
నిందితులకు ఏపీ సర్కార్ అండ
* కేంద్ర హోంశాఖకు, గవర్నర్‌కు ఏసీబీ ఫిర్యాదు
* ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్యకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు
* ఇక్కడ ప్రధాన నిందితుడని తెలిసీ సహకరించారు
* నోటీసు అందుకున్న సండ్రకు ఆశ్రయమిచ్చారు
* చట్టాన్ని అపహాస్యం చేసేలా ఏపీ ప్రభుత్వ చర్యలుఉన్నాయని ఆందోళన... పలు ఆధారాలతో సహా నివేదిక
* న్యాయ నిపుణులతో సంప్రదింపులు
* కోర్టును ఆశ్రయించే యోచన
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో సహ నిందితుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్న వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి ఏసీబీ తీసుకెళ్లింది. తీవ్రమైన ఈ అవినీతి కేసులో నిందితుడు మత్తయ్య విజయవాడ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా ఓ నివేదికను కేంద్ర హోంశాఖకు ఏసీబీ అధికారులు సమర్పించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలంటూ రూ.5కోట్లతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే.
ఈ కేసులో మత్తయ్యను నాలుగో నిందితుడిగా పేర్కొంటూ గత నెల 31న ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా... అతను హైకోర్టును ఆశ్రయించేదాకా కూడా విజయవాడలో, అక్కడి పోలీసుల సంరక్షణలోనే ఉన్నాడని కేంద్ర హోంశాఖకు అందజేసిన నివేదికలో ఏసీబీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ‘‘అతి ముఖ్యమైన అవినీతి కేసును మేం విచారిస్తున్నాం. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి విచారించాం.
తదుపరి వివరాల కోసం మత్తయ్యను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగానే విజయవాడకు పారిపోయాడు. తనను బెదిరిస్తున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తులపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పొరుగు రాష్ట్రంలో ఓ ముఖ్యమైన కేసులో నిందితుడు.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తప్పుడు ఫిర్యాదు ఇచ్చినా ఊరుకున్నారు. నిందితుడు కళ్ల ముందే తిరుగుతున్నా పట్టించాలన్న ఆలోచన చేయలేదు. పైగా నిందితుడు ఇచ్చిన ఫిర్యాదును అక్కడి సీఐడీ విభాగానికి ఇచ్చి విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. చట్టాన్ని అపహాస్యం పాలు చేస్తున్న చర్యగా కనిపిస్తోంది..’’ అని నివేదికలో ఏసీబీ పేర్కొన్నట్లు తెలిసింది.
ఇదే కేసులో పూర్వాపరాలు తెలిసిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను విచారించేందుకు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసు జారీచేసిన సంగతిని నివేదికలో ప్రస్తావించింది. ‘బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే మా నోటీసుకు స్పందించి విచారణకు వచ్చి తనకు తెలిసిన విషయాలను వివరిస్తారని ఆశించాం. దురదృష్టవశాత్తు ఆ ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఫోటోతో సహా ప్రచురించింది. టీడీపీకి చెందిన ఓ నేత అతిథి గృహంలో ఈ ఎమ్మెల్యే తలదాచుకుంటున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం, అక్కడి పోలీసులు చట్టంతో తమకు పనేమిటన్న రీతిలో ప్రవర్తించడం ఆందోళన కలిగించే పరిణామం..’’ అని పేర్కొన్నట్లు తెలిసింది.
షెల్టర్‌జోన్‌గా..
ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో భాగమేనని.. కానీ అక్కడి ప్రభుత్వం విచక్షణ మరచిందని ఏసీబీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణలో నేరం చేసిన వారికి ఆంధ్రప్రదేశ్ షెల్టర్ జోన్‌గా మారిందని పేర్కొంటున్నాయి. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని... అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ ఇటీవల గవర్నర్ నరసింహన్‌ను కలసి ఏపీ ప్రభుత్వ తీరును వివరించారు. ఏసీబీ డీజీ ఖాన్, డీజీపీ అనురాగ్‌శర్మ కూడా జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు పూసగుచ్చినట్లు వివరించారు. కేసు ముందుకు సాగకుండా ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డు పడుతోందని, నిందితుడు మత్తయ్య, సాక్షి సండ్ర వెంకటవీరయ్యలకు షెల్టర్ జోన్‌గా మారిందని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసు పురోగతిపై వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.