జనం మనోగతం తెలుసుకునేందుకు సీఎం సర్వే | cm kcr asks to conduct survey on various govt schemes | Sakshi
Sakshi News home page

జనం మనోగతం తెలుసుకునేందుకు సీఎం సర్వే

Published Thu, Feb 15 2018 4:00 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

cm kcr asks to conduct survey on various govt schemes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలేమనుకుంటున్నారు.. వాటితో ఎంతమంది లబ్ధి పొందారు.. ఇవన్నీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెడతాయా.. వీటన్నింటిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీస్తున్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, గొర్రెలు, చేపల పంపిణీ పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకునేందుకు సర్వే చేయిస్తున్నారు. పంట రుణాల మాఫీతో ప్రయోజనం పొందిన రైతులు ఏమనుకుంటున్నారు? వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌పై ఫీడ్‌ బ్యాక్‌ ఏంటీ? మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై జనం మనోగతం ఎలా ఉందన్న అంశాలపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపేందుకు సన్నాహాలు చేశారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ వర్గాలతోపాటు ప్రైవేటు ఏజెన్సీలకు ఈ బాధ్యతలు అప్పగించారు. కొన్ని ఏజెన్సీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.

ఏ పథకం ఎలా ఉంది?
వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే పథకాల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదులు వస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఆసరా ఫించన్ల పంపిణీ పథకానికి తొలి మూడేళ్లు విశేషమైన ఆదరణ ఉన్నట్లుగా గుర్తించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు నెలనెలా జీతాల తరహాలోనే పింఛన్లు పంపిణీ చేసిన తీరు మంచిపేరు తెచ్చిపెట్టింది. దాదాపు 36 లక్షల మందికి లబ్ధి చేకూర్చే పథకం కావటంతో ప్రభుత్వం దీన్ని పక్కాగా అమల్లో పెట్టింది. కానీ గతేడాదిగా పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. మొదటి వారంలో అందే పింఛన్లు ఒక్కో నెలలో చివరి వారం వరకు చేతికందటం లేదు. దీంతో లబ్ధిదారుల్లో కొంత అసంతృప్తి నెలకొంటోందని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌), కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల్లోనూ అవినీతి పెరిగిందనే వాదనలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ పథకం అమలు కూడా పక్కదారి పట్టింది. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించేందుకు నిరాకరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మరికొన్ని ఆస్పత్రులు ముందుగానే సొమ్ము కట్టించుకుని, సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు తెచ్చుకొమ్మంటూ రోగి బంధువులపై ఒత్తిడి తెస్తున్నారు.

‘పెట్టుబడి’లో అవినీతికి చోటే ఉండొద్దు
సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న కోణంలోనూ సర్వే చేయిస్తున్నారు. గతేడాది ప్రభుత్వం పెద్దఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో భారీగా గొర్రెల రీసైక్లింగ్‌ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. నిరుడు చేపల పెంపకం పథకాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ రెండు పథకాలతో నిజంగానే లబ్ధి చేకూరిందా? లబ్ధిదారులేమనుకుంటున్నారు? అని సర్వేలో అడిగి తెలుసుకోనున్నారు. ఏయే పథకాల్లో ఎంత మేరకు అవినీతి జరిగిందన్న కోణంలోనూ సర్వేను డిజైన్‌ చేశారు. దేశంలో తొలిసారిగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సాయంపైనా రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం పురమాయించినట్లు తెలిసింది. అవినీతికి తావు లేకుండా ఈ డబ్బు రైతుల ఖాతాల్లో చేర్చేందుకు వీలైనన్ని అభిప్రాయాలు సేకరించాలని సూచించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement