రైతుకు బంధువే | Survey on raitubandu scheme | Sakshi
Sakshi News home page

రైతుకు బంధువే

Published Tue, Jun 5 2018 1:49 AM | Last Updated on Tue, Jun 5 2018 1:49 AM

Survey on raitubandu scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు బంధు పథకం అన్ని వర్గాలలో ఆదరణ పొందుతోంది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ దీనిపై చర్చ మొదలైంది. రైతులకు పెట్టుబడి సాయంకోసం ‘రైతు బంధు’పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఖరీఫ్‌ పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పథకంపై అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ (జే–పీఎల్‌ఎల్‌) పరిశోధన సంస్థ తెలంగాణలో సర్వే నిర్వహించింది. అమెరికాలోని మసాచుసెట్స్‌ కేంద్రంగా, పేదరికాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ పరిశోధనలు సాగిస్తోంది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రైతు బంధు పథకంపైనా సర్వే నిర్వహించింది. రైతుల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఈ పథకం ఎలా అమలు జరుగుతుంది, ఎలా ఉపయోగపడుతుందన్న కోణాల్లో సర్వేను సునిశితంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల మంది రైతులతో మాట్లాడారు. 5,700 మంది రైతులు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇచ్చారు. రానున్న పదిరోజుల్లో సుమారు 20 వేల మంది రైతుల అభిప్రాయాలు సేకరించాలని ఆ సంస్థ భావిస్తోంది. ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో మరో 40 వేల మంది లబ్ధిదారుల నుంచి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది.  

ఇప్పటివరకు జరిగిన సర్వే వివరాల ప్రకారం, రైతు బంధు పథకంతో పాస్‌పుస్తకాలు, చెక్‌లు అందుకున్న రైతులు 81 శాతం మంది ఉన్నట్లు అంచనా వేశారు. మరో 12.4 శాతం మంది మాత్రం ఏమీ పొందలేదని అన్నారు. చిన్న, సన్నకారు, భూస్వాములు చెక్‌లు అందుకున్న అంశంపైనా ఆసక్తికర విషయం బయటపడింది. ఎక్కువ శాతం రైతులు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చెక్‌లు అందుకున్నారని ఇలాంటి వారు 28 శాతం ఉన్నారని సర్వేలో వెల్లడైంది.

రూ.6వేల నుంచి రూ.10 వేల చెక్‌లు అందుకున్న వారు 21.4 శాతం మంది, రూ.3 వేల నుంచి రూ.6 వేలు అందుకున్న వారు 24 శాతం రైతులు ఉన్నట్లు తేలింది. రూ.50 వేలకు పైగా చెక్‌ను అందుకున్నవారు 0.8 శాతం మంది రైతులు మాత్రమే ఉన్నట్లు సర్వే వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న రైతులు కొన్ని సూచనలు చేశారు. ఎక్కువ భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయంపై కొంత నియంత్రణ ఉండాలని కోరారు. చెక్‌లు అందుకునే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని 96 శాతం మంది రైతులు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని 2.5 శాతం మంది చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement