రికార్డులు నిర్వహించని ఫలితం
ఇచ్చింది 18,700 ఎకరాలంటున్న అధికారుల
14,099 ఎకరాలే అని చెబుతున్న సంస్థలు
తేలని 4,601ఎకరాల లెక్కలు
మిగులు’ భూముల అన్వేషణలోబయటపడిన బండారం
సర్కారు భూముల లెక్క తప్పింది. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం వివిధ ఏజెన్సీల (ప్రభుత్వ విభాగాలు)కు బదలాయించిన స్థలాలకు రెక్కలొచ్చాయి. భూ కేటాయింపుల రికార్డులను సరిగా నమోదు చేయకపోవడంతో జిల్లాలో 4,601 ఎకరాల భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. హెచ్‌ఎండీఏ, టీఐఐసీ, దిల్, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, హౌసింగ్ బోర్డు తదితర సంస్థలకు 18,700 ఎకరాలు కేటాయించినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తుండగా.. తమకు 14,099 ఎకరాలు మాత్రమే బదలాయించినట్లు ఆయా సంస్థలు బుకాయిస్తుండడం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు, పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలను కల్పించే టీఐఐసీ, హెచ్‌ఎండీఏలకు కొన్నేళ్లుగా ప్రభుత్వం భూములను కట్టబెడుతోంది. ఈ విభాగాలు ఆయా సంస్థల అవసరాలను పరిగణనలోకి తీసుకొని భూ కేటాయింపులు జరుపుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు అందడమే తరువాయి.. ఆగమేఘాల మీద భూములను అప్పగిస్తున్న జిల్లా యంత్రాంగం.. వాటి రికార్డుల నిర్వహణలో కొంత నిర్లక్ష్యం వహించింది. అంతేకాకుండా ఆ సంస్థలకు స్వాధీనం చేసిన భూమి.. నిర్ధేశిత అవ సరాలకు వినియోగిస్తున్నారా? ఎంత మేర కేటాయించారనే అంశాన్ని విస్మరిస్తోంది.
దీంతో ఇటు జిల్లా యంత్రాంగం.. అటు హెచ్‌ఎండీఏ, టీఐఐసీ, టీహెచ్‌బీ తదితర సంస్థలకు జరిపిన భూ కేటాయింపులకు సంబంధించిన సమాచారంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సర్కారు.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఆయా శాఖలకు కేటాయించిన భూములు, వినియోగంలోకి రాగా, మిగులు భూమి ఎంత ఉందనే సమాచారాన్ని నివేదించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం భూ కేటాయింపులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేసింది.
పాత రికార్డుల దుమ్ము దులిపిన అధికారగణం.. జిల్లా వ్యాప్తంగా 18,700 ఎకరాల మేర భూమి ఆయా శాఖలకు బదలాయించినట్లు లెక్క తేల్చింది. అదే సమయంలో సంబంధిత శాఖల నుంచి సమాచారాన్ని కోరింది. ఈ మేరకు ఆయా శాఖలు పంపిన నివేదికతో జిల్లా యంత్రాంగం దిమ్మతిరిగింది. కేటాయించిన భూమికి.. ఆయా శాఖలు తేల్చిన లెక్కకు పొంతన కుదరకపోవడంతో గందరగోళంలో పడింది. ఏకంగా 4,601 ఎకరాల మేర తేడా రావడం... ఎన్నిసార్లు లేఖలు రాసినా సంబంధిత విభాగాలు స్పందించకపోవడం మిన్నకుండిపోయింది.
హెచ్‌ఎండీఏదే పెద్ద వాటా!
నగరీకరణను ఆసరా చేసుకొని స్థిరాస్తి వ్యాపారాన్ని చేసిన హెచ్‌ఎండీఏ అప్పనంగా భూములను సేకరించింది. నగర శివార్లలో 6,105 ఎకరాలు సేకరించిన సదరు సంస్థ తమకు కేవలం 3,353 ఎకరాలు మాత్రమే కేటాయించారని బుకాయిస్తోంది. అలాగే పారిశ్రామిక అవసరాలను పర్యవేక్షించే టీఐఐసీ కూడా భూముల లెక్కలను తప్పుగా చూపింది. ఆ సంస్థ తీసుకున్న భూమి 8,682 ఎకరాలని జిల్లా యంత్రాంగం వాదిస్తుండగా, టీఐఐసీ మాత్రం 7,032 ఎకరాలు మాత్రమేనని ఢంకా బజాయిస్తోంది. దిల్, తెలంగాణ హౌసింగ్‌బోర్డు, రాజీవ్ గృహకల్ప భూ కేటాయింపుల్లో కూడా సామీప్యత లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఆయా సంస్థలు అట్టిపెట్టుకున్నట్లు గుర్తించిన స్థలాల సమాచారంలోనూ తేడా కనిపిస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 10,396 ఎకరాల మేర సదరు సంస్థల వద్ద మిగులు భూములు ఉన్నట్లు తేల్చగా, సంస్థలు మాత్రం 6,624 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక సమర్పించింది.
లెక్కాపత్రం లేదు!
Published Thu, Dec 4 2014 11:52 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement