నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్ : నెల్లూరు నగర పరిధిలో రాజీవ్ స్వగృహ నిర్మాణాల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. స్వగృహ సముదాయం స్థలం నగరానికి దూరంగా ఉండటం, గృహాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, రోడ్డు స్థలం కోర్టు పరిధిలో ఉండటం తదితర కారణాలతో స్వగృహ ఇళ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది.
వివిధ కేటగిరిల్లో మొత్తం 1,249 గృహాలు నిర్మించాలని లక్ష్యాన్ని నిర్ణయించినా అందులో 3వ వంతు గృహాలు కూడా పూర్తి కాలేదు. వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నా గృహాలను కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి ప్రజలు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. దీంతో గృహాలను వేలం పద్ధతిలో అమ్మే ఆలోచనలో అధికారులు ఉన్నారు. మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల నేరవేర్చాలన్న లక్ష్యంతో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ స్వగృహ పేరుతో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. 2008లో కొనుగోలుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందు కోసం స్వగృహ సముదాయానికి 200 ఎకరాల భూమి కేటాయించారు. అందులో 130 ఎకరాల్లో వివిధ కేటగిరిల్లో 1,249 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ గృహ సముదాయంలో క్లాసిక్, ఇంటెన్సిక్, బేసిక్, సివిక్ కేటగిరిల్లో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. సివిక్ మోడల్ ఇల్లు రూ.25,04,000, ఇంటెన్సిక్ రూ.19,40,000, బేసిక్ రూ.12,80,000, సివిక్ రూ.7,32,000గా ధరలు నిర్ణయించారు. అందుకనుగుణంగా మొదటి కేటగిరికి 33.25 అంకణాలు, రెండో కేటగిరికి 25 అంకణాలు, మూడో కేటగిరి ఇళ్లకు 18.75 అంకణాలు, నాలుగో కేటగిరికి 12.50 అంకణాల స్థలంలో ఇళ్లను నిర్మించేందుకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాల బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన రావూస్ కన్‌స్ట్రక్షన్ సంస్థకు అప్పగించారు.
నిధులకు గ్రహణం
వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాజీవ్ స్వగృహ నిధులకు గ్రహణం పట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగాయి. స్వగృహ సముదాయంలో మొత్తం 1,249 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అందులో 653 ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇందులోనూ కేవలం వివిధ కేటగిరిల్లో 260 ఇళ్లను పూర్తి చేశారు. మిగిలిన 393 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. క్లాసిక్ మోడల్ విభాగంలో 143 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినా.. అందులో 74 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. వాటిలో కేవలం 26 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఇంటెన్సిక్ విభాగంలో 258 ఇళ్లకు 158 మాత్రమే చేపట్టారు.
వాటిలో కేవలం 14 ఇళ్లు మాత్రమే పూర్తిస్థాయిలో నిర్మించగలిగారు. బేసిక్ మోడల్‌కు సంబంధించి 495 ఇళ్లకు 253 నిర్మాణాలు చేపట్టారు. వాటిలో 53 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. సివిక్ మోడల్‌కు సంబంధించి 358 ఇళ్లలో 164 నిర్మాణాలు చేపట్టగా.. వాటిలో 27 ఇళ్ల నిర్మాణాలను పూర్తి స్థాయిలో చేయగలిగారు. రాజీవ్ స్వగృహ సముదాయంలో ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటి వరకు రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఇంకా రూ.12 కోట్లు మేర పనులు నిలిచిపోయినట్లు చెబుతున్నారు. ఈ నెలలో 260 ఇళ్లను పూర్తిచేసి కొనుగోలు దారులకు అప్పగించనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 120 మంది మాత్రమే లబ్ధిదారులు నగదు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా ఇళ్లకు సంబంధించి నగదు అందిన తరువాతే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిర్మాణంలో ఉన్న ఇళ్లకు వేలం
నిధులు లేమి, కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను వేలం వేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 4 కేటగిరిల్లో 393 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేలం నిర్వహించేందుకు అనుమతులు పొందేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు.
రోడ్డు స్థలంపై కోర్టులో వ్యాజ్యం
పొదలకూరు రోడ్డు నుంచి రాజీవ్ స్వగృహ సముదాయానికి 80 అడుగుల వెడల్పులో రహదారి నిర్మించాలని నిర్ణయించారు. అందకునుగుణంగా 6 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అందులో 3 ఎకరాలకు సంబంధించిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పొలానికి సంబంధించి పట్టాలు తమ వద్ద ఉన్నాయని, పొలాన్ని తమకే కేటాయించాలని హైకోర్టులో రిట్ వేశారు.
దీనికి సంబంధించి వ్యాజ్యం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. స్వగృహ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు స్వగృహకు రోడ్డు ఏర్పాటు చేయలేమని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సముదాయంలో పోస్టాఫీసు, బ్యాంకు, వాణిజ్య సముదాయం, పాఠశాల, ఇంటికి గ్యాస్ పైప్‌లైన్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించారు. ప్రస్తుతం ఆ సదుపాయాలు రాజీవ్ స్వగృహ సముదాయంలో కనిపించే పరిస్థితి లేదు. వచ్చే కొత్త ప్రభుత్వమైనా ఇంటి నిర్మాణాలు సాగిస్తారా లేక నిలిపి వేస్తారో వేచి చూడాల్సి ఉంది.
త్రిశంకు స్వర్గంలో రాజీవ్ స్వగృహ
Published Mon, Jun 9 2014 2:36 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement