
మరో లక్షన్నర మంది రైతులకు రుణమాఫీ!
రుణమాఫీ కోసం విన్నపాలు రోజురోజుకూ పెరిగిపోతు న్నాయి. ఈ పథకం పరిధిలోకి మరో లక్షన్నర మంది రైతులు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కోసం విన్నపాలు రోజురోజుకూ పెరిగిపోతు న్నాయి. ఈ పథకం పరిధిలోకి మరో లక్షన్నర మంది రైతులు వచ్చే అవకాశముందని అధి కారికవర్గాలు పేర్కొంటున్నాయి. రుణ మాఫీని ప్రభుత్వం ప్రకటించినప్పుడు తమ పేర్లు నమోదు చేయలేదని, అందువల్ల తమకు అవకాశం కల్పించాలని పలువురు రైతులు విన్నవించుకుంటున్నారు. రైతుల విన్నపాలను స్థానిక ఎమ్మెల్యేలు జిల్లాల్లో వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకొస్తు న్నారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మందికిపైగా కొత్తగా రుణమాఫీ కోసం అభ్య ర్థిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందుకోసం రూ. 500 కోట్లు అవసరమవుతాయని అధికారులు భావిస్తు న్నారు. ఇటీవల దాదాపు 25 వేల మందిని అర్హులుగా గుర్తించిన వ్యవసాయశాఖ అందుకోసం రూ.160 కోట్లు అవసరమని ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై ప్రభు త్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అయినా రైతుల విన్నపాలు పెరుగుతుండటంతో ఏం చేయాలో అర్థంగాక ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
అధికారుల తప్పిదం...
ప్రభుత్వం రూ.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి మూడేళ్లుగా ఆ సొమ్మును విడతలవారీగా ఇస్తూ వచ్చింది. రూ.లక్ష లోపు రుణాలున్న రైతులను పథకం ప్రారంభంలో బ్యాంకు, వ్యవసాయ అధికా రులు గుర్తించారు. వారి పేర్లతో జాబితా తయారు చేశారు. అర్హులైన చాలామంది రైతుల పేర్లను చాలా జిల్లాల్లో సాంకేతిక కార ణాలు చూపించి వదిలేశారు. అర్హతలుండి రుణమాఫీకి నోచుకోని రైతులు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయశాఖ రైతుల, ఎమ్మెల్యేల విన్నపాలను పరిశీలించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపాలని యోచిస్తోంది.
రుణమాఫీ పథకానికి అర్హులను వదిలేశారంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని ‘కాగ్’కూడా కడిగేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ, బ్యాంకు అధికారుల తీరు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కాగ్ పేర్కొంది. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2014 నుంచి 2016 వరకు రెండు విడతలుగా ప్రభుత్వం రూ.1,355.37 కోట్లు విడుదల చేసింది. అయితే, మొదటి విడతలో రూ.673.91 కోట్లు ఖర్చు చేసిన అధికారులు రెండో విడతలో అంతే మొత్తంలో ప్రభుత్వం విడుదల చేసినా ఖర్చు చేయలేకపోయారు. దాదాపు రూ. 28.83 కోట్లను బ్యాంకులే దాచిపెట్టుకున్నాయని కాగ్ దుయ్యబట్టింది. ఇలా అనేకచోట్ల రైతు రుణమాఫీ సొమ్ము చెల్లింపుపై విమర్శలు వెల్లువెత్తాయి.