ఇది దేశ భద్రతకే సవాల్‌ | Andhra Pradesh Data Breach Challenging National Security | Sakshi
Sakshi News home page

ఇది దేశ భద్రతకే సవాల్‌

Published Mon, Apr 15 2019 3:29 AM | Last Updated on Mon, Apr 15 2019 8:08 AM

Andhra Pradesh Data Breach Challenging National Security - Sakshi

సాక్షి, అమరావతి/హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ ‘సేవా మిత్ర యాప్‌’ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పాల్పడిన డేటా స్కామ్‌ మరో కీలక మలుపు తిరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఆధార్‌ చోరీ నిజమేనంటూ ఆధార్‌ (యుఐడీఏఐ) అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ టి.భవానీ ప్రసాద్‌ పోలీసులకు రిపోర్టు చేశారు. ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించిన సమాచారం, లబ్ధిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీకి గురైనట్టు తమ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆయన సైబరాబాద్‌ జిల్లాలోని మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్‌ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ తో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 278/ 2019లో సెక్షన్‌ 37, 38,(ఎ)(బి)(జి), 40, 42, 44 ఆధార్‌ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేశారు.  

18 రకాల వ్యక్తిగత సమాచారం చోరీ 
ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్‌ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్‌ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్‌ డిస్క్‌లు, డిజిటల్‌ ఎవిడెన్స్‌లను సీజ్‌ చేశారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో పరీక్షించారు. చోరీ అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 రికార్డులు ఆధార్‌ డేటా బేస్‌కు లింక్‌ అయ్యి ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారంతోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం ఐటీ గ్రిడ్స్‌ సంస్థ చేతిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్‌నకు లింక్‌ చేసి అనేక అక్రమాలకు ఉపయోగించుకునేందుకే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. 


ఆంధ్ర, తెలంగాణ ప్రజల ఆధార్‌ డేటాను నిందితుడు అక్రమంగా అమెజాన్‌లో స్టోర్‌ చేశాడని, ఈ సున్నితమైన డేటా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో పడితే దేశ భద్రతకే ముప్పని పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆధార్‌ అథారిటీ డీడీ భవానీప్రసాద్‌ పేర్కొన్న భాగం

ఫిర్యాదుదారుడైన తుమ్మల లోకేశ్వరరెడ్డితో పాటు ముద్దనలాలిగారి జయరామిరెడ్డి, అక్కల మద్దిలేటిరెడ్డి, ఆకుల రవికుమార్, అబ్దాస్‌ వెంకటప్రతాప్‌లను నమూనాలుగా తీసుకుని డేటా స్కామ్‌ తీగ    లాగారు. దీంతో టీడీపీ సేవా మిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ డేటా స్కామ్‌ గుట్టురట్టు అయ్యింది. ప్రజలకు చెందిన 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌) నిర్ధారించింది. వాటిలో ఆధార్‌ (యూఐడీ) నంబర్‌తోపాటు, ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌(ఈఐడీ) నంబర్, కలర్‌ ఫొటోతో కూడిన ఓటరు జాబితా, పౌరుని పేరు, స్థానికంగా పిలుచుకునే పేరు, జెండర్, ఫోన్‌ నంబర్, వారి తండ్రి, సంరక్షకుడు, భర్త పేరు, కేరాఫ్‌ పేరు, పుట్టిన రోజు, గ్రామం, మండలం, జిల్లా పేరు, జిల్లా ఐడీ, పిన్‌కోడ్, వీటీసీ కోడ్, రాష్ట్రం పేరు, రాష్ట్రం కోడ్‌ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసినట్లు నిర్ధారణ అయ్యింది.  

దేశ భద్రతకు సంబంధించిన అంశం.. 
ఆధార్‌ ఆథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) భవానీ ప్రసాద్‌ పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆందోళన కలిగించే అంశాలను ప్రస్తావించారు. ‘యూనిక్‌ ఐడీ(ఆధార్‌) అనేది రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది పూర్తిగా కేంద్ర పరిధిలోనిది. పౌరుల ఆధార్‌ ఐడీని టీడీపీ సేవామిత్ర యాప్‌ కోసం లింక్‌ చేయడం జాతీయ భద్రతకు ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలి. దీన్ని కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా   చూడకూడదు. ఈ రెండు రాష్ట్రాల పౌరుల ఆధార్, ఓటర్, తదితర వ్యక్తిగత సమాచారం డేటా చోరీ జరిగింది. ఈ సమాచారం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉండే నేరస్తుల చేతికి చిక్కితే అంతర్జాతీయ మూకుమ్మడి నేరాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆధార్‌తోపాటు ప్రజలకు సంబంధించిన మరో 17 కీలక అంశాలు కూడా చోరీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిర్ధారించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలా ఐటీ గ్రిడ్స్‌కు ఇవ్వడం పెద్ద నేరం. అసలు సేవామిత్ర అప్లికేషన్‌పైనే గట్టి అనుమానాలున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలి’అని భవానీప్రసాద్‌ తన రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.

ప్రధాన నిందితుడికి ప్రభుత్వ పెద్దల షెల్టర్‌  
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్‌ ఐడీలను ఓ వ్యూహం ప్రకారం టీడీపీ యాప్‌ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చౌర్యం చేసింది. ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అక్రమ మార్గాల్లో అందరి వ్యక్తిగత వివరాలను సేకరించింది. అయితే ఈ సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పినదంతా తప్పు అని ఇప్పుడు స్పష్టమైంది. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలందరి వ్యక్తి గత సమాచారాన్ని చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్‌ మేరకు ప్రభుత్వమే ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఇచ్చిందనేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌కు ఏపీ ప్రభుత్వ పెద్దలే షెల్టర్‌ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం వల్ల ఈ వ్యవహారం ఏపీలోని పలువురు అధికారుల మెడకు చుట్టుకోనుందని తెలుస్తోంది.  

చట్టాలు ఏం చెబుతున్నాయంటే..

  • సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ(సీఐడీఆర్‌), రాష్ట్రానికి చెందిన స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌ (ఎస్‌ఆర్‌డీహెచ్‌) వంటి వాటి వద్ద భద్రంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్స్‌ సంస్థ  చేతుల్లోకి వెళ్లడం తీవ్ర నేరం. సీఐడీఆర్, ఎస్‌ఆర్‌డీహెచ్‌లకు చెందిన ప్రతినిధులు విధుల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు చెందిన సమాచారాన్ని బయటకు లీక్‌ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆధార్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌  2016 సెక్షన్‌ 28(5) ప్రకారం నేరం. 
  • ప్రభుత్వ పథకాలు, సర్వేల కోసం కాంట్రాక్టులో భాగంగా ఏదైనా ఏజెన్సీకి ఇచ్చినా ఇతర ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్‌ 29(3) ప్రకారం నేరం. ఇతర ప్రయోజనాల కోసం, సర్వేలు, ఫలితాలు, ఓటర్ల జాబితాలో తొలగింపులు వంటి తదితర అక్రమాలకు ప్రజల వ్యక్తిగత డేటాను మళ్లించడం సెక్షన్‌ 38(జి) ప్రకారం నేరం. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దాన్ని తమ అవసరానికి అనుగుణంగా చేర్పులు, మార్పులు, తొలగింపులు చేయడం, విలువైన డేటాకు భంగం కలిగించి వేరే ప్రయోజనాలకు వాడుకోవడం సెక్షన్‌ 38(హెచ్‌) ప్రకారం నేరం. ఇందుకు సెక్షన్‌ 40 ప్రకారం మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.పది లక్షలు జరిమానా ఉంటుంది. 
  • ఆధార్‌ యాక్ట్‌ సెక్షన్‌ 37 ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడంతోపాటు దాన్ని ఇంటర్నెట్‌లో వాడుకోవడం, ఇతర వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ డేటాను ట్రాన్స్‌మీట్‌ చేయడం, రహస్యంగా దాచడం తీవ్రమైన నేరం. 
  • ప్రభుత్వ పెద్దల దన్నుతో డేటా స్కామ్‌కు పాల్పడిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఆ డేటాను అమెజాన్‌ (అమెరికా) వెబ్‌ సర్వీసులోని క్లౌడ్‌  సర్వర్‌లో పెట్టడం తీవ్ర నేరం. సెక్షన్‌ 44 ప్రకారం దీనిని దేశం బయట జరిగే నేరం (అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ ఇండియా)గా పరిగణిస్తున్నారు. ఈ డేటా మన శత్రుదేశమైన పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులకు చిక్కినా, ఆంతర్జాతీయ నేరస్తులకు చిక్కినా దేశ భద్రతకు పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది.
  • ప్రభుత్వ పథకాలు, ప్రజా సాధికార (పల్స్‌) సర్వే పేరుతో సేకరించిన సున్నితమైన సమాచారంతో అనుసంధానమై ఉండటం ఐటీ యాక్ట్‌ – 2008 సెక్షన్‌ 72(ఎ), సెక్షన్‌ 65, సెక్షన్‌ 66(బి) కింద పూర్తిగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం. 

ఆధార్‌ డీడీ రిపోర్టుకు కారణం ఇదే..
టీడీపీ సేవా మిత్ర యాప్‌ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డేటా స్కామ్‌కు పాల్పడుతున్న వైనంపై ఈ ఏడాది మార్చి 2న ఫిర్యాదు రావడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర మార్చి 15న కేంద్రం పరిధిలోని ఆధార్‌ అథారిటీ (యూఐడీఏఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సంబంధించిన పూర్తి వివరాలు విచారించిన ఆధార్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) టీవీ భవానీ ప్రసాద్‌ ఈ నెల 12న మాదాపూర్‌ పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement