సాక్షి, బోయినపల్లి(కరీంనగర్) : మధ్య మానేరు(శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ అత్తగారి గ్రామం కొదురుపాక వేదికగా అఖిలపక్షం నేతలు శుక్రవారం పొలికేక వేశారు. 13 ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిశ్కారం కోసం ఇక హైదరాబాద్ వేదికంగా ఉద్యమం తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైతే ‘చలో అసెంబ్లీ’ పేరిట కొదురుపాక నుంచి రాష్ట్ర రాజధానిలోని అసెంబ్లీ, ప్రగతి భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు.
అక్రమార్జనలో ఒక్కశాతం వెచ్చించినా..
ఇసుక మాఫియాతో రూ.వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించిన టీఆర్‌ఎస్ నేతలు.. అందులో ఒకశాతం ఖర్చు చేసినా నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. చింతమడక వాసులకు సీఎం కేసీఆర్ అడుగకుండానే ఇంటింటికీ రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించారని అన్నారు. మధ్యమానేరు నిర్వాసితులు ఏం పాపం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల ఉద్యమాలు ఇక గ్రామాల నుంచి రాష్ట్ర రాజధానికి తరలివెళ్తాయని పేర్కొన్నారు. నిర్వాసితుల పక్షాన ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని ఆయన అభయమిచ్చారు.
బండి సంజయ్ మాటల తుటాలు..
తెలంగాణ ప్రజల ఓట్లతో సీట్లు సాధించి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్.. తన అత్తగారి మండలంలోని నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిర్వాసితుల హక్కుల సాధనకు అవసరమైతే ప్రగతిభవన్‌ను ముట్టడించాలని, దీనిపై ప్రతీ నిర్వాసితుడు సిద్ధంగా ఉండాలని కోరారు. నిర్వాసితుల ఉద్యమాలను చూసి టీఆర్‌ఎస్ నేతల లాగులు తడవాలన్నారు. జెండాలు, కండువాలు పక్కన పెట్టి ఒకేజెండాగా నిర్వాసితుల పక్షాన అఖిల పక్షం నేతలు పోరాడాలని కోరారు.
సీఎం అసమర్థతకు నిదర్శనం
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడం వెనుక సీఎం కేసీఆర్ అసమర్థత ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడంలో వైఫల్యం చెందడంతో జాతీయ హోదా రాలేదని అన్నారు. జాతీయ హోదా వచ్చినట్లయితే 60 శాతం నిధులు కేంద్రం భరించేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కమిషన్లు రావని నివేదిక సవ్యంగా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు వరద కాలువకు కాళేశ్వరం నీరు రావడంలేదని కడెం ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయన్నారు.
గ్యాస్ బెలూన్‌లతో నిరసన
సీఎం కేసీఆర్ మిడ్‌మానేరు ప్రాజెక్టు పర్యవేక్షిం చడానికి హెలికాప్టర్‌లో వస్తే ముంపు గ్రామాల ప్రజలు వారి గ్రామాల నుంచే బెలూన్లు పైకి ఎగురవేసి సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌కు నిరసన సెగ తగిలేలా చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. సీఎం బంధువులతోపాటు ముంపు గ్రామాల నిర్వాసితులకు అన్నిరకాల ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోరాటాలతోనే పరిహారం సాధ్యం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలనే శరణ్యమన్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభక్క ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇళ్ల నిర్మాణాలకు రూ.5.4లక్షలు ఇచ్చేలా చూడాలన్నారు.
పాటలతో ఉర్రూతలూగించి విమలక్క, సోమన్న..
అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, గాయకుడు ఏవూరి సోమన్న నిర్వాసితులు వేతలపై వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పాటల రూపంలో ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల చప్పట్ల ధ్వని ప్రగతిభవన్ గడగడలాడాలని కోరారు.
వర్షంలో తడిసిన నిర్వాసితులు...
సభ ప్రారంభంలో కొద్దిసేపు వర్షం కురిసినా నిర్వాసితులు లెక్కచేయకుండా తమ సమస్యల పరిష్కారం కోసం బహిరంగ సభ స్థలంలోనే కూర్చున్నారు. కొదురుపాక బహిరంగ సభ స్థల పరిసరాల్లో వేలాది మంది నిర్వాసితులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment