హైదరాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకూ హైదరాబాద్లో 30 శాతం సర్వే పూర్తయిందని, ఇవాళే సర్వే పూర్తి చేస్తామని ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. సర్వేపై పూర్తి వివరాలను గవర్నర్ నరసింహన్కు అందచేశామని సోమేష్ కుమార్ తెలిపారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేను మళ్లీ నిర్వహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే వివరాలను అప్డేట్ చేస్తామని సోమేష్ కుమార్ తెలిపారు. ప్రజలుత తమ వివరాలన్ని సమగ్రంగా ఇస్తే వారికే మంచిదన్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరవేసేందుకే ఈ సర్వే చేపట్టామన్నారు. ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇస్తే మంచిదని, వారి అకౌంట్ల్లోనే నగదు వేసేందుకు వీలు అవుతుందన్నారు. అయితే ఈ వివరాల కోసం ఎన్యుమరేటర్లు పట్టుపట్టవద్దని, ప్రజలు తమ ఇష్టప్రకారమే వివరాలు ఇవ్వవచ్చిన సోమేష్ కుమార్ తెలిపారు.