కందుకూరు: చిటుకు రోగం (ఇ.టి)తో జీవాలు (గొర్రెలు, మేకలు) మృత్యువాత పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ వ్యాధి జీవాల పెంపకందారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతుంటారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారి నుంచి జీవాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు కందుకూరు పశువైద్యాధికారి రవిచంద్ర. వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలపై పెంపకందారులకు ఆయన సలహాలు, సూచనలు అందజేశారు.
వ్యాధి ఇలా సంక్రమిస్తుంది..
చిటుకు రోగం క్లాస్ట్రీడియమ్‌వెల్షీ అనే బ్యాక్టీరియాతో తొలకరి వర్షాల తర్వాత పెరిగి వాడుపడిన గడ్డిని తినడంతో తరచూ జీవాలకు ఈ వ్యాధి జూన్ నుంచి జులై మధ్యలో ఎక్కువగా సంక్రమిస్తుంది. కాగా ఇటీవల జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురవడంతో ప్రస్తుత వాతావరణం ఆ వ్యాధికి అనుకూలంగా మారింది. ఈ వ్యాధి వాడుపడ్డ గడ్డిని జీవాలు అతిగా తినడంతో వస్తుంది.
లక్షణాలు...
మందలో బలిష్టంగా ఉన్న గొర్రెలు, మేకలు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే అకస్మాత్తుగా మరణిస్తాయి.
గొర్రె, మేక పిల్లలు రాత్రి బాగానే ఉండి ఉదయం చూసే సరికి మృత్యువాత పడతాయి.
జీవాలు చనిపోయే ముందు నీరసంగా ఉండి అతి ఉద్రిక్తం చూపడం, నోటి నుంచి నురగలు కక్కుతుండటం, తూలుతూ నడవడం, పళ్లు కొరుకుతూ కనుగుడ్లు తిప్పుతూ గాలిలో ఎగిరి కింద పడి చనిపోతాయి.
చనిపోయిన తర్వాత చూస్తే మూత్ర పిండాలు పాడయి కన్పిస్తాయి.
ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కనిపిస్తాయి.
నివారణే ప్రధానం
ఈ వ్యాధి విషయంలో చికిత్స చేయించినా లాభం ఉండదు. చికిత్స కన్నా వ్యాధి నివారణే అతి ముఖ్యమైనది. ముందస్తుగా టీకా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. చాలా మంది తాపుడు మందు ఉంటుందని మందుల షాపుల నిర్వాహకులు ఇచ్చే దాన్ని తీసుకుని తాపిస్తుంటారు. ఇది అపోహ మాత్రమే. చిటుకు రోగం వస్తే కొద్ది గంటల్లోనే మృత్యువాత పడాల్సిందే.
అవసరాన్ని బట్టి స్థానిక పశువైద్యుడి పర్యవేక్షణలో యాంటీబయాటిక్ మందులు, ఇంజక్షన్ల రూపంలో కాని లేదా నీటిలో కలిపి వాడితే వ్యాధిని తట్టుకున్న జీవాలు మాత్రమే కొన్ని సందర్భాల్లో చాలా అరుదుగా తేరుకునే అవకాశం ఉంది. వర్షాకాలంలో కంటే ముందే ఏప్రిల్, మే మాసాల్లో మందలోని అన్ని జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి ఈ వ్యాధి బారిన పడకుండా నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పటి వరకు టీకాలు వేయించని వారు తమ జీవాలకు వేయించుకుంటే మంచిది.
క్లాస్ట్రీడియమ్‌వెల్షీ అనే బ్యాక్టీరియాతో జీవాలు మృతి చెందుతాయి..
Published Wed, Sep 3 2014 5:07 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement