ఓరుగల్లు ఆతిథ్యం | All Districts Collectors Meeting in warangal | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు ఆతిథ్యం

Published Wed, Aug 28 2019 9:47 AM | Last Updated on Wed, Aug 28 2019 9:47 AM

All Districts Collectors Meeting in warangal - Sakshi

హరితహోటల్‌ ఆవరణలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌తో కలెక్టర్ల గ్రూప్‌ ఫొటో 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు చారిత్రక ఓరుగల్లు ఆతిథ్యమిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు హన్మకొండలోని హరిత హోటల్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి మూడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల కలెక్టర్లతో పాటు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ హాజరయ్యారు. సుదీర్ఘంగా సుమారు 7.50 గంటల పాటు ఈ సమావేశం జరగగా మధ్యాహ్న భోజనం హరిత హోటల్‌లో.. రాత్రి భోజనం అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేశారు. నోరూరించే తెలంగాణ రుచులతో భోజన ఏర్పాట్లు చేయగా పాత, కొత్త అధికారుల పలకరింపులతో సమావేశం సాగింది. ఇక రాత్రి ఇక్కడ బస చేసిన కలెక్టర్లు బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్నారు.  

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తున్నట్లు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ తెలిపారు. ఎక్సైజ్, కమర్షియల్‌ ట్యాక్స్, రెవెన్యూ శాఖల స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా వ్యవహఱిస్తున్న సోమేష్‌కుమార్‌ మంగళవారం హన్మకొండలోని హరిత హోటల్‌లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో వివిధ అంశాలపై చర్చించారు. ఆనంతరం మీడియాకు బ్రీఫింగ్‌ ఇచ్చారు. మూడేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టును చూడడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మొదటగా రెవెన్యూ వ్యవస్థను మెరుగుపరిచేందుకు జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించినట్లు వివరించారు. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా మెరుగైన పౌర సేవలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను కార్యాచరణలోకి తీసుకుని ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లనున్నట్లు సోమేష్‌కుమార్‌ వెల్లడించారు. 

సోమేష్‌కుమార్‌తో మొదలు...
హరిత కాకతీయ హోటల్‌లో మంగళవారం మధ్యాహ్నం 2.40 గంటలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి 30 జిల్లాల కలెక్టర్లతో పాటు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటట్రీ సోమేష్‌కుమార్, ముఖ్య అధికారులు హాజరయ్యారు. అధికారుల్లో మొదటగా సీసీఏల్‌ఏ సోమేష్‌కుమార్‌ ఉదయం 11గంటలకు హరిత హోటల్‌కు చేరుకోగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, ఆర్డీఓ వెంకారెడ్డి, హన్మకొండ తహసీల్దార్‌ బావుసింగ్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సమావేశ ఏర్పాట్లపై ఆయనకు వివరించారు. కలెక్టర్ల కాళేశ్వరం టూర్‌కు రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు వస్తారని ముందుగా అనుకున్నప్పటికీ మంగళవారం సీసీఎల్‌ఏ సోమేష్‌కుమార్‌ సమావేశం ముగిసే మహబూబ్‌నగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు మినహా మిగిలిన వారందరూ వచ్చారు. అయితే వీరు బుధవారం కాళేశ్వరం సందర్శనకు వచ్చే అవకాశముందని సమాచారం.

ప్రత్యేక బస్సులో కాళేశ్వరానికి...
అన్ని జిల్లాల కలెక్టర్లు బుధవారం ఉదయమే తెలంగాణ టూరిజం శాఖకు చెందిన ప్రత్యేక ఏసీ బస్సు(ఏపీ 23 వై 5128) లో ఉదయం 6 గంటలకు కా>ళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్నారు. హరిత హోటల్‌లో మంగళవారం జరిగిన వర్క్‌షాప్‌ అనంతరం రాత్రి వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. 

నోరూరించే రుచులతో విందు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులకు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. ఇదే విషయాన్ని సమావేశం ప్రారంభంలో సీసీఎల్‌ఏ సోమేష్‌కుమార్‌ ప్రస్తావిస్తూ కలెక్టర్‌ను అబినందించారు. తక్కువ సమయంలో మంచి ఆతిథ్యం ఏర్పాటుచేశారని కొనియాడారు. హరిత హోటల్‌ లో మధ్యాహ్న భోజనంగా పసందైన రుచులు వడ్డించారు. తెలంగాణ, ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌత్‌ ఇండియా ఫేమస్‌ వంటకాలు ఉన్నాయి. నాటు కోడి, బాయిలర్‌ కోడి, మేక మాంసం, కొర్రమీను ప్రై, కోడిగుడ్లతోపాటు స్వీట్లు కుర్బానీకా మీటా, కాలా జామూన్, ఐస్‌క్రీంలు ఇందులో ఉన్నాయి.


కలెక్టర్లకు సూచనలు చేస్తున్న స్పెషల్‌  చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ 

నేడు కాళేశ్వరానికి కలెక్టర్ల బృందం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు బుధవారం సందర్శించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హన్మకొండలో ఉన్న కలెక్టర్లు బుధవారం ఉదయం 6.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 9.15గంటలకు మహదేవపూర్‌ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడ అల్ఫాహారం తీసుకున్నాక 10.15గంటలకు ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌తో సమావేశమవుతారు. ఇక 11గంటలకు మేడిగడ్డ బ్యారేజీని వీక్షించి కాళేశ్వరం చేరుకుని శ్రీకాళేశ్వరముక్తీశ్వరాలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత 12.30గంటలకు కన్నెపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్న కలెక్టర్లు మధ్యాహ్నం ఒంటి గంటకు లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 1.45గంటలకు కన్నెపల్లి గెస్ట్‌హౌస్‌లో భోజనం చేశాక పెద్దపల్లి జిల్లా నందిమేడారం టన్నల్‌ పంపుహౌస్‌ పరిశీలించేందుకు బయలుదేరతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

కలెక్టర్‌ బంగ్లాలో రాత్రి భోజనం
రెండు రోజుల కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన కలెక్టర్లకు మొదటి రోజైన మంగళవారం మధ్యాహ్న భోజనం, బస హరిత హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఇక రాత్రి భోజనాలు మాత్రం సుబేదారిలోని అర్బన్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది కోసం ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయగా అశోక హోటల్‌ నుంచి భోజనాలు తెప్పించారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల్లోఎక్కువగా తెలంగాణ వారే ఉండటంతో రాత్రి భోజనం మెనూలో ఇక్కడి వంటలకే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మాంసాహారం వంటకాల్లో పచ్చి రొయ్యల వేపుడు, చేపల వేపుడు, నాటుకోడి వేపుడు, చికెన్‌ పింగ్‌ రోల్స్, చికెన్‌ కబాబ్స్, మటన్‌ ఫ్రై, మటన్‌ కర్రీ, బగారా, బిర్యానీ తెప్పించారు. అలాగే, శాఖాహారంలోనూ సాంబార్, ఇతర కూరలు, చట్నీలు ఉన్నాయి. స్వీట్ల విషయంలో ప్రత్యేకించి డ్రై ఫ్రూట్స్‌తో సిద్ధం చేయించగా వరంగల్‌ అర్బన్‌  కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌తో పాటు అధికారులను అందరూ అభినందించారు.

పాతవారి పలకరింపులు
హరిత హోటల్‌లో జరిగిన సమావేశానికి హాజరైన కలెక్టర్లలో కొందరు గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన వారు ఉన్నారు. దీంతో జిల్లాలోని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు వారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ మేరకు కలెక్టర్లు సైతం తమ వద్ద పనిచేసిన ఉద్యోగులను పేరుపేరునా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. సమావేశం ప్రారంభానికి ముందు కొంతసేపు ఇదే కార్యక్రమం కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో వరంగల్‌ ఆర్డీవోగా పనిచేసి సర్వే సంగీత, డీఆర్‌డీఏ పీడీ, జెడ్పీ సీఈఓగా పనిచేసిన వాసం వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఐఏఎస్‌ అధికారులుగా జిల్లాకు వచ్చారు. దీంతో గతంలో వారి వద్ద పనిచేసిన అధికారులు, ఉద్యోగులు కలిశారు. 

రెవెన్యూ... పోలీసు... ఎక్సైజ్‌
హన్మకొండలోని హరిత హోటల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అత్యున్నత అధికారులందరూ రానుండడంతో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడే మకాం వేసి ఏ లోటు రాకుండా చూశారు. హరితహోటల్‌ ఆవరణలోకి కేవలం కలెక్టర్ల వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. ఇక కలెక్టర్ల సహాయకులు, భధ్రతా సిబ్బందికి ఆర్‌అండ్‌బీ, సర్క్యూట్‌ అతి«థిగృహాల్లో గదులు కేటాయించారు. భోజనాలు మాత్రం అందరికీ హరిత హోటల్‌లో ఏర్పాటు చేశారు. పోలీసుల ఆధ్వర్యాన కట్టుదిట్టమైన భద్రత కొనసాగింది. ప్రతి ఒక్కరినుంచి వివరాలు అడిగి తీసుకున్నారు. స్థానిక అధికారులతో నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులను లోపల ఉండనిచ్చారు.

వర్క్‌షాప్‌లో అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లు సీహెచ్‌.శివలింగయ్య, వాసం వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, వినయ్‌కృష్ణారెడ్డి, హరిత, శ్వేతా మహంతి, ఆర్‌వీ.కర్ణన్, కృష్ణభాస్కర్, అనితా రామచంద్రన్, రజత్‌కుమార్‌ షైనీ, సర్ఫరాజ్‌ అహ్మద్, హన్మంతరావు, భారతి హోలీకేరి, శశాంక, శ్రీధర్, వెంకట్రావు, అమయ్‌కుమార్, దివ్య దేవరాజన్, రాజీవ్‌గాంధీ హన్మంతు, మాణిక్‌ రాజా, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement