సర్వే స్వచ్ఛందం
* వివరాల వెల్లడి తప్పనిసరి కాదు: టీ సర్కారు
* సంక్షేమ పథకాలు పొందాలంటే.. వివరాలు ఇవ్వాలి
* భవిష్యత్తులో రేషన్‌కార్డులు, పింఛన్ల వంటివాటికి దీన్ని ప్రామాణికంగా తీసుకుంటాం
* దీని ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక
* స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వండి, ఇష్టం లేకపోతే వివరాలు ఇవ్వకపోయినా ఫరవాలేదు..
* బ్యాంకు అకౌంట్ నంబర్ తప్పనిసరి కాదు
* ఇంట్లో కుటుంబమంతా ఉండాలన్న నియమం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 19న నిర్వహిస్తున్న ‘సమగ్ర కుటుంబ సర్వే’లో అన్ని వివరాలు వెల్లడించడం తప్పనిసరేమీ కాదని తెలంగాణ సర్కారు వెల్లడించింది. అయితే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రయోజనం పొందాలంటే ‘సర్వే’లో ఎన్యూమరేటర్లు అడిగే సమాచారాన్ని ఇవ్వాలని ప్రజలకు సూచించింది. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందించేలా నమ్మకమైన, కచ్చితమైన సమాచారం కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నామని... పూర్తి సమాచారం ఇవ్వకుంటే ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
‘సర్వే’పై పలు విభిన్నమైన అభిప్రాయాలు వెలువడడంతోపాటు హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో... ‘సర్వే’పై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ గురువారం పలు వివరాలు వెల్లడించారు. సర్వేకు సంబంధించి ఏ విషయంలోనూ సమాధానం తప్పనిసరికాదని.. అయినా ప్రజలంతా స్వచ్ఛం దంగా సమాచారం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఖాతా నంబరును తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.
ప్రభుత్వం నుంచి పొందే లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయడానికి మాత్రమే బ్యాంకు అకౌంట్ నంబర్ అడుగుతున్నారని.. సమాచారం ఇవ్వకపోయినా ఫరవాలేదని తెలిపారు. ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా ఉండాలన్న నియమం లేదని.. ఇంట్లో యజమాని లేదా బాధ్యత కలిగిన వ్యక్తులు సమాచారమిచ్చినా సరిపోతుందని అధికారులు వెల్లడించారు. ఇంట్లో లేని వారికి సంబంధించిన ఏవైనా రుజువులు చూపించి.. వారి వివరాలు ఇవ్వవచ్చని చెప్పారు.
కుటుంబ ఆదాయం ఎంతని మాత్రమేగాని ఏ రూపంలో ఆదాయం వస్తుందన్న వివరాలు అడగడం లేదని వివరించారు. ప్రజల హక్కును హరించడానికి ఈ సర్వే నిర్వహించడం లేదని, ప్రభుత్వ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకే దీనిని నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇది బేస్‌లైన్ సర్వే అని... భవిష్యత్తులో రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహ నిర్మాణం, విద్యార్థులకు ఉపకార వేతనాలు తదితర అంశాల్లో దీనిని ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపారు. ఈ సర్వే ఆధారంగా సంబంధిత శాఖలు తమ సొంత సర్వేలతో లబ్ధిదారులను ఎంపిక చేసుకుంటాయని చెప్పారు.
ప్రభుత్వ శాఖలన్నీ పంచుకుంటాయి..
తెలంగాణలో 19వ తేదీన మొత్తం 3.76 లక్షల మంది ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకు సర్వే చేస్తారని, ఈ సర్వే పత్రాలను ఒక్కో మండలంలో 20 నుంచి 30 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లతో ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తామని పేర్కొన్నారు. ఈ వివరాలను అన్ని ప్రభుత్వ శాఖలు పంచుకుంటాయని అధికారులు తెలిపారు. కాగా.. ఈ సర్వేను ‘గణాంకాల చట్టం-2008’ కింద చేపట్టడం లేదని, ఆ చట్టం కింద చేపడితే... ప్రజలు విధిగా సమాచారం ఇవ్వాల్సి వస్తుందని ఓ అధికారి వివరించారు. ప్రస్తుత సర్వేలో అవసరమనుకుంటే వివరాలు ఇవ్వవచ్చని, ఇవ్వడానికి ఇష్టం లేకపోతే అదే విషయాన్ని ఎన్యుమరేటర్లు రాసుకుని వెళ్తారని తెలిపారు. కాగా.. ‘సమగ్ర’ కుటుంబ సర్వేపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోందన్న అంశంపై తమకెలాంటి సమాచారం లేదని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ పేర్కొన్నారు.