ఉత్సవాలకు రెడీ! | all ready for Telangana state formation celebrations arrangements | Sakshi
Sakshi News home page

ఉత్సవాలకు రెడీ!

Published Sat, May 30 2015 3:57 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

ఉత్సవాలకు రెడీ! - Sakshi

ఉత్సవాలకు రెడీ!

అంబరాన్నంటేలా ఆవిర్భావ సంబురాలు
అధికారులతో నిత్యం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్ష
జూన్ 2 నుంచి 7 వరకు ఘనంగా వేడుకలు
ముస్తాబైన కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు
కలెక్టరేట్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలకు ఏర్పాట్లు
మంత్రి పోచారం ఆధ్వర్యంలో అవార్డుల కమిటీ భేటీ


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకులను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇందూరు ముస్తాబవుతోంది. ఎందరో ఉద్యమకారులు, మ రెందరో విద్యార్థి మేధావుల బలి దానం, తెలంగాణ ఉద్యమాల ఫలితం గా గతేడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని వెన్నంటి నడిపించిన టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్ట ఆవిర్భా వ వేడుకలను వారం రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ప్రతిరోజు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ జూన్ 2 నుంచి 7 వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జాయిం ట్ కలెక్టర్ ఎ.రవిందర్‌రెడ్డి ఓ వైపు ఆవి ర్భావ వేడుకలపై రాష్ట్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లలో మాట్లాడుతూ.. మరోవైపు ఉత్సవాల విజయవంతానికి జిల్లా ఉన్నతాధికారులతో వేసిన 13 కమిటీలతో సమీక్షలు జరుపుతున్నారు. జిల్లా అధికార యంత్రాం గం, ఉద్యోగులంతా ఆవిర్భావ వేడుకల విజయవంతానికి సర్వశక్తులొడ్డుతున్నారు.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరం వేడుకలకు ముస్తాబ యింది. కలెక్టరేట్ ప్రాంగణం విద్యుద్దీపాలతో కొత్తశోభ సంతరించుకుంది. కలెక్టరేట్ క్రీడా మైదానంలో వారం రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.
 
అమరవీరులకు శ్రద్ధాంజలితో ఉత్సవాలు ప్రారంభం...  
వినాయక్‌నగర్‌లో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపానికి జూన్ 2న ఉదయం 8 గంటలకు శ్రద్ధాంజలి ఘటించడంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ, పరేడ్, వందన స్వీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విహంచనున్నారు. ఈ ఉత్సవాలు ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 2వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు జిల్లా నలుమూలల నుంచి బయలుదేరిన ర్యాలీలు కలెక్టరేట్‌కు చేరుకుంటాయి.

3, 4, 5, 6, 7 తేదీల్లో స్థానిక కలెక్టరేట్ గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, 3, 4, 5, 6 తేదీల్లో రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నాటకాలు, 2, 4 తేదీల్లో నూతన అంబేద్కర్ భవన్‌లో కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు జరుగుతాయని ఉత్సవాల కమిటీ పేర్కొంది. మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో పలు రంగాలలో ఉత్తమ సేవలందించిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ ఉత్సవాలకు పార్టీలకతీతంగా ఆహ్వానాలు పంపిస్తున్నామని, ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.
 
అమరవీరులకు ఆత్మశాంతి కలిగేలా ...
అమరవీరులకు ఆత్మశాంతి చేకూరే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని  రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవతర దినోత్సవాల సందర్భంగా పలు రంగాలలో సేవలందించిన వారికి నగదు పురస్కారాలు అందించేందుకు అర్హులను ఎంపిక చేయడానికి స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ చాంబర్‌లో శుక్రవారం కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూన్ 2న గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని, తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన వీరులకు స్థూపం వద్ద నివాళి ఆర్పించనున్నామని చెప్పారు. ఆ రోజున రాష్ట్ర మంతటా జాతీయ జెండాలు ఎగురవేస్తారన్నారు. పలు రంగాలలో ఉత్తమ సేవలందించిన వారిని ఎంపిక చేసి మండల స్థాయిలో 10 మంది, మున్సిపాలిటీలో 15 మంది, కార్పొరేషన్‌లో 20 మందికి రూ. 10,116 చొప్పున, జిల్లా స్థాయిలో 30 మందిని ఎంపిక చేసి రూ.51,116 చొప్పున నగదు పారితోషికాన్ని 2వ తేదీన అందిస్తామని వివరించారు. తమ ప్రభుత్వం కమిట్‌మెంట్‌తో వచ్చిందని, తప్పులను వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పారు.
 
ఈ సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, డీఆర్‌వో మనోహర్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, ఎల్లారెడ్డి శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్దన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాంకిషన్‌రావు, అవార్డుల ఎంపిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement