తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. 3,69,729మంది ఎన్యూమరేటర్లు ....కోటి కుటుంబాల సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించనున్నారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే సమాచారం ఇవ్వాలని,అయితే డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సర్వే సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ వాతావారణం కనిపిస్తోంది. అయితే హైదరాబాద్లో మాత్రం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి.
కాగా తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులపై సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. అన్ని సంక్షేమ పథకాలకు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ సర్వే సమాచారమే ప్రామాణికమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రజలు సొంత ఊళ్ల బాట పట్టారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సర్వే కోసం ఊరికి వస్తున్నారు. వరంగల్ నగరం, ఇతర పట్టణాల్లో స్థిరపడిన వారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు.