సాక్షి, హైదరాబాద్ : ఈరోజు సాయంత్రానికి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. పోలింగ్ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో తీసుకున్న భద్రతా చర్యల గురించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్‌లు మీడియాకు వివరించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.
సైబరాబాద్: ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఓటర్లను కోరారు. పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్‌ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 13 నియోజకవర్గాల్లో శుక్రవారం రోజున జరిగే పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సీపీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో 2867 పోలింగ్ కేంద్రాలు, 152 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లుపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు సైబరబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కోట్ల 29 లక్షల 25 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పొలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తిన 9490617444 నంబర్‌కు ఏ సమయంలోనైనా ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.
రాచకొండ: రాచకొండ కమిషనరేట్‌లో 13 శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. సమస్యాత్మకమైన 214 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాల వద్ద 12000 మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. 11 చెక్ పోస్టులు, 27 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని వివరించారు.
హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటివరకు 27 కోట్ల 3 లక్షల 76 వేల రూపాయలు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల రోజు ప్రత్యేకంగా 518 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కోసమే ప్రత్యేకంగా 10 వేల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామన్నారు. అసాంఘికశక్తులతో పాటు రౌడీషీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment