మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి
– మంచిదారిలో పయనించాలి
– ‘మమ్మాడే’ వేడుకల్లో కలెక్టర్ సత్యనారాయణ
కామారెడ్డి క్రైం : మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నప్పడే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓం శాంతి మందిరంలో మాతా జగదాంబ సరస్వతి వర్ధంతిని పురస్కరించుకుని మమ్మాడేను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ సత్యనారాయణ అక్కడున్న బ్రహ్మకుమార్‌లు, బ్రహ్మకుమారీలను ఉద్దేశించి మాట్లాడారు. మానవ జన్మ దేవుడిచ్చిన వరమన్నారు.
ఈ జన్మకు సార్థకం చేసుకునేందుకు మంచి మార్గంలో పయనించాలని సూచించారు. మంచి, చెడు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయన్నారు. మంచి దారిని ఎంచుకుని ముందుకు వెళ్లేలా సమాజంలోని అందరికి బ్రహ్మకుమారీలు మార్గం చూపించాలన్నారు. క్షణికావేశం, తొందరపాటు నిర్ణయాలు మనిషిని తప్పుడు మార్గంలోని తీసుకువెళ్లకుండా మనస్సు అదుపులో ఉంచుకోవాలన్నారు. ఇవన్నీ ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయో ఇటీవల కుకున్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఆత్మహత్యల సంఘటనలు చూస్తే తెలుస్తుందన్నారు.
కామారెడ్డి ఓం శాంతి ద్వారా శాంతి సమాజ స్థాపన కోసం రాజయోగ కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమన్నారు. రాజయోగా ధాన్యం మానిసక ప్రశాంతత లభిస్తుందన్నారు. సమాపంలో అందరినీ రాజయోగ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. అనంతరం ఓం శాంతి మందిరం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన మాతా జగదాంబ సరస్వతి వర్ధంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆహారభద్రత కమిషన్ చైర్మన్ కొమ్ముల తిర్మల్‌రెడ్డి యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.