Rajiv home
-
లెక్కాపత్రం లేదు!
రికార్డులు నిర్వహించని ఫలితం ఇచ్చింది 18,700 ఎకరాలంటున్న అధికారుల 14,099 ఎకరాలే అని చెబుతున్న సంస్థలు తేలని 4,601ఎకరాల లెక్కలు మిగులు’ భూముల అన్వేషణలోబయటపడిన బండారం సర్కారు భూముల లెక్క తప్పింది. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం వివిధ ఏజెన్సీల (ప్రభుత్వ విభాగాలు)కు బదలాయించిన స్థలాలకు రెక్కలొచ్చాయి. భూ కేటాయింపుల రికార్డులను సరిగా నమోదు చేయకపోవడంతో జిల్లాలో 4,601 ఎకరాల భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. హెచ్ఎండీఏ, టీఐఐసీ, దిల్, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, హౌసింగ్ బోర్డు తదితర సంస్థలకు 18,700 ఎకరాలు కేటాయించినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తుండగా.. తమకు 14,099 ఎకరాలు మాత్రమే బదలాయించినట్లు ఆయా సంస్థలు బుకాయిస్తుండడం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సాఫ్ట్వేర్ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు, పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలను కల్పించే టీఐఐసీ, హెచ్ఎండీఏలకు కొన్నేళ్లుగా ప్రభుత్వం భూములను కట్టబెడుతోంది. ఈ విభాగాలు ఆయా సంస్థల అవసరాలను పరిగణనలోకి తీసుకొని భూ కేటాయింపులు జరుపుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు అందడమే తరువాయి.. ఆగమేఘాల మీద భూములను అప్పగిస్తున్న జిల్లా యంత్రాంగం.. వాటి రికార్డుల నిర్వహణలో కొంత నిర్లక్ష్యం వహించింది. అంతేకాకుండా ఆ సంస్థలకు స్వాధీనం చేసిన భూమి.. నిర్ధేశిత అవ సరాలకు వినియోగిస్తున్నారా? ఎంత మేర కేటాయించారనే అంశాన్ని విస్మరిస్తోంది. దీంతో ఇటు జిల్లా యంత్రాంగం.. అటు హెచ్ఎండీఏ, టీఐఐసీ, టీహెచ్బీ తదితర సంస్థలకు జరిపిన భూ కేటాయింపులకు సంబంధించిన సమాచారంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సర్కారు.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఆయా శాఖలకు కేటాయించిన భూములు, వినియోగంలోకి రాగా, మిగులు భూమి ఎంత ఉందనే సమాచారాన్ని నివేదించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం భూ కేటాయింపులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేసింది. పాత రికార్డుల దుమ్ము దులిపిన అధికారగణం.. జిల్లా వ్యాప్తంగా 18,700 ఎకరాల మేర భూమి ఆయా శాఖలకు బదలాయించినట్లు లెక్క తేల్చింది. అదే సమయంలో సంబంధిత శాఖల నుంచి సమాచారాన్ని కోరింది. ఈ మేరకు ఆయా శాఖలు పంపిన నివేదికతో జిల్లా యంత్రాంగం దిమ్మతిరిగింది. కేటాయించిన భూమికి.. ఆయా శాఖలు తేల్చిన లెక్కకు పొంతన కుదరకపోవడంతో గందరగోళంలో పడింది. ఏకంగా 4,601 ఎకరాల మేర తేడా రావడం... ఎన్నిసార్లు లేఖలు రాసినా సంబంధిత విభాగాలు స్పందించకపోవడం మిన్నకుండిపోయింది. హెచ్ఎండీఏదే పెద్ద వాటా! నగరీకరణను ఆసరా చేసుకొని స్థిరాస్తి వ్యాపారాన్ని చేసిన హెచ్ఎండీఏ అప్పనంగా భూములను సేకరించింది. నగర శివార్లలో 6,105 ఎకరాలు సేకరించిన సదరు సంస్థ తమకు కేవలం 3,353 ఎకరాలు మాత్రమే కేటాయించారని బుకాయిస్తోంది. అలాగే పారిశ్రామిక అవసరాలను పర్యవేక్షించే టీఐఐసీ కూడా భూముల లెక్కలను తప్పుగా చూపింది. ఆ సంస్థ తీసుకున్న భూమి 8,682 ఎకరాలని జిల్లా యంత్రాంగం వాదిస్తుండగా, టీఐఐసీ మాత్రం 7,032 ఎకరాలు మాత్రమేనని ఢంకా బజాయిస్తోంది. దిల్, తెలంగాణ హౌసింగ్‌బోర్డు, రాజీవ్ గృహకల్ప భూ కేటాయింపుల్లో కూడా సామీప్యత లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఆయా సంస్థలు అట్టిపెట్టుకున్నట్లు గుర్తించిన స్థలాల సమాచారంలోనూ తేడా కనిపిస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 10,396 ఎకరాల మేర సదరు సంస్థల వద్ద మిగులు భూములు ఉన్నట్లు తేల్చగా, సంస్థలు మాత్రం 6,624 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక సమర్పించింది. -
ఇంకెప్పుడు కట్టిస్తరు!
