నగలు వేలం వేస్తే ప్రాణాలు వదిలేస్తాం
- మా భార్యల తాళిబొట్లు తాకట్టుపెట్టాం..వాటిని పాడుకుంటారా?
- వ్యాపారులకు మానవత్వం లేదా
- మండిపడ్డ రైతులు
- నాలుగన్నర గంటలపాటు బ్యాంకు వద్ద ధర్నా
- రైతులకు అండగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి
- బంగారు నగల వేలం వాయిదా
వ్యవసాయం కోసం బ్యాంకులో తనఖా ఉంచిన నగలను వేలం వేస్తే తాము ప్రాణాలు వదిలేస్తామని రైతులు తేల్చి చెప్పారు. వేలం పాడేందుకు వచ్చిన వ్యాపారులను అడ్డుకున్నారు. నాలుగు గంటలకు పైగా బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మద్దతు తెలిపారు. చివరకు బ్యాంకు మేనేజర్ నగల వే లం వాయిదా వేశారు. ఈ ఘటన బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలోని వ్యవసాయమార్కెట్ ఆవరణంలో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ వద్ద చోటు చేసుకుంది.
శ్రీకాళహస్తి : పలువురు రైతులు పంటల సాగుకోసం శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్‌బీఐలో బం గారు నగలు తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీతో తమ రు ణాలు మాఫీ అవుతాయని ఆశించారు. దీనిపై గద్దెనెక్కిన చంద్రబాబు తర్వాత పట్టించుకోలే దు. దీంతో బ్యాంకు అధికారులు 81 మంది రైతుల బంగారు నగలు బుధవారం వేలం వేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. వేలం వాయి దా వేయాలని లేదంటే.. ధర్నా చేస్తామని మేనేజర్‌కు రెండురోజుల క్రితం రైతులు తెలియజేశా రు.
ఆయన వాయిదా వేయడానికి కుదరదని చెప్పారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున బుధవారం ధర్నాకు దిగారు. మధ్యాహ్నం 2.45 గంటల నుంచి బ్యాంకు వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చే స్తూ ధర్నా చేపట్టారు. పలువురు బంగారు వ్యాపారులు రైతుల నగలను వేలం పాట పాడడానికి బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. రైతులు వారిని అడ్డుకున్నారు. ‘‘మీకు మానవత్వం లేదా...మా భార్యల తాళిబొట్లు సైతం వ్యవసాయం చేయడానికి బ్యాంక్‌లో తాకట్టు పెట్టాం. వాటిని వేలం ద్వారా తీసుకుపోతారా’’ అంటూ మండిపడ్డారు. దీంతో కొందరు వ్యాపారులు వెళ్లిపోయారు.
కొందరు మాత్రం బ్యాంక్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. వారిని రైతులు అడ్డుకున్నారు. ముందుగానే అక్కడకు చేరుకున్న పోలీసులు సైతం వ్యాపారులకు నచ్చచెప్పారు. మరోవైపు బ్యాంక్ మేనేజర్ సాయంత్రం 5.30గంటల సమయంలో వ్యాపారులు వస్తే వేలం పాట కొనసాగిస్తామని రైతులకు స్పష్టం చేశారు. దీంతో రైతులు 5.30గంటల వరకు వ్యాపారులను బ్యాంక్‌లోకి పోకుండా కాపలా కాశారు.
ఆ తర్వాత రైతులు 5.45 గంటల సమయంలో బ్యాంక్ మేనేజర్ మోహన్‌కృష్ణను కలిశారు. సార్ వేలం వాయిదా వేసినట్లేనా...అని ప్రశ్నించారు. మరో గంట సమయం చూస్తామని చెప్పారు... మళ్లీ 6.45 గంటల వరకు బ్యాంక్ వద్ద కాపలాగా ఉన్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి బ్యాగ్‌తో బ్యాంక్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. దీంతో రైతులు అడ్డుకున్నారు.
పరిస్థితి గందరగోళంగా మారిం ది. బ్యాంక్ సిబ్బందికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. దీంతో రాత్రి 7.15 గంటల సమయంలో మేనేజర్ మోహన్‌కృష్ణ రైతుల బంగారం నగల వేలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు హర్షం వ్యక్తం చేశారు. వారికి అండగా ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కొట్టేడి మధుశేఖర్, అంజూరు శ్రీనివాసులు, కోటేశ్వరరావు, మునిరత్నంరెడ్డి, భక్తవత్సలనాయుడు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.