చీప్గా లిక్కర్ | governement planed to cheep licker to people | Sakshi
Sakshi News home page

చీప్గా లిక్కర్

Published Sat, Aug 8 2015 1:50 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

చీప్గా లిక్కర్ - Sakshi

చీప్గా లిక్కర్

► ఎక్సైజ్ పాలసీ ముసాయిదాకు ఆమోదం
► మండలం యూనిట్‌గా లెసైన్సులు
►లెసైన్సుదారులకే గ్రామాల్లో
►చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్
►గుడుంబా అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు
►ఇకపై పోలీసు శాఖకూ బాధ్యతలు
►తయారీ, విక్రయాల నిరోధంలో విఫలమైతే ఇన్‌స్పెక్టర్లపై వేటు
► బేవరేజెస్ కార్పొరేషన్‌ను డిపార్ట్‌మెంట్‌గా మార్చాలని సీఎం ఆదేశం
► కొత్త మద్యం విధానంపై ఈనెల 15 తర్వాత నోటిఫికేషన్
 ► పల్లెల్లో చవక మద్యం దుకాణాలకు సీఎం గ్రీన్‌సిగ్నల్

 
 సాక్షి, హైదరాబాద్:  ఇక గ్రామాల్లో సైతం అధికారికంగా మద్యం అమ్మకాలు జరగనున్నాయి. ఈ మేరకు రూపొందించిన నూతన మద్యం విధానం ముసాయిదాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోదముద్ర వేశారు. మండలం యూనిట్‌గా లాటరీ పద్ధతిలో లెసైన్సులు జారీ చేసి, సదరు లెసైన్సుదారుడికే గ్రామాల్లో చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. గుడుంబాను అరికట్టే బాధ్యతను ఆబ్కారీశాఖతో పాటు పోలీస్‌శాఖకు కూడా అప్పగించారు. ఎక్కడైనా గుడుంబా తయారీ, విక్రయాలను అడ్డుకోవడంలో విఫలమైతే ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేయాలని స్పష్టంచేశారు. అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న ఎక్సైజ్ పాలసీపై శుక్రవారం ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఆబ్కారీ శాఖ మంత్రి టి.పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ(ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి ఈ భేటీకి హాజరయ్యారు.

ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కూడా సమావేశానికి పిలిపించారు. గుడుంబాను తరిమికొట్టడంపైనే ఈ సమావేశంలో సీఎం ప్రధానంగా దృష్టి సారించారు. ‘‘ప్రజల ప్రాణాలు తోడేస్తున్న గుడుంబాను తరిమికొట్టేందుకు బహుముఖ వ్యూహం అమలు చేయాలి. గ్రామాల్లో గుడుంబా తయారు చేసే వారి దగ్గర్నుంచి అమ్మకాలు జరిపే వరకు ఓ నెట్‌వర్క్ ఉంది. దాన్ని విచ్ఛిన్నం చేయాలి. గుడుంబా తయారుచేసే వారి మీద అవసరమైతే పీడీ యాక్టు ప్రయోగించాలి. ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యం కూడా గుడుంబా వ్యాపారం యథేచ్ఛగా సాగేందుకు కారణమైంది. ఇకపై ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎక్సైజ్, పోలీస్ శాఖలు కలిసి పనిచేయాలి. అయినా గుడుంబా తయారీ, అమ్మకాలు ఆయా మండలాల్లో సాగితే రెండు శాఖల ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేయాలి’’ అని సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రత్యేక మద్యం విధానం కోసం పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ‘‘అక్టోబర్ 1 నుంచి అమలుల్లోకి వచ్చే మద్యం విధానంపై ఈనెల 15 తర్వాత నోటిఫికేషన్ జారీ చేయాలి. గుడుంబా స్థానంలో తక్కువ ధర చీప్ లిక్కర్ తీసుకు వచ్చినా... గుడుంబాపై కఠినంగా వ్యవహరించకపోతే ఫలితం ఉండదు. గుడుంబా తయారీ దారులను గుర్తించాలి. సూత్రదారులను పట్టుకోవాలి. ఎక్సైజ్, పోలీస్ శాఖ కలిసి పనిచేస్తే గుడుంబాను పారదోలడం కష్టం కాదు’’ అని సీఎం పేర్కొన్నారు.

 గ్రామాలకు బీ-లెసైన్స్
 గ్రామీణ మండలం యూనిట్‌గా ఈసారి మద్యం దుకాణాలకు లెసైన్సులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్ అధికారులు పాలసీ ముసాయిదా రూపొందించారు. మండలం యూనిట్ లెసైన్సుదారుడే గ్రామాల్లో చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్లు జారీ చేస్తారు. బీ-లెసైన్స్ పేరుతో ఇచ్చే ఈ లెసైన్సు కోసం ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తారు. ప్రజల ప్రాణాలకు హాని కలగని మోతాదులో అల్కాహాల్ ఉండేలా ప్రభుత్వ పర్యవేక్షణలో డిస్టిలరీల్లో చీప్ లిక్కర్ తయారీ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రూ. 15కే మద్యం సీసా అందుబాటులో ఉంటే ప్రమాదకరమైన చీప్ లిక్కర్ ఎవరూ తాగరనే నమ్మకం తనకుందని, తదనుగుణంగా అధికార యంత్రాంగం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

 బేవరేజెస్ కార్పొరేషన్ ఇక డిపార్ట్‌మెంట్!
 తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌ను డిపార్ట్‌మెంట్‌గా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కంపెనీ చట్టం ప్రకారం బేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను శాఖ, సర్వీస్ ట్యాక్స్ విభాగాలు పన్ను వసూలు చేస్తుండడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చేసి, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులను కాంట్రాక్టు కిందకి మార్చారు. తెలంగాాణలో మాత్రం ప్రభుత్వ విభాగం(డిపార్ట్‌మెంట్)గానే దీన్ని మార్చాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. దీనికి ఎక్సైజ్ శాఖలో డీఐజీ స్థాయి పోలీస్ అధికారిని నియమించాలని నిర్ణయించారు. రిటైర్డ్ సీనియర్ అధికారుల సేవలను కూడా ఎక్సైజ్ శాఖకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

 గుడుంబా అనర్థాలపై ప్రచారం
 గుడుంబా వల్ల కలిగే అనర్థాలపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించి, ప్రజలను చైతన్యవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. లఘుచిత్రాలు, పోస్టర్లు, కరపత్రాలతోపాటు సాంస్కృతిక సారథి కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. గుడుంబా స్థావరాల వివరాలు ఇచ్చే వారికి అవార్డులు ఇవ్వాలన్నారు. ఆర్‌డీవోలు, తహశీల్దార్లు గుడుంబా వ్యతిరేక విధానాన్ని అమలు చేసే విషయంలో క్రియాశీలంగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారులు సమావేశమై విధివిధానాలను రూపొందించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement