సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్లీనరీలో తీర్మానాల సంఖ్యను వీలైనంత కుదిస్తున్నారు. మరీ అనివార్యమైతే మినహా ఆరు తీర్మానాలకే పరిమితం కావాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఒక అంశానికి సంబంధించిన అనుబంధ తీర్మానాలన్నింటినీ ఒకే తీర్మానంగా చేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలపైనా ప్రత్యేకంగా రాజకీయ తీర్మానం రూపొందించాలని ఆదేశించారు. ప్లీనరీ తీర్మానాల కమిటీతో సీఎం బుధవారం రాత్రి సమావేశమై తీర్మానాలకు తుదిరూపు ఇచ్చారు.
జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు వంటివన్నీ కలిపి ఒకే తీర్మానంగా ప్రతిపాదించనున్నారు. సంక్షేమంపై తీర్మానంలోనే అన్ని వర్గాల సంక్షేమంపైనా తీర్మానం ప్రతిపాదిస్తారు. విద్య, వైద్యం వంటి అన్ని అనుబంధ అంశాలను కలిపి తీర్మానంగా చేయనున్నారు. వ్యవసాయం, విద్యుత్, రైతుబంధు, మిషన్ కాకతీయ, మార్కెటింగ్ వంటి వాటన్నింటినీ సాగునీటి రంగంపై తీర్మానంలోనే అనుబంధంగా చేర్చాలని కేసీఆర్ సూచించారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కలిపి ఒక తీర్మానం చేయనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమంపై ఒక తీర్మానం చేయనున్నారు. అన్ని అంశాలనూ ఈ ఆరు తీర్మానాల్లోనే అనుబంధంగా చేర్చాలని కేసీఆర్ ఆదేశించారు.
తలకాయ నుంచి నాటుకోడి దాకా
ప్లీనరీలో నోరూరించే తెలంగాణ వంటకాలు అలరించనున్నాయి. తలకాయ కూర, పాయ, మటన్ షోర్బా, నాటుకోడి కూర, బిర్యానీ, బగారా అన్నంతో పాటు పచ్చి పులుసు, దాల్చె, జొన్న రొట్టె, అంబలి తదితరాలు సిద్ధం చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సల్ల (మజ్జిగ) అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో ప్లీనరీ వేదిక, ప్రాంగణంతో పాటు నగరంలోనూ అలంకరణ ఏర్పాట్లను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు చూస్తున్నారు. ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ రోజూ సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment