అమ్మహస్తానికి బ్రేక్..!
నల్లగొండ, న్యూస్‌లైన్ :సాధారణ ఎన్నికలకు ఏడాదిముందు అప్పటి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకానికి బ్రేక్ పడనుందా..! కొంతకాలంగా ఈ పథకం అమలు జరుగుతున్న తీరును గమనిస్తే అవుననే సమాధానమే వస్తోంది. సామాన్య ప్రజలకు 9 రకాల నిత్యావసర వస్తువులను కారుచౌకగా అందజేస్తామని చెప్పిన కొన్నాళ్లకే.. ఈ పథకం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. రూపాయి కిలోబియ్యంతో పాటు మరో 9 రకాల వస్తువులను చౌకధరలకు అందస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభ దశలో మూడు నెలలపాటు సరుకులు పంపిణీ చేశారు. రోజులు గడుస్తున్నాకొద్ది పథకాన్నిఅమలుచేయడంలో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. సరుకుల్లో నాణ్యత లోపించడంతో వినియోగదారులు వాటిని కొనేందుకు ముఖం చాటేసే పరిస్థితికి వచ్చింది. మొత్తం వస్తువుల్లో బియ్యం, పంచదార, పామాయిల్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. గోధుములు, గోధుమపిండి, పసుపు, కారం, చింతపండు వగైరా సరుకుల్లో నాణ్యత లోపించడంతో వినియోగదారులు కొనడమే మానేశారు.
పామాయిల్ బంద్...
రెండు నెలలుగా పామాయిల్ సరఫరా బంద్‌చేశారు. పామాయిల్ సబ్సిడీ కేంద్రం రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. సబ్సిడీ భారాన్ని సైతం రాష్ట్రమే భరించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఎన్నికల కోడ్ కంటే ముందుగానే పామాయిల్ నిలిపేశారు. జిల్లాలో మొత్తం 9 లక్షల 44 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. బయట మార్కెట్‌లతో పోలిస్తే పామాయిల్ ధర రేషన్ దుకాణాల్లో కేవలం రూ.40కే లభిస్తుండడంతో డిమాండ్ ఎక్కువ ఏర్పడింది. దీంతో రేషన్‌కార్డులకు సరిపడా పామాయిల్ జిల్లాకు వచ్చేది. ఎప్పుడైతే కేంద్రం సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన నాటినుంచి రాష్ట్రం ప్రభుత్వం పామాయిల్ సరఫరా నిలిపేసింది. ప్రస్తుతం బియ్యం, పంచదారకు మంచి డిమాండ్ ఉంది. బహిరంగ మార్కెట్లో పంచదార ధరతో పోలిస్తే రేషన్ దుకాణాల్లో చౌకగా లభిస్తుండడం అందుకు కారణం. రూపాయి బియ్యాన్ని వినియోగదారులు వాడుతున్నదాని కంటే డీలర్లు ఆ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు ఎక్కువగా తరలిస్తుండడంతో మంచి లాభసాటి వ్యాపారంగా మారింది.
నాణ్యతపైనే అనుమానాలు..
చింతపండు నల్లగా ఉండడం, కారంలో ఇటుకపొడి కలుస్తుందని, గోధుమ పిం డిలో పురుగు ఉంటుందన్న కారణాలతో వినియోగదారులు వాటిని కొనడమే మానేశారు. ఒక బ్యాగులో 50 ప్యాకెట్లు ఉప్పు ఉంటే దాంట్లో పది ప్యాకెట్లు పగలిపోవడం, గోధుముల్లో పురుగు వస్తుండడంతో డీలర్లు సైతం వాటిని కొనేందుకు వెనకాడుతున్నారు. నాణ్యత లోపించిన సరుకులను వాపసు తీసుకునేందుకు మండల స్థాయి గోదాముల అధికారులు నిరాకరిస్తున్నందున డీలర్లు ఆ సరుకుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పంచదార, బియ్యం, పామాయిల్ వంటి వాటికే ఎక్కువమంది డీలర్లు డీడీలు చెల్లిస్తున్నారు.
పేరుకుపోయిన నిల్వలు...
జూన్ కోటాకు సంబంధించి ఓసారి పరిశీలిస్తే..చింతపండు 9,790 ప్యాకెట్లకు డీడీలు కట్టారు. దీనికిగాను జిల్లా మేనేజరుకు సివిల్ సప్లయీస్ 4,689 ప్యాకెట్లు సరఫరా చేసింది. మండలస్థాయి గోదాముల్లో (ఎంఎల్‌ఎస్ పాయింట్లు) పాతస్టాక్ 70,512 ప్యాకెట్లు నిల్వ ఉన్నాయి. వాస్తవానికి అయితే జిల్లాలో ఉన్న 9 లక్షల రేషన్ కార్డులకుగాను అంతే మోతాదులో చింతపండు సరఫరా చేయాలి. కానీ చింతపండులో నాణ్యత లేనందున గోదాముల్లో నిల్వ ఉన్న సరుకును మినహాయించి అసలు లేదన్నట్టు కాకుండా ఓ మోతాదులో పంపిస్తున్నారు. దీంతోపాటు గోధుమపిండి కూడా 1,82,706 ప్యాకెట్లకు డీడీలు కట్టారు. కానీ 1,13,465 ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేశారు. గోదాముల్లో పాతస్టాక్ 1,18,209 ప్యాకెట్ల నిల్వలు పేరుకుపోయాయి. చౌక దుకాణాల్లో వాటిని కొనే పరిస్థితి లేకపోవడంతో గోదాముల్లోనే పిండి నిల్వ ఉండే పరిస్థితి వచ్చింది. పసుపు, కారం, గోధుములు, ఉప్పు ప్యాకెట్ల నిల్వలు కూడా గోదాముల్లో పేరుకుపోయాయి. వినియోగదారుల వాడకం తగ్గడంతో సివిల్ సప్లయీస్ కూడా సరుకుల సరఫరాను క్రమేపీ తగ్గిస్తూ వస్తోంది. పథకం పూర్తిగా నిలిపివేస్తే వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో నామమాత్రంగా నెలవారీ సరుకుల నిల్వలు పంపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే కొత్త సర్కారులో మాత్రం రూపాయి బియ్యాన్ని మినహాయించి మిగతా సరుకులను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
జూన్‌లో అమ్మహస్తం సరుకుల కొనుగోలు తీరు..
(ప్యాకెట్లలో)
సరుకు డీలర్లు పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్ల
డీడీలు కట్టింది పంపిణీ చేసింది వద్ద నిల్వ ఉన్న సరుకు
పామాయిల్ నిల్ నిల్ నిల్
కందిపప్పు 1,22,713 48,246 1,01,798
పంచదార 7,71,932 3,86,773 4,07,629
గోధుమలు 2,24,232 1,01,776 2,20,103
గోధుమపిండి 1,82,706 1,13,465 1,18,209
ఉప్పు 75,825 38,503 1,69,133
పసుపు 4,385 334 1082
చింతపండు 9,790 4,689 70,512
కారం 410 100 44,301