సర్వే సాగేనా..? | Rythu Samagra Survey In Nalgonda | Sakshi
Sakshi News home page

సర్వే సాగేనా..?

Published Tue, Apr 16 2019 10:56 AM | Last Updated on Tue, Apr 16 2019 10:56 AM

Rythu Samagra Survey In Nalgonda - Sakshi

నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లాలో రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే కొనసాగడంపై అస్పష్టత నెలకొంది.  పంట కాలనీల ఏర్పాటుతోపాటు వాటి ఆధారంగా భవిష్యత్‌లో రైతులకు వివిధ పథకాలను రూపొందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్‌లైన్‌లో చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, సబ్సిడీ చెల్లింపులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలుకు రైతు సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.

ఇందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమగ్ర సమాచార సర్వేను చేయించాలని భావించింది. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖకు అదేశాలు జారీ చేసింది. అయితే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది ఎన్నికల విధులకుహాజరుకావడంతో సర్వేకు ఆటంకం ఏర్పడింది.  సర్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ మే 15లోగా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని అన్ని జిల్లా కలెక్టర్లుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. సర్వే మే 15 నాటికి పూర్తి చేయడం వ్యవసాయశాఖ అధికారులకు కత్తిమీది సాముగా మారింది. క్షేత్ర స్థాయిలో అన్ని గ్రామాల్లో పర్యటించి రైతుల ద్వారా నేరుగా సమాచారాన్ని సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్‌లో  నమోదు చేయాల్సి ఉంటుంది.

జిల్లాలో ఏఈఓల కొరత
రైతులనుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాల్సిన వ్యవసాయ విస్తరణాధికారులు జిల్లాలో పూర్తిస్థాయిలో లేరు. మొత్తం 140 మంది వ్యవసాయ విస్తరణాధికారులకు గాను 112 మంది మాత్రమే ఉన్నారు. రోజువారీ విధులే వారికి తలకు మించిన భారమయ్యాయి. దీనికితోడు ఇన్నిరోజులు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల విధుల్లో బీజీబీజీగా ఉన్నారు. మరోవైపు పీఎం కీసాన్, రైతుబంధు, రైతు బీమా కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించే పనితోనే సరిపోతోంది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు
ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న వ్యవసాయ విస్తరణాధికారులకు మూలిగే నక్కపై తాటిపండు పడిన విధంగా మరో పనిభారం పడింది. జిల్లావ్యాప్తంగా సుమారు 250 వరకు ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తేమశాతం కొలవడానికి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించారు.

ఒక్కో ఏఈఓ రెండు నుంచి మూడు గ్రామాలు తిరిగి కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలుకు సహకరించాల్సి ఉంటుంది.  మే 15 నాటికి రైతు సమగ్ర సర్వేను కచ్చితంంగా పూర్తి చేసి నివేదికను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అదేశించిన నేపథ్యంలో జిల్లా అధికారులు సోమవారం జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహించి వెంటనే సర్వే పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణాధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వి«ధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే ఎలా సాధ్యమవుతుందో అధికారులకే తెలియాలి.

39 అంశాలతో కూడిన సమాచారాన్ని సేకరించాలి
రైతు సమగ్ర సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 39 అంశాలతో కూడిన ప్రొఫార్మాను రూపొందించింది. రైతు భూమి విస్తరణ,  విద్యార్హతలు, నీటి పారుదల సౌకర్యం, సూక్ష్మనీటి పారుదల విస్తీర్ణం, నేల రకం సర్వే నంబర్ల వారీగా వివరాలు, రైతు పొలంలో లోతు స్వభావం, ఖరీఫ్‌లో వేసిన పంట వివరాలు, యాసంగిలో వేసిన పంటలు, ఎండాకాలంలో వేసిన పంటలు, తోటల విస్తీర్ణం, రాబోయే ఖరీఫ్‌లో వేసే పంటలు, పంటరుణం, పంటల బీమా వివరాలు, ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం, ఏయే పంటలను వేయడానికి రైతులు ఇష్టపడుతున్నారు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, ఫోన్‌ సౌకర్యం, సేంద్రియ వ్యవసాయం గురించి రైతుకు తెలుసా లేదా, కిసాన్‌ పోర్టల్‌ నుంచి రైతులకు సలహాలు అందుతున్నాయా లేదా అనే అం«శాలను సేకరించి నమోదు చేయాల్సి ఉంటుంది.

ఏఈఓలకు అగ్ని పరీక్షే
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జిల్లాలో 43 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే కాలు బయటపెట్టలేని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యం లో ఎండా కాలంలో గ్రామాల్లో పర్యటించి రైతులనుంచి సమగ్ర సమాచారాన్ని మే 15 లోగా సేకరించడం వ్యవసాయ విస్తరణాధికారులకు అగ్ని పరీక్షగా మారింది. పట్టణాల్లో నివాసం ఉంటున్న వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాలకు వెళ్లే సరికే పది గంటలు దాటుతుంది. ఒక్కో రైతునుంచి 39 అంశాలతో కూడిన ఫార్మాట్‌ను పూర్తి చేయాలంటే కనీసం గంట సమయం పడుతుంది. రోజూ ఎండలను దృష్టిలో పెట్టుకుని ఉదయం సాయంత్రం సమాచారాన్ని సేకరించినా రోజుకు 20 మంది రైతులనుంచి కూడా సమాచారాన్ని సేకరించలేని పరిస్థితి.

4.07లక్షల మందినుంచి సమాచారం సేకరించాలి
వ్యవసాయ శాఖ వద్ద నమోదైన సంఖ్య ప్రకారం 4లక్షల 7వేల మంది ఉన్నారు. వారందరినుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాలంటే వ్యవసాయ విస్తరణాధికారులకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

మళ్లీ ఎన్నికల విధులు
మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండడంతో తిరిగి వ్యవసాయ విస్తరణాధికారులకు ఎన్నికల విధులు పడే అవకాశం ఉంది. దీంతో సమగ్ర సమాచార సేకరణ సర్వేకు ఆటంకం ఏర్పడనుంది. ఇప్పటినుంచి సర్వే ప్రారంభించినా సుమారు ఆరు నెలల సమయం పడుతున్న సమయంలో తిరిగి ఎన్నికల విధులు రా వడంతో సర్వే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ సిబ్బంది అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా మే 15 నాటికి సర్వే పూర్తి కావడం సాధ్యమయ్యే పనేనా అని పలువురు వ్యవసాయ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించడం, ఎన్నికల విధులకు హాజరుకావడం, తిరిగి సర్వే చేయడం ఏకకాలంలో మూడు పనులు ఎలా చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఏఈఓలు కొట్టుమిట్టాడుతున్నారు.

కష్టమైనా సర్వే చేయక తప్పదు : జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ
వ్యవసాయ విస్తరణాధికారులు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేయడంలో బీజీగా ఉన్నారు. దీనికితోడు ఎన్నికల విధులకు వెళ్లాల్సి వస్తుంది. కష్టమైనా సర్వే చేయక తప్పదు. కొన్ని ప్రాంతాల్లో సర్వేను ఏఈఓలు ప్రారంభించారు. సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి సమష్టిగా కృషి చేస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement