చెరగని ముద్ర
నేడు మహానేత వైఎస్‌ఆర్ వర్ధంతి
♦ జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం
♦ పేదల గుండెల్లో సుస్థిరస్థానం
♦ {పతిష్టాత్మక పథకాలు ఇక్కడినుంచే ప్రారంభం
సమసమాజ నిర్మాణమే ఆయన ధ్యేయం.. సకలజనుల సౌభాగ్యమే ఆయన లక్ష్యం.. ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి పేదల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆ మహానేత కురిపించిన వరాలు జిల్లా అభివృద్ధికి నాంది పలికాయి. ఆరోగ్యశ్రీ ఎంతోమందికి ప్రాణం పోసింది. కుయ్..కుయ్ అంటూ పరుగులుతీసే 108అంబులెన్స్ మరెందరో అభాగ్యుల ప్రాణాలు కాపాడింది. పేదల సొంతింటి కలనెరవేరింది. జలయజ్ఞంతో కృష్ణాజలాలు కరువు నేలపై గలగల పారాయి..
మహబూబ్‌నగర్ అర్బన్ : పాలమూరు జిల్లాపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేకమైన అభిమానం చూపారు. జిల్లానుంచే ప్రారంభించిన ఇంది రమ్మ ఇళ్లు, రూ.2కే కిలోబియ్యం, పేదలకు భూపంపిణీ పథకాలు ఎంతో లబ్ధిచేకూర్చాయి. అందుకే ఆయన పేదల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నా రు. సీఎం హోదాలో ఆయన అలంపూర్ ని యోజకవర్గంలో మూడుసార్లు పర్యటించి వరాలజల్లు కురిపించారు. మొదటిసారిగా ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని 2006లో అలంపూర్ పట్టణంలో ప్రారంభించారు. అలంపూర్- ర్యాలంపాడు గ్రామాల మధ్య తుంగభద్ర నదిపై రూ.35కోట్ల వ్యయంతో బ్రిడ్జిని మంజూరుచేసి శంకుస్థాపన చేశారు. అలాగే వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదుసార్లు పర్యటించారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా భూపంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడినుంచే ప్రారంభించారు.
జలయజ్ఞ ప్రదాత
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా రూ.1478కోట్లతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 25వేల ఎకరాల నుంచి రెండులక్షల ఎకరాలకు పెంచడంతో పాటు, అదేస్థాయిలో నిధులు విడుదల చేసిన వైఎస్ జలయజ్ఞ ప్రదాతగా వెలుగొందారు. ప్రతిపక్షనేత హోదాలో గద్వాల ప్రాంతంలో పర్యటించి పెండింగ్ ప్రాజెక్టుల పునాది రాళ్ల వద్ద మొక్కలు నాటి రైతుల సమస్యలు తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత నగరబాటతో పట్టణాభివృద్ధికి ఇక్కడినుంచే శ్రీకారం చుట్టారు. అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినతరువాత సీఎం హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లాపూర్‌కు వచ్చారు. ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,995కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సింగోటం శ్రీవారిసముద్రాన్ని మినీరిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించారు. అక్కడే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరును మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
2007 జనవరి నెలలో మంచాలకట్ట వద్ద కృష్ణానదిలో పుట్టిమునిగి 61మంది మృతిచెందడంతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. రూ.110కోట్ల వ్యయంతో సోమశిల- సిద్ధేశ్వరం వంతెన, రూ.85కోట్ల వ్యయంతో కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు డబుల్‌లైన్ రహదారి పనులకోసం పైలాన్లను ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.2కే బియ్యం పథకాన్ని జడ్చర్లలో ప్రారంభి పేదల అభిమానాన్ని చూరగొన్నారు. నియోజకవర్గ తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.55కోట్ల వ్యయంతో రామన్‌పాడు తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.
పీయూ అభివృద్ధికి పునాది
పాలమూరు యూనివర్శిటీ: వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఉన్నత చదువుల కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవ చూపించి జిల్లాకు యూనివర్శిటీని మంజూరుచేశారు. ఉస్మానియా పీజీ సెంటర్ స్థాయి పెంచుతూ 2008లో జిల్లాకు పాలమూరు యూనివర్శి టీ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. 2008 ఆగష్టు 28న అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా పీయూ ప్రా రంభానికి శిలాఫలకం వేశారు. ఆ తర్వాత పీయూకు వీసీ గోపాల్‌రెడ్డిని నియమించి త్వరగా అభివృద్ధి పనులు చేయాలని వీసీని ఆయన ప్రో త్సహించారు. మొదట ఐదుకోర్సులతో ప్రారంభించిన పీయూ ప్రస్తుతం 17కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. పీయూ లో అన్ని కోర్సుల్లో కలిపి 2500 మంది విద్యార్థులు చదువుతున్నారు.