పవన్ కళ్యాణ్ సామాజిక నేరస్థుడా!
గత కొద్దికాలంగా కేసీఆర్ తో పవన్ కళ్యాణ్, విజయశాంతిల మధ్య ప్రచ్ఛన్న యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలో కేసీఆర్, పవన్ కళ్యాణ్ లిద్దరూ పరస్పర ఆరోపణలు మీడియాలో పతాక శీర్షికల్లో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై కేసీఆర్ పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసినా.. ధాటిగానే స్పందించినట్టు అర్ధమవుతోంది. ఇక తెలంగాణ రాములమ్మ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలైనారు. గతంలో కేసీఆర్, విజయశాంతి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే నేపథ్యంలో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరూ సమగ్ర సర్వేకు దూరంగా ఉండటం మీడియాను ఆకర్షించాయి.
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేకు పది జిల్లాల్లోనే కాక దేశ, విదేశాల్లో ఉన్న ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపించింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేలో సీమాంధ్ర ప్రాంతవాసులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారు. అయితే సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత విజయశాంతి సర్వేకు దూరంగా ఉండటం కొంత వివాదంగా మారింది.
సమగ్ర సర్వేలో పవన్ కళ్యాణ్, విజయశాంతిలు పాల్గొనలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాగా.. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉండాలనుకోవడం లేదో అని వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులు, అతిధుల మాదిరిగా ఉండి, వెళ్లాలనే ఉద్దేశంతోనే సర్వేలో పాల్గొని ఉండకపోవచ్చని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో నివసిస్తూ తాగునీరు, లైట్లు, తదితర ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రభుత్వ సర్వేలో పాల్గొనకపోవడం సామాజిక నేరం అంటూ తీవ్రంగా స్పందిచారు.
వ్యక్తిగత కారణాల వల్లనో.. లేదా ఇతరత్రా అంశాల ప్రభావం వల్లనో పవన్ కళ్యాణ్, విజయశాంతిలు సమగ్ర సర్వేకు దూరంగా ఉన్నారు. ఒకవేళ సమగ్ర సర్వేను వ్యతిరేకిస్తే అందుకు కారణాలను మీడియా ముఖంగా వెల్లడించి ఉండే బాగుండేదనే కోణంలో పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదా వ్యక్తిగత కారణాల వల్ల అయితే మరో దఫాలో సర్వేలో భాగస్వామ్యులవుతారా అనే విషయం సామాజిక వెబ్ సైట్ల ద్వారా స్పందించినా.. ప్రజలకు వారి మనోభావాలు తెలిసి ఉండేవి. ఓ సినీనటుడిగానే సమగ్ర సర్వేకు దూరంగా ఉంటే పెద్గగా వివాదమయ్యేది కాదు. కాని జనసేన అనే పార్టీ ద్వారా ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తా అనే ట్యాగ్ లైన్ తో గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ మౌనం వహించడం సామాజిక నేరాన్ని అంగీకరించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.