింటికీ ఇదే చివరి హెచ్చరికని, నెలాఖరునాటికి రైతులకు రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయూలని సూచించారు. రూ.6,300కోట్లతో ‘వనరుల ఆధారిత రుణప్రణాళిక’ యేడాదికి సంబంధించి నాబార్డ్ రూపొందించిన ‘వనరుల ఆధారిత రుణ ప్రణాళిక’ను జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని విడుదల చేశారు. ఈసందర్బంగా నాబార్డ్ ఏజీఎం శ్రీనాథ్ మాట్లాడుతూ, గతేడాదితో పోలిస్తే జిల్లా వనరులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకు 17శాతం అధికంగా నివేదికను రూపొందించామన్నారు. ఇందులో ప్రధానంగా పంట రుణాలు, కాలపరిమితి రుణాలకు రూ..5,223కోట్లు, ఎంఎస్ఈ, స్వయం ఉపాధి, అగ్రో ప్రాసెసింగ్ రంగాలకు రూ..726కోట్లు, ప్రధాన్యతా రంగాలకు రూ..349కోట్ల చొప్పున కేటాయించామన్నారు. ఇవే కాకుండా, ప్రజలకు అవసరమైన వనరులను ప్రణాళికలో పొందుపరిచేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కలెక్టర్ స్పందిస్తూ వ్యవసాయ గోదాంలు, శీతల గిడ్డంగులు, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు కృషి చెయ్యాలన్నారు. ఖరీఫ్ రుణ లక్ష్యాన్ని అధిగమించాలి ఖరీఫ్‌కు సంబంధించి రూ..1541కోట్లు రుణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ..వెయ్యికోట్లు ఇచ్చామని, మిగిలిన రూ..476కోట్లను వెంటనే పూర్తి చేయూలని లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ సూచించారు. ఇంత వరకు పెండింగ్‌లో ఉన్న రుణాలు చెల్లించి, కొత్త రుణాలను ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఎస్బిఐ, ఎస్‌బిహెచ్, ఎపిజివిబి బ్యాంక్‌ల ఎజిఎంలు వెంకటేశ్, ఆనంద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లాలి
మహబూబ్‌నగర్ టౌన్: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామీణ ప్రజలను చైతన్యం చేయూల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అన్నారు. ఇందుకుగాను నవంబర్‌లో జడ్చర్లలో పౌరసమాచార ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ రీజియన్ డెరైక్టర్ పి.ఐ.కె.రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన చాంబర్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. నవంబర్ 5 నుండి 7వ తేదీ వరకు పౌరసమాచార ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని డెరైక్టర్ తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ నవంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందున ఆయూ దినాల్లో కాకుండా ఉత్సావాలు నిర్వహిద్దామని సూచించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తామన్నారు. డెరైక్టర్ పీఐకెరెడ్డి మాట్లాడుతూ గతంలో వనపర్తి, గద్వాలలో ఈ తరహా ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, విద్యుద్దీకరణ, ఉపాధి హామీ, ఐసీడీఎస్, సమాచార హక్కు చట్టంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, స్వచ్చభారత్, మెకిన్ ఇండియా, బేటీబచావ్, బేటీ పడాన్ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. 50 స్టాళ్లను ఏర్పాటు చేసి భారీ సమాచార ప్రదర్శనను నిర్వహించనున్నామన్నారు. అంతేకాక పలు అంశాలపై సదస్సులు, సమావేశాలు, గోష్టులు నిర్వహించనున్నామని, వీటితో పాటు కళాబృందాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాంకిషన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అంబరాన్నంటిన పూల సంబురం
బతుకమ్మ పండుగను మహిళలు రెండోరోజూ ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బతుకమ్మ ఆటల్లో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు. ఒక్కేసి పువ్వేసి.. చందమామ.. రాశి పడబోసి చందమామ రాశి కలుపుదాం రావె చందమామ రత్నాలగౌరు చందమామ నీరాశి కలుపుల్లు మేం కొలువమమ్మ తీగతీగెల బిందె రాగితీగెల బిందె నీనోము నీకిత్తునే గౌరమ్మ నానోమునాకీయవే గౌరమ్మ అదిచూసిమాయన్న గౌరమ్మ ఏడుమేడలెక్కిరి గౌరమ్మ ఏడు మేడలమీద పల్లెకోటల మీద పల్లెకోటల మీద పత్రీలు కోయంగ దొంగలెవరో దోచిరీ గౌరమ్మ బంగారు గుండ్లపేరు గౌరమ్మ దొంగతో దొరలందరూ గౌరమ్మ బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ రెండేసి పూలేసి రాశి పడబోసి గౌరమ్మ బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ మూడేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ బతుకమ్మ ఆటపాటలతో పాలమూరు జిల్లా హోరెత్తుతోంది. వేడుకలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తున్నారు. గురువారం రెండోరోజు అటుకుల బతుకమ్మను చేసి సంబురాలు జరిపారు. మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నూ ఉద్యోగినులు బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పూలు సుఖ సంతోషాలకు ప్రతీకలు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పూలు సుఖ సంతోషాలకు ప్రతీకల, రకరకాల పూలతో నిర్వహించే బతుకమ్మ పండుగ ఎంతో శక్తితో కూడుకున్నదని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం తీసుకొచ్చిన నిజామాబాద్ ఎంపీ కవిత ముఖ్య అతిథి గా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జేసీ శర్మన్ మా ట్లాడుతూ పెద్దలు అందించిన పూర్వ పండుగలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళలను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏజేసీ రాజారాం పున్న, డీఈఓ చంద్రమోహ న్, ఆర్వీఎం పీఓ కుసుమకుమారి, ఏఎంఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ‘బతుకమ్మ' ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవపరమైన ఏర్పాట్లు చేయూలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఏర్పాట్లపై శుక్రవారం మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ నెల 24నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు పండుగను నిర్వహించేందుకు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని డిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. వీరితోపాటు, మహిళా సంఘాలతోపాటు, అంగన్వాడీ మహిళలు, మహిళా ఉపాధ్యాయులను భాగస్వాములను చేయూల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను పట్టణాల్లో మున్సిపల్ అధికారులు మైదానాలను అందంగా తీర్చిదిద్దటంతో పాటు, మిహ ళలు బతుకమ్మను ఆడుకునేందుకు వీలుగా సర్కిళ్లు ఏర్పాటు చేయూలని ఆదేశించారు. గ్రామస్థాయిలో సర్పంచుల ఆధ్వర్యంలో వేడకలు నిర్వహించాలని, బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువులు, కుంటలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దీంతోపాటు ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించాలని, విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ నిర్వహించే మైదానల్లో లైటింగ్, జనరేటర్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణం, గ్రామీణప్రాంతాల్లోని చౌరస్తాలను అందంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని తలపించేలా చూడాలన్నారు. ఆహ్వాన కమిటీ, ఉత్సవ కమిటీలు ఏర్పాట్లను పర్యవేక్షించాల్సి ఉంటోందని, ఈకమిటీల్లో మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల్లో కళాజాత బృందాల ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలని ప్రజలకు వివరించేలా చూడాలన్నారు. చెరువుల వద్ద మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జేిసీ ఎల్.శర్మన్, డీఆర్ఓ రాంకిషన్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ హరిత, మైక్రో ఇరిగేషన్ అధికారి సురేశ్, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన షెడ్యూలు ఖరారు
* 18న మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తూరులో జన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రారంభం * సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం మహబూబ్‌నగర్ టౌన్: ఈనెల 18న సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి రెవెన్యూ సమావేశ మందిరంలో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18న మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తూర్ మండలానికి ముఖ్యమంత్రి చేరుకుని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీని ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం జడ్చర్ల పోలేపల్లి సెజ్‌లోని హెటిరో కంపెనీలోని ఓ యూనిట్, అలాగే సబ్‌స్టేషన్, బీటీరోడ్డును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం అడ్డాకల్ మండలం మూసాపేట్‌లోని కోజెంట్ గ్లాస్ కంపెనీలోని ఓ నూతన యూనిట్‌ను ప్రారంభించి తిరిగి హైదారాబాద్‌కు సాయంత్రం 5:55 గంటలకు వెళ్తారని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. 24నుంచి బతుకమ్మ సంబరాలు ప్రభుత్వం తరఫున నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలను ఈనెల 24నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేయాలని కోరారు. 23లోగా పాఠశాలల విద్యార్థులచే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 24న గ్రామ, 25న మండల, 28న డివిజన్, 30న జిల్లా స్థాయిలో ఉత్సవాలను జరిపించాలని కోరారు. మండలానికి తహశీల్దార్లు, డివిజన్‌కు ఆర్డీఓలు ఉత్సవాలను పర్యవేక్షించాలన్నారు. జిల్లాస్థాయిలో డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. ఇందుకోసం ఒక మానిటరింగ్ కమిటీని నియమించుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో ప్రతిభచూపిన వారిలో ప్రథమ బహుమతి కింద రూ.వెయ్యి, రెండో బహుమతి రూ.500, మూడో బహుమతి రూ.300 చొప్పున అందజేస్తామన్నారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మన్, డీఆర్ఓ రాంకిషన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాలికలపై వివక్ష తగదు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: బాలికలపై వివక్ష తగదని జిల్లాలోని బాలికల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయూల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అన్నారు. మంగళవారం స్థానిక ఐసీడీఎస్ రాష్ట్ర సదన్‌లో నిర్వహించిన ‘బేటీ బచావో-బేటీ పడా వో’ అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాలికల నిష్పత్తి నానాటికి తగ్గుతుందన్నారు. మనకంటే వెనకబడిన దేశాలైన శ్రీలంక, నేపాల్, అప్ఘనిస్తాన్, మయన్మార్‌లలో కూడా బాలికల నిష్పత్తి మెరుగ్గా ఉందని తెలిపారు. సమాజంలో బాల, బాలికలు సమానమే అరుునా మహిళలకు రోజూ ఎక్కడో ఒక చోట అన్యాయం జరుగుతుందని ఆవేద న వ్యక్తం చేశారు. బాల,బాలికలకు సమానంగా చదువు నేర్పించాలని ఏ ఒక్కరిపైనా వివక్ష చూపరాదన్నారు. జిల్లా లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ స్కానింగ్ సెంట ర్లపై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. మిహ ళా చట్టాలను పకడ్బందీగా అమలు చేసేం దుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఆడపిల్ల అభివృద్ధికి చేపట్టిన పథకాలపై విస్తృ త ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీని సమీక్షించాలన్నారు. జిల్లాలో దాదాపు 10వేల మంది బడిఈడు పిల్లలు బడిబయట ఉన్నారని, వారిని పాఠశాలల్లో చేర్పించేం దుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాలికలకు ఆహారం, వసతి, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజేసీ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేకంగా రూపొం దించిన ‘బంగారు తల్లి’, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఇందిర, డీఎంఅండ్‌హెచ్‌ఓ సరస్వతి, సమితి ప్రతినిధులు శ్రీధర్, విజయలక్ష్మి, సిడిపిఓలు పాల్గొన్నారు. అంతకు ముందు శిశువిహార్‌లో ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడి గి తెలుసుకున్నారు. చిన్నారులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అదేశించారు. -
గణేష్ ఉత్సవాలకు సహకరించాలి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాతంగా జరుపుకునేం దుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అన్నారు. పండుగలు వైభవంగా జరుపుకునేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముంటుందని, ప్రజలు కూడా అందుకు అనుగుణంగా కృషి చేయూలన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని మంగళవారం శాంతి కమిటీ, జిల్లా పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు సమాచారా న్ని అందజేయాలన్నారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి కాలనీలో శాంతి కమిటీని ఏర్పాటు చేసుకొని, చిన్న చిన్న సమస్యలను స్థానికంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, విద్యుత్ తదితర అనుమతుల కోసం వసూలు చేసే రుసుం గతంలో మాదిరి గానే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. పర్యావరణాన్ని దృష్టి లో ఉంచుకుని మట్టి గణేష్‌లను నెలకొల్పాలని సూచించారు. జిల్లా ఎస్పీ నా గేంద్రకుమార్ మాట్లాడుతూ... శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు. శాంతిభద్రతలు అదుపు తప్పరాదని సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నందున బందోబస్తు కోసం సీఆర్పీఎఫ్ సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపా రు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు కచ్చితంగా పాటించాలన్నారు. శాంతి కమిటీ అవసరం రావద్దు: శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే పండుగుల సందర్భంగా శాంతి కమిటీ అవసరం లేకుండానే ఇరు వర్గాలు కృషి చేయాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన పెద్దలు సమష్టిగా సున్నితమైన ప్రాంతాల్లో పర్యటిస్తే 90శాతం సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. విద్యుత్ అధికారులు మండపాలకు అందించే కరెంట్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు అనవసర ఆంక్షలు విధించవద్దన్నారు. గణేష్ ఉత్సవాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పూర్తిగా సహకరిస్తాం: శాంతి కమిటీ నేతలు గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాగానికి అన్ని రకాలుగా సహకరిస్తామని శాంతి కమిటీ నేతలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ, ముస్లిం మతపెద్దలు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. -
అర్హులకే రుణమాఫీ
కొందుర్గు/మిడ్జిల్/కొత్తకోట టౌన్/నవాబుపేట: పంట రుణాలు, వ్యవసాయం పెట్టుబడుల కోసం బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న రైతుల జాబితాలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధంచేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని సూచించారు. ఒక్కో కుటుంబానికి లక్ష మాత్రమే మాఫీ అయ్యే విధంగా చూడాలని అధికారులను కోరారు. ఎట్టి పరిస్థితుల్లో రుణాలు తీసుకున్న ఏ ఒక్క రైతు పేరు తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు జరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. కొందుర్గు ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మండలస్థాయి సంయుక్త బ్యాంకర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల జాబితాలను గ్రామాలవారీగా విభజించి ఒకే రైతు రెండు బ్యాంకుల్లో రుణాలు పొందినట్లయితే గుర్తించాలని సూచించారు. సమావేశంలో పంటరుణాల ప్రత్యేకాధికారి మదన్మోహన్శెట్టి, కన్వీనర్ శ్రీదివ్య, ఎంపీడీఓ శ్రీనివాసాచార్యా వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. జాబితా స్పష్టంగా ఉండాలి రైతులు పంటసాగు కోసం బ్యాంకులో తీసుకున్న రుణాలను ప్రభుత్వం లక్ష వరకు మాఫీ చేస్తుండడంతో రైతుల జాబితా స్పష్టంగా ఉండాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అధికారులకు సూచించారు. ఆదివారం ఆమె మిడ్జిల్ తహశీల్దార్ కార్యాలయంలో బ్యాంకర్ల సమావే శాన్ని పరిశీలించారు. అనంతరం కొత్తకోట తహశీల్దార్ కార్యాలయంలో బ్యాంక ర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకేరైతు వివిధ బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకొని ఉంటే అన్ని బ్యాంకుల జాబితాను నిశితంగా పరిశీలించి.. ఒక రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ వర్తించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పంటరుణం, బంగారుపై తాకట్టు రుణం తదితర వాటిని ‘ఏ’, ‘బీ’ జాబితాలుగా, రెండు కలిపి ‘సీ’ లిస్టుగా, గ్రామాలు, బ్యాంకుల వారీగా డీ లిస్టులు తయారుచేసి రైతుల వివరాలను తమకు ఈనెల 25లోగా అందజేయాలని వారికి సూచించారు. రుణాలు పొందిన రైతులను గుర్తించేందుకు వీఆర్వోలు బ్యాంకు అధికారులకు సహకరించాలని కోరారు. జీఓ.69 ప్రకారం రుణమాఫీకి అర్హులైన రైతులను గుర్తించాలని ఆమె సూచించారు. రైతుల పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డు, ఇతర వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో మిడ్జిల్ తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ తిర్పతయ్య, వివిధ బ్యాంకు మేనేజర్లు, క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. కొత్తకోటలో జరిగిన సమావేశంలో వనపర్తి ఆర్డీఓ రాంచందర్, కొత్తకోట తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. మండలానికో ప్రత్యేకాధికారి రైతులను జాబితాను రూపొందించడంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అధికారులకు సూచించారు. ఆదివారం ఆర్డీఓ అధ్యతన నిర్వహిస్తున్న రుణమాఫీ సమీక్ష సమావేశానికికలెక్టర్ హాజరయ్యూరు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క నిజమైన రైతుకు అన్యాయం జరగరాదని, బినామీ రైతులను జాబితాలో చేర్చకుండా బ్యాంకర్లు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మండలానికో ప్రత్యేకాధికారితో రుణమాఫీకి సంబంధించిన రైతుల జాబితాపై కసరత్తు ప్రారంభించామన్నారు. ఈ ప్రక్రియ 26 తేది వరకు కొనసాగుతుందని, 26న రైతుల తుది జాబితా విడుదల చేస్తే, 27వ తేదీ నుంచి 29 వరకు సామాజిక బృందంతో తనిఖీలు నిర్వహించి రుణమాఫీ అర్హుల జాబితాను ప్రకటిస్తామన్నారు. నవాబుపేట మండలంలో 8,233 మంది రైతులు ఎస్బీఐ, ఎస్‌బీహెచ్‌తో పాటు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారని, ఇందుకుగాను బ్యాంకుల వారిగా రైతుల రుణాలపై పరిశీలన నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ హన్మంతురెడ్డి, నవాబుపేట తహశీల్దార్ జ్యోతి, ఇన్చార్జీ ఎంపీడీఓ సంధ్యారాణి, ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
