అమరచింత(కొత్తకోట): నియమనిష్టలతో చేనేతమగ్గంపై కురుమూర్తిస్వామికి భక్తిశ్రద్ధలతో 15రోజులపాటు పట్టువస్త్రాలు తయారుచేశారు. 11ఏళ్ల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలి కులస్తులు పట్టువస్త్రాలు, స్వామివారితో పాటు చెన్నమ్మకు కూడా పట్టుచీరను తయారుచేసి అందించడం ఆనవాయితీ. అమ్మాపూర్ సంస్థానాదీశులు శ్రీరాంభూపాల్ ఆలయ ధర్మకర్తగా ఏటా అమరచింత పద్మశాలి కులస్తులతో బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలను తయారుచేయిస్తు వస్తున్నారు. అప్పట్లో నరాల సింగోటం అనే పద్మశాలి నేత కార్మికుడు బ్రహ్మోత్సవాల ముందురోజు నుంచి స్వామివారి పుష్కరిణిలోనే డ్రమ్ముల సహాయంతో కోనేరులోనే పట్టువస్త్రాలను తయారుచేసి స్వామివారికి అలంకరించేవారు.
తదుపరి కోటకొండ కుర్మన్న, కొంగరి చిన్నయ్య అనంతరం 11ఏళ్లుగా అమరచింత పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న తన స్వహస్తాలతో పట్టువస్త్రాలను తయారుచేస్తున్నారు. ఈ ఏడాది ఎంకంపల్లి శ్రీనివాసులు స్వామివారి పట్టువస్త్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. అమరచింత చేనేత సహకార సంఘం, పద్మశాలి కులస్తుల సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ పట్టువస్త్రాల తయారీకయ్యే ఖర్చును భరిస్తు బ్రహ్మోత్సవాలకు అందిస్తువస్తున్నారు. అక్టోబర్ 25న జరిగే అలంకరణోత్సవ కార్యక్రమంలో భాగంగా అమరచింత నుంచి తయారుచేసిన పట్టువస్త్రాలను భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా స్వామివారి ఆభరణాల వెంటనే వస్త్రాలను తీసుకెళ్లనున్నారు.
లాటరీ పద్ధతిన ఎంపిక
అలంకరణోత్సవం సందర్భంగా కురుమూర్తిస్వామికి పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపు నిర్వహిస్తారు. దీనికిగాను పద్మశాలి సోదరులు లాటరీ పద్ధతిన అందరి పేర్లను చీటీలపై రాసి వీటిలో నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. మార్కండేయస్వామి దేవాలయం నుంచి కొత్తబస్టాండ్ వరకు ఒకరు, ఆత్మకూర్ ఎస్‌బీహెచ్ నుంచి అమ్మాపురం సంస్థానం వరకు మరొకరు, అమ్మాపురం నుంచి కురుమూర్తి స్వామివారి ఆలయం వరకు ఇంకొకరు తీసుకెళ్తారు.
అదృష్టంగా భావిస్తున్నా..
కురుమూర్తిస్వామి నామస్మరణ లేకుండా ఏ పని నిర్వహించలేం. స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను తయారుచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు కాలనీలోని ఎంకంపల్లి శ్రీనివాసులు చేత కురుమన్న స్వామికి పట్టువస్త్రాల తయారీలో సహాయపడుతున్నాను.
– దేవరకొండ లచ్చన్న, పట్టువస్త్రాల తయారీదారుడు, అమరచింత
Comments
Please login to add a commentAdd a comment