అర్హులకే రుణమాఫీ
కొందుర్గు/మిడ్జిల్/కొత్తకోట టౌన్/నవాబుపేట: పంట రుణాలు, వ్యవసాయం పెట్టుబడుల కోసం బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న రైతుల జాబితాలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధంచేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని సూచించారు. ఒక్కో కుటుంబానికి లక్ష మాత్రమే మాఫీ అయ్యే విధంగా చూడాలని అధికారులను కోరారు. ఎట్టి పరిస్థితుల్లో రుణాలు తీసుకున్న ఏ ఒక్క రైతు పేరు తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పొరపాట్లు జరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. కొందుర్గు ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మండలస్థాయి సంయుక్త బ్యాంకర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల జాబితాలను గ్రామాలవారీగా విభజించి ఒకే రైతు రెండు బ్యాంకుల్లో రుణాలు పొందినట్లయితే గుర్తించాలని సూచించారు. సమావేశంలో పంటరుణాల ప్రత్యేకాధికారి మదన్‌మోహన్‌శెట్టి, కన్వీనర్ శ్రీదివ్య, ఎంపీడీఓ శ్రీనివాసాచార్యా వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
జాబితా స్పష్టంగా ఉండాలి
రైతులు పంటసాగు కోసం బ్యాంకులో తీసుకున్న రుణాలను ప్రభుత్వం లక్ష వరకు మాఫీ చేస్తుండడంతో రైతుల జాబితా స్పష్టంగా ఉండాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అధికారులకు సూచించారు. ఆదివారం ఆమె మిడ్జిల్ తహశీల్దార్ కార్యాలయంలో బ్యాంకర్ల సమావే శాన్ని పరిశీలించారు. అనంతరం కొత్తకోట తహశీల్దార్ కార్యాలయంలో బ్యాంక ర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకేరైతు వివిధ బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకొని ఉంటే అన్ని బ్యాంకుల జాబితాను నిశితంగా పరిశీలించి.. ఒక రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ వర్తించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా పంటరుణం, బంగారుపై తాకట్టు రుణం తదితర వాటిని ‘ఏ’, ‘బీ’ జాబితాలుగా, రెండు కలిపి ‘సీ’ లిస్టుగా, గ్రామాలు, బ్యాంకుల వారీగా డీ లిస్టులు తయారుచేసి రైతుల వివరాలను తమకు ఈనెల 25లోగా అందజేయాలని వారికి సూచించారు. రుణాలు పొందిన రైతులను గుర్తించేందుకు వీఆర్వోలు బ్యాంకు అధికారులకు సహకరించాలని కోరారు. జీఓ.69 ప్రకారం రుణమాఫీకి అర్హులైన రైతులను గుర్తించాలని ఆమె సూచించారు. రైతుల పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డు, ఇతర వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో మిడ్జిల్ తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ తిర్పతయ్య, వివిధ బ్యాంకు మేనేజర్లు, క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. కొత్తకోటలో జరిగిన సమావేశంలో వనపర్తి ఆర్డీఓ రాంచందర్, కొత్తకోట తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
మండలానికో ప్రత్యేకాధికారి
రైతులను జాబితాను రూపొందించడంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అధికారులకు సూచించారు. ఆదివారం ఆర్డీఓ అధ్యతన నిర్వహిస్తున్న రుణమాఫీ సమీక్ష సమావేశానికికలెక్టర్ హాజరయ్యూరు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క నిజమైన రైతుకు అన్యాయం జరగరాదని, బినామీ రైతులను జాబితాలో చేర్చకుండా బ్యాంకర్లు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మండలానికో ప్రత్యేకాధికారితో రుణమాఫీకి సంబంధించిన రైతుల జాబితాపై కసరత్తు ప్రారంభించామన్నారు.
ఈ ప్రక్రియ 26 తేది వరకు కొనసాగుతుందని, 26న రైతుల తుది జాబితా విడుదల చేస్తే, 27వ తేదీ నుంచి 29 వరకు సామాజిక బృందంతో తనిఖీలు నిర్వహించి రుణమాఫీ అర్హుల జాబితాను ప్రకటిస్తామన్నారు. నవాబుపేట మండలంలో 8,233 మంది రైతులు ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌తో పాటు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారని, ఇందుకుగాను బ్యాంకుల వారిగా రైతుల రుణాలపై పరిశీలన నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ హన్మంతురెడ్డి, నవాబుపేట తహశీల్దార్ జ్యోతి, ఇన్‌చార్జీ ఎంపీడీఓ సంధ్యారాణి, ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.