మహబూబ్‌నగర్ టౌన్: మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆదివారం జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శినిని తన చాంబర్లో కలిసి పూలబొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఢిల్లీలో ఉన్నందున రాలేకపోయానని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన నిరుపేద దళితులకు 3ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు అతి తక్కువ సమయంలో లబ్ధిదారులను గుర్తించి భూమి పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయమని అభినందించారు. ప్రస్తుతం చేపట్టేబోయే సమగ్ర సర్వేను అదే తరహాలో చేపట్టి విజయవంతం చేయాలని కోరారు. దీంతోపాటు, ప్రభుత్వం పేదల కోసం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నేత వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డితోపాటు, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి హక్కులు హరించం
సాక్షి, మహబూబ్‌నగర్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్రకుటుంబ సర్వే, సమాచారం తెలుసుకోవడానికే తప్ప..ఎవరి హక్కులను హరించేందుకు కాదు. సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందజేసేందుకు, ఇంకా ఎవరెవరికి అందాలో తెలుసుకోవడానికే గాని మరే దురుద్ధేశాలు లేవు. సర్వే ఉద్ధేశాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాం. ప్రతిరోజూ మీడియాలో ప్రచారం జరిగేలా చర్యలు తీసుకున్నాం. అలాగే ప్రజాప్రతినిధులకు పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించాం. గ్రామాల్లో ఇప్పటికీ టాం టాంలు వేయిస్తున్నాం. ’ అని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని స్పష్టంచేశారు. ఈనెల 19న చేపట్టే సర్వేకు సంబంధించిన పూర్తివివరాలు ఆదివారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. సమగ్ర సర్వేకు ఏయే ఏర్పాట్లు చేశారు? ఈనెల 19 సర్వేకు సంబంధించిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం. ఇంటింటికీ నెంబర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. నెంబర్లను కూడా క్రాస్‌చెక్ చేసుకుంటున్నాం. ఎన్యుమరేటర్లకు శిక్షణ పూర్తయి.. కిట్స్ కూడా సిద్ధంచేశాం. ప్రభుత్వం నుంచి బుక్లెట్స్ రావాల్సి ఉంది. అవి ఆదివారం రాత్రికి వస్తున్నాయి. రాగానే జిల్లా బుక్‌లెట్‌ను జతచేసి మండలానికి పంపుతాం. మొదట అచ్చంపేట, కొల్లాపూర్, గద్వాల తదితర ప్రాంతాలకు పంపుతాం. ఆ తరువాత గ్రామాలు, మునిసిపాలిటీలకు అందజేస్తాం. ఎన్యుమరేటర్ల విధులు ఎలా ఉంటాయి? ప్రభుత్వ సిబ్బందిని, అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఎన్యుమరేటర్లుగా నియమించాం. ఇంకా తక్కువ కావడంతో ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులను నియమించాం. ఎన్యుమరేటర్ల అందరినీ కూడా వారు విధులు నిర్వహించే దగ్గర్లోనే సర్వే డ్యూటీ కేటాయించాం. ఇప్పటికే వారందరూ తహశీల్దార్‌కు టచ్‌లో ఉంటారు. గ్రామాల్లో సర్పంచ్‌లు భోజనం సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఎంతమంది విధుల్లో ఉంటారు? ఒక ఎన్యుమరేటర్ 25 కుటుంబాల సమాచారాన్ని సేకరించేవిధంగా విధులు కేటాయించాం. 40వేల మంది ఎన్యుమరేటర్లు సమాచార సేకరణలో పాల్గొంటారు. మండలస్థాయిలో ఎమ్మారో, డివిజన్ స్థాయి ఆర్డీఓ పర్యవేక్షిస్తారు. భాష తెలియని వారిని ఎన్యుమరేటర్లుగా ఎంపికచేశారనే విమర్శలున్నాయి కదా? నారాయణపేట, మక్తల్ ప్రాంతాల్లో కన్నడ భాష ఎన్యుమరేటర్లు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. వారికి భాష పట్ల ఇబ్బంది కలగకుండా ఉండేందు కోసం వారికి సహాయకులను ఏర్పాటుచేశాం. సమాచారం ఎలా నమోదుచేసుకోవాలి? సర్వేలో భాగస్వాములైన వారికి ఇప్పటికే ధ్రువీకరణపత్రాలు జారీచేశాం. వాటిని చూపితే చాలు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా సర్వేలో ఉండి, ఇంట్లో ఎవరూ లేకపోతే పక్కింటి వారికి సమాచారమిస్తే చాలు..నమోదుచేసుకుంటాం. సర్వే పట్ల ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి కదా! భయపడాల్సిన అవసరం ఏముంది. ఇది ఒకింత మన మంచి కోసమే. దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు. ఇది కేవలం తెలంగాణలో ఎవరు ఎలా ఉన్నారు? వారి ఆర్థిక స్థితిగతులేంటి? వారి జీవనం తెలుసుకోవడం తప్పితే ఇందులో ఎలాంటి దురుద్ధేశం లేదు. సమాచారం ఇవ్వడమనేది బలవంతమేమీ లేదు. ఎవరి హక్కులను హరించడం కోసం కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి అవసరమవుతాయనేది తెలుసుకోవడం కోసమే ఈ సర్వే. వలస వెళ్లినవారి పరిస్థితి ఏమిటి? కలెక్టర్ : జిల్లా నుంచి ఉపాధి వివిధ ప్రాంతాలకు వలసవెళ్లినట్లు మాకు సమాచారం ఉంది. గుంపుల మేస్త్రీలను గట్టి ఆదేశాలిచ్చాం. మేం చెప్పగానే చాలా మంది సానుకూలంగా స్పందించారు. పెడచెవరిన పెట్టిన వారిని కఠినంగా వ్యవహరించాం. వారిని తీసుకురాకపోతేలెసైన్స్లు రద్దుచేస్తామని చెప్పడంతో.. చాలామంది కూలీలను తీసుకొచ్చారు. -
సమగ్ర సర్వేకు సిద్ధంకండి
మహబూబ్‌నగర్ టౌన్: ఈనెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబసర్వేకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డాటా ఎంట్రీని ఎప్పటికప్పుడు పొందుపర్చాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక సర్వే ఫారాల్లోని వివరాలు నింపడంతోపాటు వాటిని సేకరించే విధానంపై జిల్లా, మండల స్థాయి రిసోర్సు పర్సన్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వే సమయంలో ఎన్యుమరేటర్లను వాహన సదుపాయం కల్పించేందుకు జిల్లాలకు బడ్జెట్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈసర్వేకు సంబంధించిన బుక్లెట్లను హైదరాబాద్ నుంచి తీసుకెళ్లేందుకు ప్రత్యేకాధికారిని నియమించాలని కోరారు. సర్వేకు సిద్ధంగా ఉన్నాం: కలెక్టర్ కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. సర్వేకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రస్తుతం ఎన్యుమరేటర్లకు కేటాయించే బ్లాక్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సర్వేఫారంలో కుటుంబసభ్యుల వివరాలను సేకరించేందుకు ఇచ్చిన 8 కాలమ్స్ సరిపోవని వీటిని పెంచాలని కలెక్టర్ ప్రిన్సిపల్ కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అవసరమైన చోట అదనంగా పేపర్లు మంజూరుచేస్తామని తెలిపారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవిందర్ తదితరులు పాల్గొన్నారు. బ్లాక్‌ల కేటాయింపు పూర్తిచేయాలి ఎన్యుమరేటర్లకు కేటాయించే బ్లాక్‌ల గుర్తింపు ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో మండల ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్రసర్వేపై ప్రతిఒక్కరూ దృష్టిసారించాలని కోరారు. ప్రతి గ్రామంలో ఇళ్లకు వేసే ప్రాథమిక నెంబర్లే కీలకమని, వీటి ఆధారంగానే ఎన్యుమరేటర్లు సర్వేకు వెళ్తారన్నారు. ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇంటినెంబర్లు, ఎన్యుమరేషన్ బ్లాకుల నమోదుపై ర్యాండమ్‌గా తనిఖీచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి ఒక ఫారం కేటాయించడంతో పాటు కిరాయిదారులకు కూడా ప్రత్యేక ఫారం కేటాయించనున్నట్లు కలెక్టర్ స్పష్టంచేశారు. ప్రతి ఎన్యుమరేటర్ 25 కుటుంబాలను మాత్రమే సర్వే చేస్తారని, తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని సూచించారు. 19న ఉదయం 6గంటలకే కేటాయించిన గ్రామాలకు చేరుకొని 7గంటల నుంచి సర్వే చేపట్టాలని కోరారు. ఇళ్ల నెంబర్లు లేనివారు తహశీల్దార్లను సంప్రదించాలి జిల్లాలో ఇదివరకే ఇళ్లకు నెంబర్లు వేశామని, ఎవరి ఇంటికైనా నెంబర్ వేయకపోతే వారు వెంటనే సంబంధిత తహశీల్దార్‌ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే, సర్వే సమయంలో ఉపయోగం ఉండదన్నారు. సమాచారం ఇవ్వని వారిని ప్రభుత్వ పథకాలేవీ అందవనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్ఓ రాంకిషన్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.