సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ప్రియాంకారెడ్డిపై సామూహిక అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాల్లో ఇంకా కఠినమైన మార్పులు తీసుకురావాలని కోరారు. ఇలాటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య దురదృష్టకరమని, ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బాధితురాలి తల్లిదం డ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు జాప్యం చేశారని, అయినా తమ నిర్లక్ష్యం ఏమీ లేదని పోలీస్ కమిషనర్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
మహిళలపై నేరాలను నియంత్రించలేమా?: పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంకా ఎంత మంది అమ్మాయిలు చనిపోవాలి? ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థ దీనిని నియంత్రించలేదా? దోషులను నిర్దిష్ట కాల వ్యవధిలో శిక్షించలేరా?’అంటూ సమాజం ప్రశ్నిస్తోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు పొంగులేటి శనివారం ఓ లేఖ రాశారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ పీనల్ కోడ్‌ను సరికొత్తగా తీసుకురావాలని పొంగులేటి పేర్కొన్నారు. స్త్రీలపై నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చట్టం రావాలన్నారు.
మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారహితం: ఎంపీ సంజయ్
సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య కేసుపై మంత్రుల మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాల్సిన హోంమంత్రి మహమూద్ అలీ బాధితురాలు పోలీసులకు ఫోన్ ఎందుకు చేయలేదని ఎదురు ప్రశ్నించడం దారుణమన్నారు. ఇంటింటికీ పోలీసులను పెట్టలేమన్న మంత్రి తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రజలను హేళన చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో సంజయ్ డిమాండ్ చేశారు.
ప్రియాంకారెడ్డి ఘటన బాధ కలిగించింది: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి ఘటన తన మనసుకు తీవ్ర బాధ కలిగిం చిందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన దుశ్చర్యగా భావిస్తున్నానని, ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి పాశవిక దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment