Intensive household survey
-
సర్వే చిత్రం - జనమే జనం
ఉద్యోగం కోసం... ఉపాధి కోసం వలస వచ్చేవారికి మేమున్నానంటూ గ్రేటర్‌లోని శివారు ప్రాంతాలు ఆశ్రయమిస్తున్నాయి. అక్కున చేర్చుకుంటున్నాయి. గూడు కల్పిస్తున్నాయి... ఫలితంగా ఆ ప్రాంతాల్లో జనాభా పెరుగుతోంది. అదీ మామూలుగా కాదు... జెట్ స్పీడుతో. ఇదేదో అంచనాతో చెబుతున్న మాట కాదు.. సమగ్ర కుటుంబ సర్వే సాక్షిగా వెల్లడైన వాస్తవం. నగరంలో భారమైన అద్దెలు...పెరుగుతున్న కాలుష్యం...వెరసి జనాలను శివారు బాట పట్టిస్తున్నాయి. హైదరాబాద్: గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో గడచిన మూడేళ్లలో జనాభా విపరీతంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో దాదాపు రెండింతలైంది. కోర్ సిటీ కంటే శివార్లలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. ఎల్బీనగర్లో మూడేళ్ల క్రితం 1,39,419 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం అవి 2,26,796కు చేరాయి. కుత్బుల్లాపూర్, కూకట్పల్లిల్లోనూ గణనీయంగా కుటుంబాలు పెరిగాయి. కుత్బుల్లాపూర్‌లో గతంలో 94,875 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 1.80 లక్షలకు చేరాయి. అంటే సంఖ్య దాదాపు రెట్టిం పైంది. కూకట్‌పల్లిలో 1,27,655 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 2,10, 343కు పెరిగాయి. సగటున కుటుంబానికి నలుగురిని లెక్కేసుకున్నా నాలుగు లక్షల జనాభా పెరిగింది. ఉప్పల్ సర్కిల్లో మాత్రం పెరుగుదల స్వల్పంగా నమోదైంది. గతంలో 41,188 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 6,441 కుటుంబాలు పెరిగి, మొత్తం 47, 629కు చేరుకున్నాయి. శేరిలింగంపల్లి-2, మల్కాజిగిరి సర్కిళ్లలో 40 వేలకు పైగా పెరిగాయి. చాలా కుటుంబాల వారు ఉమ్మడిగా ఉంటున్నప్పటికీ.. జనగణనలో విడివిడిగా నమోదు చేయించుకున్నా రు. సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదు చేయించుకోని పక్షంలో భవిష్యత్‌లో గ్యాస్, పాస్‌పోర్టు వంటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయేమోననే తలంపుతో ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. కోర్‌సిటీలోని ఖైరతాబాద్, అబిడ్స్ వంటి సర్కిళ్లలో పెరుగుదల పెద్దగా లేదు. వలస వచ్చే కుటుంబాలు.. జీవనోపాధి కోసం వచ్చేవారు శివారుల్లోనేఎక్కువగా ఉంటుండటం తో ఈ పరిస్థితి నెలకొంది. శివార్లలో లెక్కకు మిక్కిలి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు కూడా అక్కడ జనా భా పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. పిల్ల ల చదువుల కోసం పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు శివార్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం ఇం దుకు కారణంగా చెబుతున్నారు. కోర్‌సిటీలో అద్దెల భారంతో పాటు కొత్త నిర్మాణాలు లేనందున అద్దెకు ఇళ్లు దొరకడం కూడా కష్టం కావడంతో నగరానికి వలస వచ్చేవారు శివార్లకే మొగ్గు చూపుతున్నారు. -
పవన్ కళ్యాణ్ సామాజిక నేరస్థుడా!
గత కొద్దికాలంగా కేసీఆర్ తో పవన్ కళ్యాణ్, విజయశాంతిల మధ్య ప్రచ్ఛన్న యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలో కేసీఆర్, పవన్ కళ్యాణ్ లిద్దరూ పరస్పర ఆరోపణలు మీడియాలో పతాక శీర్షికల్లో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై కేసీఆర్ పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసినా.. ధాటిగానే స్పందించినట్టు అర్ధమవుతోంది. ఇక తెలంగాణ రాములమ్మ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలైనారు. గతంలో కేసీఆర్, విజయశాంతి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే నేపథ్యంలో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరూ సమగ్ర సర్వేకు దూరంగా ఉండటం మీడియాను ఆకర్షించాయి. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేకు పది జిల్లాల్లోనే కాక దేశ, విదేశాల్లో ఉన్న ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపించింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేలో సీమాంధ్ర ప్రాంతవాసులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారు. అయితే సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత విజయశాంతి సర్వేకు దూరంగా ఉండటం కొంత వివాదంగా మారింది. సమగ్ర సర్వేలో పవన్ కళ్యాణ్, విజయశాంతిలు పాల్గొనలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాగా.. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉండాలనుకోవడం లేదో అని వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులు, అతిధుల మాదిరిగా ఉండి, వెళ్లాలనే ఉద్దేశంతోనే సర్వేలో పాల్గొని ఉండకపోవచ్చని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో నివసిస్తూ తాగునీరు, లైట్లు, తదితర ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రభుత్వ సర్వేలో పాల్గొనకపోవడం సామాజిక నేరం అంటూ తీవ్రంగా స్పందిచారు. వ్యక్తిగత కారణాల వల్లనో.. లేదా ఇతరత్రా అంశాల ప్రభావం వల్లనో పవన్ కళ్యాణ్, విజయశాంతిలు సమగ్ర సర్వేకు దూరంగా ఉన్నారు. ఒకవేళ సమగ్ర సర్వేను వ్యతిరేకిస్తే అందుకు కారణాలను మీడియా ముఖంగా వెల్లడించి ఉండే బాగుండేదనే కోణంలో పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదా వ్యక్తిగత కారణాల వల్ల అయితే మరో దఫాలో సర్వేలో భాగస్వామ్యులవుతారా అనే విషయం సామాజిక వెబ్ సైట్ల ద్వారా స్పందించినా.. ప్రజలకు వారి మనోభావాలు తెలిసి ఉండేవి. ఓ సినీనటుడిగానే సమగ్ర సర్వేకు దూరంగా ఉంటే పెద్గగా వివాదమయ్యేది కాదు. కాని జనసేన అనే పార్టీ ద్వారా ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తా అనే ట్యాగ్ లైన్ తో గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ మౌనం వహించడం సామాజిక నేరాన్ని అంగీకరించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
కులం అడిగినందుకు దర్శకుడి ఆగ్రహం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన సమగ్ర సర్వేలో పలువురు సినీ ప్రముఖులు సమగ్రంగా తమ వివరాలు అందిస్తే, మరికొందరు కొన్ని వివరాలు మాత్రమే ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సర్వే సందర్భంగా కులం వివరాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఎన్యుమరేటర్లు ఆయనను కమ్యూనిటీ వివరాలు అడగగా.... ఆ వివరాలు ఇచ్చేందుకు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదంతా ముఖ్యం కాదని, ఆ కాలమ్‌ను వదిలేయాలని దాసరి ఎన్యుమరేటర్లను సూచించినట్లు సమాచారం. ఇక సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి....ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు అందించారు. అలాగే నటుడు శ్రీకాంత్ కూడా సమగ్రంగా వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించారు. షూటింగ్ నిమిత్తం స్విజ్జర్లాండ్‌లో ఉన్న హీరో మహేష్ బాబు కూడా కుటుంబ వివరాలను తన సహాయకుల ద్వారా ఎన్యుమరేట్లకు అందచేశారు. అల్లు అరవింద్ కుటుంబంతో పాటు దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కూడా ఈ సర్వేలో పాల్గొని వివరాలు ఇచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ ఈ సర్వేలో పాల్గొనలేదు. అతను ప్రస్తుతం హాలిడే నిమిత్తం బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఇక సూపర్ స్టార్ కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ, తనికెళ్ళ భరణి తదితరులు తమ వివరాలు అందించి సర్వేకు సహకరించారు. -
సమగ్ర సర్వేపై కేంద్రం దృష్టి
-
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వేపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: సమగ్ర సర్వేకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రంలోని మోడీ సర్కార్ దృష్టిని కేంద్రికరించినట్టు పీటీఐ ఓ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాల వివరాల జాబితాను కేంద్రం అడిగి తెలుసుకునే అవకాశం ఉందని కథనంలో పేర్కొంది. తెలంగాణ సమగ్ర సర్వే అంశంలో అవసరమైతే కేంద్ర మంత్రిత్వ శాఖా జోక్యం చేసుకోబోతున్నట్టు కథనంలో వెల్లడించింది. సీమాంధ్ర ప్రజల్లో సమగ్ర సర్వే అనేక సందేహాలను రేకేత్తిస్తున్న నేపథ్యంలో అవసరమైతే జోక్యం చేసుకుంటామని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపినట్టు పీటీఐ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి టెన్షన్ సృష్టించే అవకాశం లేదని కేంద్ర ఆధికారులు ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. -
కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొన్న కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో సర్వే అధికారులకు వివరాలు అందించారు. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, పిల్లలు ఈ సర్వేలో పాల్గొని వివరాలు అందించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ల వివరాలు తెలిపారు. నందినగర్ లో ఇల్లు, ఎర్రవల్లిలో ఫాంహౌస్ డాక్యుమెంట్ల వివరాలను అందచేశారు. ఈ సర్వే ప్రజల కోసమేనని అర్హులకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే ఇంత పెద్దఎత్తున సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సర్వేపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. -
ప్రజల నుంచి అద్భుతమైన స్పందన
హైదరాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 30 శాతం సర్వే పూర్తయిందని, ఇవాళే సర్వే పూర్తి చేస్తామని ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. సర్వేపై పూర్తి వివరాలను గవర్నర్ నరసింహన్‌కు అందచేశామని సోమేష్ కుమార్ తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేను మళ్లీ నిర్వహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే వివరాలను అప్డేట్ చేస్తామని సోమేష్ కుమార్ తెలిపారు. ప్రజలుత తమ వివరాలన్ని సమగ్రంగా ఇస్తే వారికే మంచిదన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరవేసేందుకే ఈ సర్వే చేపట్టామన్నారు. ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇస్తే మంచిదని, వారి అకౌంట్ల్లోనే నగదు వేసేందుకు వీలు అవుతుందన్నారు. అయితే ఈ వివరాల కోసం ఎన్యుమరేటర్లు పట్టుపట్టవద్దని, ప్రజలు తమ ఇష్టప్రకారమే వివరాలు ఇవ్వవచ్చిన సోమేష్ కుమార్ తెలిపారు. -
ఎడారిగా మారిన హైదరాబాద్!
హైదరాబాద్: సమగ్ర సర్వే కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు తమ తమ గ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్ మహానగరం ఎడారిగా మారింది. ప్రజలందరూ సమగ్ర సర్వేలో పాల్గొనడంతో హైదరాబాద్ నగరంలో అప్రకటిత కర్ఫ్యూ తలపిస్తోంది. సమగ్ర సర్వే కోసం ఇంటివద్దనే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచించడంతో ప్రజలు ఇంటి వద్దనే ఉన్నారు. దాంతో రోడ్లపై ఆటో రిక్షాలు, బస్సులు, కార్లు కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, పెట్రోల్ బంక్ లు, హోటళ్లు, సినిమా హాళ్లు, ఇతర వ్యాపార కేంద్రాలు పూర్తిగా మూసివేశారు. సమగ్ర సర్వే కోసం అత్యవసర సేవల్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఐటీ కంపెనీ, ఐటీ ఆధారిత సంస్థలు మాత్రం సెలవు దినంగా పాటించబోమని..తమ ఉద్యోగులను షిఫ్టుల వారిగా ఉపయోగించుకుంటామని తెలిపారు. సర్వేలో పాల్గొంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. సమగ్ర సర్వేకు పూర్తి స్థాయిలో స్పందన రావడంతో రోడ్లన్ని ఖాళీగా బోసి పోయి ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో పూర్తిగా కర్పూ పెట్టిన వాతావరణం కనిపిస్తోంది. -
సర్వే పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో ఎన్యుమరేటర్‌కు వివరాలు అందచేశారు. ఈ సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ పేరు కూడా నమోదు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఎన్యుమరేటర్‌కు వెళ్లి వివరాలు తీసుకున్నారు. కాగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంట్లో లేకపోవటంతో ఎన్యుమరేటర్ వివరాలు నమోదు చేసుకోకుండానే వెనుతిరిగారు. ఇక సర్వేలో భాగంగా కుందన్‌బాగ్ ఆఫీసర్స్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్ర నగర్లో ఎన్యుమరేటర్లకు వివరాలు వెల్లడించారు. -
ఎన్యుమరేటర్‌గా జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఎన్యుమరేటర్ అవతారం ఎత్తారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ వివరాలను సేకరించనున్నారు. ఉదయం 11 గంటలకు తన క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేటర్‌కు కేసీఆర్ వివరాలు అందించనున్నారు. మరోవైపు సమగ్ర సర్వేతో హైదరాబాద్ బోసిపోయింది. హోటళ్లు, దుకాణాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. సమగ్ర సర్వే కోసం నగరంలో నివసించేవారు తమ తమ స్వస్థలాలకు తరలి వెళ్లటంతో పాటు, మిగతావారు సర్వే కోసంగా ఇళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడు కిటకిటలాడే నగరమంతా నిర్మానుష్య వాతావరణం నెలకొంది. -
ఎన్యుమరేటర్ పట్ల అసభ్య ప్రవర్తన
హైదరాబాద్ : సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విధులు అడ్డుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం సుల్తానా అనే ఎన్యుమరేటర్ ఎస్పీఆర్ హిల్స్‌లో ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు ఇస్తూ సర్వే చెక్ లిస్టులను పంపిణీ చేస్తోంది. అక్కడే నివాసం ఉంటున్న టీడీపీ నేత రాజు నాయుడు ఆమె వద్దకు వచ్చి సర్వే చేయడానికి వీలు లేదని, అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఆమెను దుర్భాషలాడాడు. బాధిత యువతి తల్లి కూడా అక్కడికి వచ్చి తన కూతుర్ని ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రశ్నించగా ఆమెను తిట్టాడు. దీంతో బాధితురాలు సుల్తానా పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి రాజు నాయుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణవ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర సర్వే
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. 3,69,729మంది ఎన్యూమరేటర్లు ....కోటి కుటుంబాల సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించనున్నారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే సమాచారం ఇవ్వాలని,అయితే డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సర్వే సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ వాతావారణం కనిపిస్తోంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. కాగా తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులపై సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. అన్ని సంక్షేమ పథకాలకు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ సర్వే సమాచారమే ప్రామాణికమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రజలు సొంత ఊళ్ల బాట పట్టారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సర్వే కోసం ఊరికి వస్తున్నారు. వరంగల్ నగరం, ఇతర పట్టణాల్లో స్థిరపడిన వారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. -
సమగ్ర సర్వే కొచ్చిన ఉద్యోగులపై దాడి!
రామాయంపేట: సమగ్ర సర్వే కోసం వచ్చిన ఉద్యోగులపై ఓ యువకుడు దాడి చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తాగిన మైకంలో యువకుడు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినట్టు తెలిసింది. దాడి చేసిన యువకుడిపై ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. -
విలీన మండలాల్లో సమగ్ర సర్వే నిలిపివేత
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయిన ఏడు మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేను నిలిపివేసింది. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించబడిన పోలవరం ముంపు మండలాలు చింతూరు, వీఆర్ పురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో విలీనం అయిన గ్రామాల్లో సర్వేను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 19న సర్వే జరగనున్న విషయం విదితమే.