గణేష్ ఉత్సవాలకు సహకరించాలి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాతంగా జరుపుకునేం దుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అన్నారు. పండుగలు వైభవంగా జరుపుకునేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముంటుందని, ప్రజలు కూడా అందుకు అనుగుణంగా కృషి చేయూలన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని మంగళవారం శాంతి కమిటీ, జిల్లా పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
శాంతిభద్రతలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు సమాచారా న్ని అందజేయాలన్నారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి కాలనీలో శాంతి కమిటీని ఏర్పాటు చేసుకొని, చిన్న చిన్న సమస్యలను స్థానికంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, విద్యుత్ తదితర అనుమతుల కోసం వసూలు చేసే రుసుం గతంలో మాదిరి గానే ఉంటుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. పర్యావరణాన్ని దృష్టి లో ఉంచుకుని మట్టి గణేష్‌లను నెలకొల్పాలని సూచించారు. జిల్లా ఎస్పీ నా గేంద్రకుమార్ మాట్లాడుతూ... శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు. శాంతిభద్రతలు అదుపు తప్పరాదని సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నందున బందోబస్తు కోసం సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపా రు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు కచ్చితంగా పాటించాలన్నారు.
శాంతి కమిటీ అవసరం రావద్దు: శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే
పండుగుల సందర్భంగా శాంతి కమిటీ అవసరం లేకుండానే ఇరు వర్గాలు కృషి చేయాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన పెద్దలు సమష్టిగా సున్నితమైన ప్రాంతాల్లో పర్యటిస్తే 90శాతం సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. విద్యుత్ అధికారులు మండపాలకు అందించే కరెంట్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు అనవసర ఆంక్షలు విధించవద్దన్నారు. గణేష్ ఉత్సవాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
పూర్తిగా సహకరిస్తాం: శాంతి కమిటీ నేతలు
గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాగానికి అన్ని రకాలుగా సహకరిస్తామని శాంతి కమిటీ నేతలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ, ముస్లిం మతపెద్దలు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.