- రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ను ప్రశ్నించిన రైతులు
- గత పంటలబీమా మాటేమిటని నిలదీత
యలమంచిలి: తుపాన్లప్పుడల్లా అధికారులు కార్లలో వచ్చి హడావుడి చేస్తున్నారు... అనంతరం మరిచిపోతున్నారు..గతేడాది తుపాను పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు. పంటలబీమా సొమ్ము అకౌంట్లకు జమకాలేదంటూ రైతులు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు ఎదుట తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పర్యటనల వల్ల సమయం వృథా అవుతోంది తప్ప మా బతుకులు మారడం లేదని వాపోయారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిని పరిశీలించేందుకు శుక్రవారం యలమంచిలి వ్యవసాయ సబ్‌డివిజన్‌కు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ మధుసూదనరావును యలమంచిలి మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లి, రాంబిల్లి మండలం నారాయణపురం రైతులు నిలదీశారు. అధికారుల బృందం యలమంచిలి వ్యవసాయ సబ్‌డివిజన్‌లోని ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి మండలాల్లో పర్యటించింది. పలుచోట్ల దెబ్బతిన్న వరి, చెరకు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను పరిశీలించారు. యలమంచిలి మండలం బయ్యవరం, పులపర్తి, తెరువుపల్లి గ్రామాల సమీపంలో నష్టపోయిన రైతులతో అధికారులు మాట్లాడే ప్రయత్నం చేశారు.
తెరువుపల్లి - నారాయణపురం మధ్య మైనర్ శారద నది ఎడమ గట్టుకు పడిన గండి ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లారు. భారీ వర్షాలప్పుడు ఏటా ఇక్కడ గండి పడుతోంది. గతేడాది అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. శాశ్వత పరిష్కారం చూపుతానని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇది నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో హుదూద్ ప్రభావంతో మరోసారి తాజాగా మరింత పెద్దగండి ఇక్కడ పడింది. దీంతో దిగువున ఉన్న పది గ్రామాలకు బాహ్యప్రపంచంతో వారం రోజులుగా సంబంధాలు తెగిపోయాయి.
రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో వ్యవసాయ కమిషనర్ ఇక్కడ పర్యటనకు వచ్చి వారి ఆగ్రహాన్ని శుక్రవారం చవిచూడాల్సి వచ్చింది. అనంతరం కమిషనర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గండి పూడ్చడానికి ప్రతిపాదనలు పంపాలని డీఈఈ ప్రసాద్‌ను ఆదేశించారు.
గతేడాది పరిహారం వెంటనే బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేలా చూస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో యలమంచిలి వ్యవసాయ సబ్‌డివిజన్ అసిస్టెంట్ డెరైక్టర్ డి.మాలకొండయ్య, ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి వ్యవసాయాధికారులు కె.ఉమాప్రసాద్, వి.మోహన్‌రావు, బి.నర్సింహారావునాయక్, ఏఈవో జి.దేముడు పాల్గొన్నారు.