ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మరో పోరాటం
- 11న టీయూఎఫ్ రాష్ట్ర సదస్సు
- తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కోచైర్‌పర్సన్ విమలక్క
హన్మకొండ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు మరో పోరాటం చేయాల్సిన అవసరముందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కోచైర్‌పర్సన్ విమలక్క అన్నారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విమలక్క మాట్లాడారు. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకున్నామో, రాష్ట్రం ఏర్పాటైనా ఆ ఆకాంక్షలు నెరవేడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ గత పాలకుల విధానాలే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శిం చారు.
నాడు స్వయంపాలన నినాదాన్నిచ్చి నేడు కార్పొరేట్ శక్తులు, బహుళజాతి సంస్థలు, సీమాంధ్ర వలస కుబేరులకు పాలకులు స్వాగ తం పలుకుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ దళారీ పాలకుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిగజారి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆస్తులు తాకట్టు పెట్టి దొరల గడీలకు రంగులు అద్దుతున్నారని ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇదే నా అని ప్రశ్నించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్‌లోని సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో టఫ్ నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సు విజయవంతానికి మేల్కోలుపు యాత్రను చేపట్టామన్నారు. ఈ యాత్ర శుక్రవారం వరంగల్ జిల్లాకు చేరుకుందన్నారు.
ఈ యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాలు పూర్తి చేసుకుని 11న హైదరాబాద్‌కు చేరుకుంటుందన్నారు. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ సదస్సులో ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా సంఘాల నాయకులు అంబాల సత్యం, బాదావత్ రాజు, బొట్ల బిక్షపతి, దయ్యాల సుధాకర్, మోహన్, బీరం రాము, మోహన్, పద్మ, పోతుల రమేశ్, విజేందర్,రాజన్న, సురేష్, రాము పాల్గొన్నారు.