సేవ చేయకుంటే.. మూసుకోండి
మహబూబ్‌నగర్ టౌన్: ప్రజలకు సేవ చేయకుండా, మీ ఇష్టానుసారం వ్యాపారాలు చేసుకుంటే ఇకపై సహించేది లేదని, అలాంటి బ్యాంక్‌లో జిల్లాలో అవసరంలేదని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు.
ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా లబ్దిదారులకు సబ్సిడీ, రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించి ముందస్తుగానే బ్యాంక్‌లకు నిధులు మంజూరు చేస్తున్నా, వాటితో అన్ని విధాల లబ్ధి పొందుతూ, ప్రజలకు అందించడంలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. ప్రజల సొమ్ముతో బ్యాంక్‌లను నడుపుకుంటూ వారికి సేవలు అందించే బ్యాంక్‌లను సహించేది లేదన్నారు. ప్రభుత్వం రైతులకు 25శాతం రుణమాఫీ ప్రకటిందని, వారందరికీ కొత్త రుణాలు ఇవ్వాలని చెబుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనంతరం బ్యాంక్‌లవారీగా సమీక్ష నిర్వహించారు.
మూడు రోజుల్లో ఖాళీ చేయూలి
ప్రభుత్వం రుణమాఫీ కింద రూ.2కోట్లు మీ బ్యాంక్‌కు ఇచ్చి, మిగతా డబ్బులకు గ్యారంటీ ఇచ్చింది. అయినా రైతులకు రుణాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన మిమ్మల్ని క్షమించేది లేదు. మూడు రోజుల్లో జిల్లా కేంద్రంలోని బ్రాంచ్‌ను మూసివేయూలని ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్ అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జరిమానాతో సహా చెల్లించాలని, లేని పక్షంలో బ్యాంక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సి ఉంటుం దన్నారు. ఇదే తరహాలో పని చేస్తున్న బ్యాంక్‌లన్నింటికీ ఇదే చివరి హెచ్చరికని, నెలాఖరునాటికి రైతులకు రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయూలని సూచించారు.
రూ.6,300కోట్లతో ‘వనరుల ఆధారిత రుణప్రణాళిక’
యేడాదికి సంబంధించి నాబార్డ్ రూపొందించిన ‘వనరుల ఆధారిత రుణ ప్రణాళిక’ను జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని విడుదల చేశారు. ఈసందర్బంగా నాబార్డ్ ఏజీఎం శ్రీనాథ్ మాట్లాడుతూ, గతేడాదితో పోలిస్తే జిల్లా వనరులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకు 17శాతం అధికంగా నివేదికను రూపొందించామన్నారు. ఇందులో ప్రధానంగా పంట రుణాలు, కాలపరిమితి రుణాలకు రూ..5,223కోట్లు, ఎంఎస్‌ఈ, స్వయం ఉపాధి, అగ్రో ప్రాసెసింగ్ రంగాలకు రూ..726కోట్లు, ప్రధాన్యతా రంగాలకు రూ..349కోట్ల చొప్పున కేటాయించామన్నారు. ఇవే కాకుండా, ప్రజలకు అవసరమైన వనరులను ప్రణాళికలో పొందుపరిచేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కలెక్టర్ స్పందిస్తూ వ్యవసాయ గోదాంలు, శీతల గిడ్డంగులు, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు కృషి చెయ్యాలన్నారు.
ఖరీఫ్ రుణ లక్ష్యాన్ని అధిగమించాలి
ఖరీఫ్‌కు సంబంధించి రూ..1541కోట్లు రుణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ..వెయ్యికోట్లు ఇచ్చామని, మిగిలిన రూ..476కోట్లను వెంటనే పూర్తి చేయూలని లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ సూచించారు. ఇంత వరకు పెండింగ్‌లో ఉన్న రుణాలు చెల్లించి, కొత్త రుణాలను ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్, ఎపిజివిబి బ్యాంక్‌ల ఎజిఎంలు వెంకటేశ్, ఆనంద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.