ఎవరి హక్కులు హరించం
సాక్షి, మహబూబ్‌నగర్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్రకుటుంబ సర్వే, సమాచారం తెలుసుకోవడానికే తప్ప..ఎవరి హక్కులను హరించేందుకు కాదు. సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందజేసేందుకు, ఇంకా ఎవరెవరికి అందాలో తెలుసుకోవడానికే గాని మరే దురుద్ధేశాలు లేవు. సర్వే ఉద్ధేశాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాం.
ప్రతిరోజూ మీడియాలో ప్రచారం జరిగేలా చర్యలు తీసుకున్నాం. అలాగే ప్రజాప్రతినిధులకు పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించాం. గ్రామాల్లో ఇప్పటికీ టాం టాంలు వేయిస్తున్నాం. ’ అని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని స్పష్టంచేశారు. ఈనెల 19న చేపట్టే సర్వేకు సంబంధించిన పూర్తివివరాలు ఆదివారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
సమగ్ర సర్వేకు ఏయే ఏర్పాట్లు చేశారు?
ఈనెల 19 సర్వేకు సంబంధించిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం. ఇంటింటికీ నెంబర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. నెంబర్లను కూడా క్రాస్‌చెక్ చేసుకుంటున్నాం. ఎన్యుమరేటర్లకు శిక్షణ పూర్తయి.. కిట్స్ కూడా సిద్ధంచేశాం. ప్రభుత్వం నుంచి బుక్‌లెట్స్ రావాల్సి ఉంది. అవి ఆదివారం రాత్రికి వస్తున్నాయి. రాగానే జిల్లా బుక్‌లెట్‌ను జతచేసి మండలానికి పంపుతాం. మొదట అచ్చంపేట, కొల్లాపూర్, గద్వాల తదితర ప్రాంతాలకు పంపుతాం. ఆ తరువాత గ్రామాలు, మునిసిపాలిటీలకు అందజేస్తాం.
ఎన్యుమరేటర్ల విధులు ఎలా ఉంటాయి?
ప్రభుత్వ సిబ్బందిని, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను ఎన్యుమరేటర్లుగా నియమించాం. ఇంకా తక్కువ కావడంతో ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులను నియమించాం. ఎన్యుమరేటర్ల అందరినీ కూడా వారు విధులు నిర్వహించే దగ్గర్లోనే సర్వే డ్యూటీ కేటాయించాం. ఇప్పటికే వారందరూ తహశీల్దార్‌కు టచ్‌లో ఉంటారు. గ్రామాల్లో సర్పంచ్‌లు భోజనం సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
ఎంతమంది విధుల్లో ఉంటారు?
ఒక ఎన్యుమరేటర్ 25 కుటుంబాల సమాచారాన్ని సేకరించేవిధంగా విధులు కేటాయించాం. 40వేల మంది ఎన్యుమరేటర్లు సమాచార సేకరణలో పాల్గొంటారు. మండలస్థాయిలో ఎమ్మారో, డివిజన్ స్థాయి ఆర్డీఓ పర్యవేక్షిస్తారు.
భాష తెలియని వారిని ఎన్యుమరేటర్లుగా ఎంపికచేశారనే విమర్శలున్నాయి కదా?
నారాయణపేట, మక్తల్ ప్రాంతాల్లో కన్నడ భాష ఎన్యుమరేటర్లు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. వారికి భాష పట్ల ఇబ్బంది కలగకుండా ఉండేందు కోసం వారికి సహాయకులను ఏర్పాటుచేశాం.
సమాచారం ఎలా నమోదుచేసుకోవాలి?
సర్వేలో భాగస్వాములైన వారికి ఇప్పటికే ధ్రువీకరణపత్రాలు జారీచేశాం. వాటిని చూపితే చాలు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా సర్వేలో ఉండి, ఇంట్లో ఎవరూ లేకపోతే పక్కింటి వారికి సమాచారమిస్తే చాలు..నమోదుచేసుకుంటాం.
సర్వే పట్ల ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి కదా!
భయపడాల్సిన అవసరం ఏముంది. ఇది ఒకింత మన మంచి కోసమే. దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు. ఇది కేవలం తెలంగాణలో ఎవరు ఎలా ఉన్నారు? వారి ఆర్థిక స్థితిగతులేంటి? వారి జీవనం తెలుసుకోవడం తప్పితే ఇందులో ఎలాంటి దురుద్ధేశం లేదు. సమాచారం ఇవ్వడమనేది బలవంతమేమీ లేదు. ఎవరి హక్కులను హరించడం కోసం కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి అవసరమవుతాయనేది తెలుసుకోవడం కోసమే ఈ సర్వే.
వలస వెళ్లినవారి పరిస్థితి ఏమిటి?
కలెక్టర్ : జిల్లా నుంచి ఉపాధి వివిధ ప్రాంతాలకు వలసవెళ్లినట్లు మాకు సమాచారం ఉంది. గుంపుల మేస్త్రీలను గట్టి ఆదేశాలిచ్చాం. మేం చెప్పగానే చాలా మంది సానుకూలంగా స్పందించారు. పెడచెవరిన పెట్టిన వారిని కఠినంగా వ్యవహరించాం. వారిని తీసుకురాకపోతేలెసైన్స్‌లు రద్దుచేస్తామని చెప్పడంతో.. చాలామంది కూలీలను తీసుకొచ్చారు.