సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అవగాహన కోసమే సర్వే
మిర్యాలగూడ :తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అవగాహన కోసమే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. గురువారం పట్టణంలోని శాంతినికేతన్ కళాశాలలో ఎన్యుమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో ఆర్థిక, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు ఈ సర్వే దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈసర్వే వల్ల రేషన్‌కార్డు ఉన్న , పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులుండవని పేర్కొన్నారు. జిల్లాలో భూపంపిణీ కోసం సుమారు 300మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. శుక్రవారం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మోతె మండలానికి చెందిన లబ్ధిదారులకు జిల్లా కేంద్రంలో రాష్ట్రవిద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చేతుల మీదుగా భూమి పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. జేసీ వెంట మిర్యాలగూడ ఆర్డీఓ బి. కిషన్‌రావు, మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ సురేష్, తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, మున్సిపల్ మేనేజర్ వసంత, ఆర్‌ఐ లక్ష్మణాచారి తదితరులు ఉన్నారు.