రెండేళ్ల పనిచేశా
మహబూబ్‌నగర్ టౌన్: జీడీ ప్రియదర్శిని ఐదు నెలల క్రితం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె వచ్చినప్పటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే, పింఛన్లు, ఆహారభద్రత కార్డుల సర్వే, జాబితా తయారు ఇలా వరుసగా కార్యక్రమాలతో తీరికలేకుండా ఉంది. వీటన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు అధికారులతో మాట్లాడుతూ వారికి సూచనలు అందజేస్తూ బిజీబిజీగా ఉన్నారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ఆమె బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
జిల్లా గురించి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే... ‘జిల్లాకు వచ్చి కేవలం ఐదు నెలల 12 రోజులే. ఈ కొద్దికాలంలోనే రెండేళ్లలో చేయాల్సిన పనిని పూర్తిచేశా. ప్రభుత్వ ఆదేశాలపై నిక్కచ్చిగా వ్యవహరించమే నా ఉద్ధేశం. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగే అలవాటు లేదు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతోపాటు, సమగ్ర కుటుంబ సర్వే, పింఛన్లు, ఆహారభద్రత కార్దుల జారీని పకడ్బందీగా జారీ చేశా. ఇక పింఛన్ల విషయంలో అర్హులైన వారందరికీ అందించడమే లక్ష్యంగా రాత్రిబంవళ్లు పర్యవేక్షించా.
ఇక ఆహారభద్రత కార్డుల జారీలోనూ ఇదే తీరును ప్రదర్శించడంతో ఈ రోజు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తిచేయగలిగాం. ఇక జిల్లా పెద్దది, దీనికితోడు చాలా శాఖల్లో అధికారుల కొరత కారణంగా కొంత ఒత్తిడికి గురికావాల్సి వచ్చింది. రాజకీయాల విషయానికొస్తే నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. ప్రభుత్వ ఉత్తర్వులను తుచ తప్పకుండా పాటించడమే విధుల్లో నేను నేర్చుకొన్నా.
ఈ విషయంలో ఎవరు ఏమనుకొన్నా ఇలాగే వ్యవహరిస్తా. ఒక ఫైల్‌కు సంబంధిత ఆధారాలు పంపండని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా, అలాగే పంపించారు. ఈ కారణంగా ఆధారాలు ఇచ్చేంత వరకు వాటిని ఆపేశా. దీనివల్ల నామీద తప్పుడు ప్రచారం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను సామాన్యుడి నుంచి రాజకీయ నేతల వరకు పాటించా. ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు కలగొచ్చు, కానీ నిబంధనలు పాటించాననే సంతృప్తి నాకుంది. జిల్లాలో నేను పనిచేసిన 5నెలల 12రోజుల పాటు నాకు సహకరించిన ప్రజలు, అధికారులు, ఇతర నేతల సహకారం మర్చిపోలేనిది’. అని చెప్పారు.