
కులం అడిగినందుకు దర్శకుడి ఆగ్రహం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన సమగ్ర సర్వేలో పలువురు సినీ ప్రముఖులు సమగ్రంగా తమ వివరాలు అందిస్తే, మరికొందరు కొన్ని వివరాలు మాత్రమే ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సర్వే సందర్భంగా కులం వివరాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఎన్యుమరేటర్లు ఆయనను కమ్యూనిటీ వివరాలు అడగగా.... ఆ వివరాలు ఇచ్చేందుకు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదంతా ముఖ్యం కాదని, ఆ కాలమ్ను వదిలేయాలని దాసరి ఎన్యుమరేటర్లను సూచించినట్లు సమాచారం.
ఇక సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి....ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు అందించారు. అలాగే నటుడు శ్రీకాంత్ కూడా సమగ్రంగా వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించారు. షూటింగ్ నిమిత్తం స్విజ్జర్లాండ్లో ఉన్న హీరో మహేష్ బాబు కూడా కుటుంబ వివరాలను తన సహాయకుల ద్వారా ఎన్యుమరేట్లకు అందచేశారు. అల్లు అరవింద్ కుటుంబంతో పాటు దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కూడా ఈ సర్వేలో పాల్గొని వివరాలు ఇచ్చారు.
కాగా పవన్ కళ్యాణ్ ఈ సర్వేలో పాల్గొనలేదు. అతను ప్రస్తుతం హాలిడే నిమిత్తం బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఇక సూపర్ స్టార్ కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ, తనికెళ్ళ భరణి తదితరులు తమ వివరాలు అందించి సర్వేకు సహకరించారు.