
తెలంగాణ కోర్ కమిటీపై అమిత్ షా ఆగ్రహం!
హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 'మిషన్ తెలంగాణ-2019' లో భాగంగా గురువారం తెలంగాణ కోర్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీ.కోర్ కమిటీపై సీరియస్ అయినట్లు సమాచారం. తెలంగాణలో అవకాశాలు ఉన్నా ఎందుకు పార్టీ పుంజుకోవటం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ్యత్వ నమోదును ఎందుకు పూర్తి చేయలేకపోయారని, తెలంగాణ కోసం పోరాడినా ఎందుకు ఫలితాలు సాధించలేకపోయారని అమిత్ షా కోర్ కమిటీని ప్రశ్నించినట్లు సమాచారం.
తెలంగాణలో ఎదగడానికి అవకాశం ఉన్నా నాయకత్వం సరిగా పని చేయటం లేదని, పార్టీ కేడర్ను వాడుకోవడంలో నాయకత్వం విఫలమైందని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం 30 లక్షల మంది సభ్యత్వం నమోదు చేయాలని, ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని అమిత్ షా ఈ భేటీలో సూచించినట్లు సమాచారం.