తాండూరు: ‘సకల సౌకర్యాలతో ఇళ్లు కట్టిస్తామన్నరు. అందులో పార్కు, షాపింగ్ కాంప్లెక్స్, రోడ్లు, పాఠశాల, తాగునీరు, విద్యుత్.. అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. నాలుగేళ్ల క్రితం డబ్బులు కట్టించుకున్నరు. ఇప్పటివరకు అతీగతీ లేదు. ఇక మేం ఆగలేం. కట్టిన డబ్బులను వడ్డీతోసహా తిరిగివ్వండి.. లేకుంటే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తాం’ తాండూరులో రాజీవ్ స్వగృహ (ఆర్‌ఎస్‌జీ) జీఎం మారయ్య, ఏజీఎం బసయ్యలను లబ్ధిదారులు నిలదీసిన తీరిది. 2010లో తాండూరులో రాజీవ్ స్వగృహ కింద ప్రభుత్వం ఇళ్లు కట్టించేందుకు కొందరి నుంచి ఇంటికి అయ్యే మొత్తంలో 25శాతం నిధులను సేకరించింది. పెద్దఎత్తున ప్రాజెక్టు నిర్వహించాలని భావించినా కేవలం 29 మందే దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారి నుంచి డబ్బులు తీసుకున్న అధికారులు.. ఏడాదిన్నరలో ఇళ్లు పూర్తిచేస్తామని అప్పట్లో చెప్పారు. కానీ నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ విషయంపై లబ్ధిదారులు ఎన్నాళ్లుగానో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం రాజీవ్ స్వగృహ తాండూరు ప్రాజెక్టు జనరల్ మేనేజర్ మారయ్య, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బసయ్యలు పట్టణ శివారులోని ఆర్‌ఎస్‌జీ వద్దకు వచ్చారు. విషయం తెలుసుకుని లబ్ధిదారులు అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘ఇళ్లు వద్దు.. ఏమీ వద్దు.. మా పైసలు మాకు వడ్డీతో సహా ఇచ్చేయండి’ అంటూ నిలదీశారు. నాలుగేళ్లుగా తిరుగుతున్నా పనుల్లో ఎందుకు పురోగతిలేదని లబ్ధిదారులు బిచ్చప్ప, కిరణ్‌కుమార్, వెంకటేశం, శ్యాంరావు, శంకరమ్మ, సుజాత, మాణెప్ప తదితరులు జీఎం, ఏజీఎంలను ప్రశ్నించారు. మేమంతా చిరుద్యోగులమని, అప్పుచేసి డబ్బు తెచ్చి కట్టామని, ఓ వైపు వడ్డీలు పెరుగుతుంటే.. మరో వైపు అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌తో సమస్య వచ్చిందని, మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తిచేసి ఇళ్లు అప్పగిస్తామని జీఎం సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మీ మాటలతో విసుగు చెందామని, ఇక నమ్మేది లేదంటూ లబ్ధిదారులు మండిపడ్డారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు శాంతించారు. మూడు నెలల్లో అప్పగిస్తాం: కాంట్రాక్టర్ మధ్యలో పనులు ఆపేసి వెళ్లిపోయారు. అదే మాట్లాడుతున్నాం. 201 ఎకరాలకు గాను 15 ఎకరాల్లో లేఅవుట్ చేశాం. ఇందులో 29 మందికి ఇళ్లు నిర్మించాల్సి ఉంది. క్లాసిక్(రూ.24లక్షలు)-1, ఇంట్రిన్సిక్ (రూ.19లక్షలు)-1, బేసిక్ (రూ.11.30లక్షలు)-16, సివిక్ (రూ.7.10లక్షలు)-11 ఇళ్లు నిర్మించాలి. వీరంతా నిర్మాణం విలువలో 25శాతం చొప్పున రూ.73.34లక్షలు ఆర్‌ఎస్‌జీకి చెల్లించారు. ఈ ప్రాజె క్టు విలువ సుమారు రూ.మూడు కోట్లు. ఇందులో ఇప్పటికే రూ.కోటి విలువైనపనులు చేశాం. విడుదలైన రూ.50లక్షల నిధులు వికారాబాద్ బ్యాంకులో ఉన్నా యి. కాంట్రాక్టర్ సమస్యను కొలిక్కి తెచ్చి పనులు ప్రారంభిస్తాం. మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తిచేస్తాం. -జీఎం మారయ్య, (ఆర్‌ఎస్‌జీ) రాజీవ్ స్వగృహ -
త్రిశంకు స్వర్గంలో రాజీవ్ స్వగృహ
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్ : నెల్లూరు నగర పరిధిలో రాజీవ్ స్వగృహ నిర్మాణాల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. స్వగృహ సముదాయం స్థలం నగరానికి దూరంగా ఉండటం, గృహాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, రోడ్డు స్థలం కోర్టు పరిధిలో ఉండటం తదితర కారణాలతో స్వగృహ ఇళ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. వివిధ కేటగిరిల్లో మొత్తం 1,249 గృహాలు నిర్మించాలని లక్ష్యాన్ని నిర్ణయించినా అందులో 3వ వంతు గృహాలు కూడా పూర్తి కాలేదు. వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నా గృహాలను కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి ప్రజలు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. దీంతో గృహాలను వేలం పద్ధతిలో అమ్మే ఆలోచనలో అధికారులు ఉన్నారు. మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల నేరవేర్చాలన్న లక్ష్యంతో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ స్వగృహ పేరుతో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. 2008లో కొనుగోలుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందు కోసం స్వగృహ సముదాయానికి 200 ఎకరాల భూమి కేటాయించారు. అందులో 130 ఎకరాల్లో వివిధ కేటగిరిల్లో 1,249 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ గృహ సముదాయంలో క్లాసిక్, ఇంటెన్సిక్, బేసిక్, సివిక్ కేటగిరిల్లో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. సివిక్ మోడల్ ఇల్లు రూ.25,04,000, ఇంటెన్సిక్ రూ.19,40,000, బేసిక్ రూ.12,80,000, సివిక్ రూ.7,32,000గా ధరలు నిర్ణయించారు. అందుకనుగుణంగా మొదటి కేటగిరికి 33.25 అంకణాలు, రెండో కేటగిరికి 25 అంకణాలు, మూడో కేటగిరి ఇళ్లకు 18.75 అంకణాలు, నాలుగో కేటగిరికి 12.50 అంకణాల స్థలంలో ఇళ్లను నిర్మించేందుకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాల బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన రావూస్ కన్స్ట్రక్షన్ సంస్థకు అప్పగించారు. నిధులకు గ్రహణం వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాజీవ్ స్వగృహ నిధులకు గ్రహణం పట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగాయి. స్వగృహ సముదాయంలో మొత్తం 1,249 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అందులో 653 ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇందులోనూ కేవలం వివిధ కేటగిరిల్లో 260 ఇళ్లను పూర్తి చేశారు. మిగిలిన 393 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. క్లాసిక్ మోడల్ విభాగంలో 143 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినా.. అందులో 74 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. వాటిలో కేవలం 26 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఇంటెన్సిక్ విభాగంలో 258 ఇళ్లకు 158 మాత్రమే చేపట్టారు. వాటిలో కేవలం 14 ఇళ్లు మాత్రమే పూర్తిస్థాయిలో నిర్మించగలిగారు. బేసిక్ మోడల్‌కు సంబంధించి 495 ఇళ్లకు 253 నిర్మాణాలు చేపట్టారు. వాటిలో 53 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. సివిక్ మోడల్‌కు సంబంధించి 358 ఇళ్లలో 164 నిర్మాణాలు చేపట్టగా.. వాటిలో 27 ఇళ్ల నిర్మాణాలను పూర్తి స్థాయిలో చేయగలిగారు. రాజీవ్ స్వగృహ సముదాయంలో ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటి వరకు రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఇంకా రూ.12 కోట్లు మేర పనులు నిలిచిపోయినట్లు చెబుతున్నారు. ఈ నెలలో 260 ఇళ్లను పూర్తిచేసి కొనుగోలు దారులకు అప్పగించనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 120 మంది మాత్రమే లబ్ధిదారులు నగదు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా ఇళ్లకు సంబంధించి నగదు అందిన తరువాతే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు వేలం నిధులు లేమి, కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను వేలం వేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 4 కేటగిరిల్లో 393 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేలం నిర్వహించేందుకు అనుమతులు పొందేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు. రోడ్డు స్థలంపై కోర్టులో వ్యాజ్యం పొదలకూరు రోడ్డు నుంచి రాజీవ్ స్వగృహ సముదాయానికి 80 అడుగుల వెడల్పులో రహదారి నిర్మించాలని నిర్ణయించారు. అందకునుగుణంగా 6 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అందులో 3 ఎకరాలకు సంబంధించిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పొలానికి సంబంధించి పట్టాలు తమ వద్ద ఉన్నాయని, పొలాన్ని తమకే కేటాయించాలని హైకోర్టులో రిట్ వేశారు. దీనికి సంబంధించి వ్యాజ్యం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. స్వగృహ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు స్వగృహకు రోడ్డు ఏర్పాటు చేయలేమని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సముదాయంలో పోస్టాఫీసు, బ్యాంకు, వాణిజ్య సముదాయం, పాఠశాల, ఇంటికి గ్యాస్ పైప్‌లైన్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించారు. ప్రస్తుతం ఆ సదుపాయాలు రాజీవ్ స్వగృహ సముదాయంలో కనిపించే పరిస్థితి లేదు. వచ్చే కొత్త ప్రభుత్వమైనా ఇంటి నిర్మాణాలు సాగిస్తారా లేక నిలిపి వేస్తారో వేచి చూడాల్సి ఉంది.