మాఫీ వంచన
- రుణమాఫీలో దగాపడ్డ అన్నదాత
- రుణాలు పొందిన రైతులు 8,70,321 మంది
- మాఫీ 3,57,457 మందికే
- వీరిలో 20శాతం మందికి బ్యాంకుల కొర్రీలు
- వినతులకు దరఖాస్తుల వెల్లువ
జిల్లాలో అన్నదాతలు వంచనకు గురయ్యారు. 90 శాతం మంది రైతులకు రుణమాఫీని వర్తింపచేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం జిల్లాలో రుణాలు పొందిన రైతుల్లో 40 శాతం మందికి కూడా మాఫీ వర్తింపచేయలేదు.
సాక్షి, చిత్తూరు : గత డిసెంబర్ 31నాటికి జిల్లాలో 8,70,321 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రూ.11,180.25 కోట్లు వ్యవసాయ రుణాలను తీసుకున్నారు. స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం లక్షా 50 వేల రూపాయల లోపు రుణం ఉన్నవారికి మాత్రమే మాఫీ అంటూ తొలుత 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్ కార్డులు, రేషన్‌కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి మాఫీకి అర్హులుగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. చివరకు కొర్రీలు పెట్టి కేవలం 3,57,457 మంది మాత్రమే అర్హులంటూ తేల్చింది. అయితే మొదటి విడతలో 3,06,544 మంది జాబితా విడుదల చేశారు. రెండో విడతలో 1,42,229 మందికి రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం తొలుత ప్రకటించినా కేవలం 50,913 మందికి మాత్రమే రుణమాఫీని వర్తింపచేశారు.
ఈ లెక్కన జిల్లాలో మొత్తం 8,70,321 మందికి గాను కేవలం 3,57,457 మందికి మాత్రమే రుణమాఫీ వర్తింపజేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో వివిధ సాంకేతిక సమస్యలతో 20 శాతానికి పైగా జాబితా బ్యాంకుల్లో పెండింగ్ పడినట్లు తెలుస్తోంది. రైతులు మొత్తం 11,180.25 కోట్ల రుణాలు తీసుకోగా, ప్రభుత్వం కేవలం 1,383.73 కోట్లు మేర మాత్రమే రుణమాఫీ చేస్తున్నట్లు లెక్కలు తేల్చింది. ఇందులో ఇప్పటివరకు కేవలం 456.44 కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా ఈ మొత్తాన్ని పూర్తిస్థాయిలో విడుదలచేయలేదు. రుణమాఫీ హామీ అమలులో జాప్యం వల్ల జిల్లా రైతులపై రూ.9.39 కోట్ల మేర అపరాధ వడ్డీభారం పడినట్లు బ్యాంకు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 4,53,162 మంది రైతులు బంగారు ఆభరణాలను వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా వ్యవసాయ రుణాలను తీసుకున్నారు.
వారిని రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తున్నాయి. కరువు పుణ్యమా అని అన్నదాతల చేతుల్లో నయాపైసా లేదు. రుణాలు చెల్లించి బంగారం విడిపించుకునే పరిస్థితి లేదు. హామీలను గంగలో కలిపి ముఖ్యమంత్రి అన్నదాతలను వంచించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీపై వినతిపత్రాలు స్వీకరించగా సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా దాదాపు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే రుణమాఫీ ఏమేరకు అమలయ్యిందో స్పష్టమవుతోంది.