80ఏళ్ల వయస్సు.. 280 కిలోమీటర్లు పాదయాత్ర
మహబూబ్‌నగర్: శ్రీశైలంలోని మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు ఎనభై ఏళ్ల వృద్ధురాలు బోరమ్మ 280 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతోంది. ఆమె ఇలా నడిచి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు.. 35 సంవత్సరాలుగా ఇలా నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకుంటోంది. కర్ణాటక రాష్ట్రం జవరిగి ప్రాంతానికి చెందిన బోరమ్మ ఈ ఏడాది కూడా వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా కర్ణాటక నుంచి బయలుదేరి గురువారం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలానికి చేరుకుంది. ‘శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని... దైవానుగ్రహం ఉంటే అన్నీ సాధ్యమని’ చెబుతోంది.
తనకు శ్రీశైలం మల్లన్న అంటే ఇష్టమని.. అందుకే 80ఏళ్ల వయస్సున్నా లెక్కచేయకుండా స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం నడుస్తున్నానని చెబుతుంది. ప్రతి ఏటా గట్టుమీదుగానే పాదయాత్ర చేస్తూ, ఆయా ప్రాంతాల్లో పరిచయం ఉన్న వారిని బంధువుల్లా పలుకరిస్తూ, తెలిసిన వారి ఇళ్లలో కొంతసేపు సేదతీరుతుంది. ‘ఏను తాయి చన్నాగి ఇద్దిరా? ఆ మల్లికార్జున ఆశీర్వాదగలు నిమ్మగే ఇరబేకు (ఏం తల్లీ బాగున్నావా? ఆ.. శ్రీశైల మల్లికార్జునుడి ఆశీర్వాదాలు మీకు ఉండును గాక) అంటూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారిని దీవిస్తూ, వారి ఇళ్లనుంచి చక్కెర తీసుకెళ్లి శ్రీశైలంలో మల్లన్నకు నైవేద్యంగా సమర్పిస్తుంది. అల్పాహారం మాత్రమే తీసుకుని తాను 35ఏళ్లుగా ప్రతిఏటా పాదయాత్ర చేస్తున్నట్లు ఆ వృద్ధురాలు చెబుతోంది. వారం క్రితం తన గ్రామం నుంచి బయల్దేరానని, ఉగాది పండగ కంటే ముందే శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటానని ఆమె తెలిపింది. అక్కడ మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి తిరుగు ప్రయాణం అవుతున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు తన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలుగలేదని చెప్పింది. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పాదయాత్ర చేస్తూనే ఉంటానని, తనను ఆ శ్రీశైలం మల్లన్నే నడిపిస్తారని ఆ వృద్ధురాలు నమ్మకంతో చెబుతోంది.
(గట్టు)