కాటేస్తున్న కాల్‌ రికార్డ్‌ | Another arrest in Cannabis case at Peddapalli | Sakshi
Sakshi News home page

కాటేస్తున్న కాల్‌ రికార్డ్‌

Published Sat, Oct 28 2017 8:07 PM | Last Updated on Sat, Oct 28 2017 8:07 PM

Another arrest in Cannabis case at Peddapalli

సాక్షి, పెద్దపల్లి/ముత్తారం: గంజాయి కుట్ర కేసులో మరో అరెస్ట్‌ చోటుచేసుకొంది. ఓడేడుకు చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు భానుకుమార్‌ను శుక్రవారం హైద్రాబాద్‌ నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గంజాయి కుట్రవ్యవహారంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకుడిని కూడా అరెస్ట్‌ చేయడం కలకలం సృష్టిస్తోంది. టీఆర్‌ఎస్‌కే చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధి కూడా రేపో, మాపో అరెస్ట్‌ అవుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. వీరంతా కిషన్‌రెడ్డితో విభేదాలున్న వాళ్లు కావడం విశేషం.

కదులుతున్న డొంక
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గంజాయి కుట్ర కేసు తీగ లాగితే డొంక కదులుతుంది. ముత్తారం మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అ««ధ్యక్షుడు పోతుపెద్ది కిషన్‌రెడ్డిని గంజాయి కేసులో ఇరికించాలని మాజీ సర్పంచ్‌ భర్త సుదర్శన్‌ కుట్ర పన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. కేసులో సుదర్శన్, ఇల్లెందుల భార్గవ్‌తో పాటు సహకరించారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు సుదర్శన్, భార్గవ్‌లను ఇప్పటికే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

నాయకుల్లో వణుకు
గంజాయి కుట్ర కేసులో వాయిస్‌ కాల్‌రికార్డులు కీలకంగా మారాయి. సుదర్శన్‌ ఫోన్‌ కాల్‌ రికార్డ్స్‌ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నేరుగా అరెస్ట్‌లకు పాల్పడుతున్నారు. దీనితో సుదర్శన్‌తో కిషన్‌రెడ్డి వ్యవహారం మాట్లాడిన నాయకులంతా ఏక్షణాన ఏంజరుగుతుందోననే భయాందోళనలో ఉన్నారు. సుదర్శన్‌ ఫోన్‌రికార్డ్స్‌ల ఆధారంగానే మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై కేసునమోదు చేయగా, అవే రికార్డ్స్‌ అధారంగా మరిన్ని అరెస్ట్‌లకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై కుట్రపన్నిన కేసులో సుదర్శన్‌అరెస్ట్‌ కాగా, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నట్లు వెలుగు చూడడం తాజాగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

కిషన్‌రెడ్డితో వైరం ఉన్న నాయకుల్లోని చాలా మందితో సుదర్శన్‌ ఈ కుట్రకేసు చర్చించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే కాల్‌రికార్డ్స్‌ ఆధారంగా టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. కిషన్‌రెడ్డి, భానుకుమార్‌ల మధ్య విభేదాలు ఉండడంతో సహజంగానే సుదర్శన్, భానులు తరుచుగా మాట్లాడుకొనే వారు. ఈ క్రమంలో గంజాయి కుట్ర కేసుకు సంబంధించి కూడా భానుకుమార్‌ సుదర్శన్‌తో మాట్లాడిన సంభాషణల రికార్డులు పోలీసులకు లభించినట్లు తెలిసింది. సుదర్శన్‌తో సన్నిహితంగా ఉన్న వాళ్లంతా ఎప్పుడు, ఎవరని పోలీసులు అదుపులోకి తీసుకుంటారో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. కొంతమంది నాయకులు ఇప్పటికే రహస్య ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. 

అయితే సుదర్శన్‌ ఫోన్‌ రికార్డ్‌ల్లో  మండలానికి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి ఒకరి సంభాషణ కూడా ఉన్నట్లు సమాచారం. సదరు అధికార పార్టీ నాయకునికి, కిషన్‌రెడ్డికి మధ్య కుడా విబేధాలు ఉండడంతో సుదర్శన్‌ను అధికారపార్టీ నాయకుడు ఫోన్‌లో సంప్రదింపులు చేసేవాడని తెలిసింది. పలుకేసుల గురించి సుదర్శన్‌తో ఆనాయకుడు చర్చించిన రికార్డు పోలీసుల చేతిలో ఉన్నట్లు సమాచారం. అధికారపారీ నాయకులే సొంత పార్టీ నాయకునిపై గంజాయి కుట్రకేసుకు సహకరించారని తెలిసిన మండల ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు. 

ఒకరు ఇంటికి...మరొకరు స్టేషన్‌కు
గంజాయి కుట్ర కేసులో మూడవ ముద్దాయి, ఓడేడ్‌కు చెందిన ఇల్లెందుల భార్గవ్‌కు గురువారం బెయిల్‌ మంజూరు కాగా, శుక్రవారం తెల్లవారు జామున అదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు దేవునూరి భానుకుమార్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఒకరు బయటకు రావడం, మరొకరు లోపలికి పోవడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement