తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తున్నాం..!
లోక్‌సభలో ప్రకటించిన అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ రెండు మూడు రోజులుగా బడ్జెట్ సమావేశాలకు వెళ్లకుండా నిరసన వ్యక్తంచేసిన టీఆర్‌ఎస్ ఎంపీల ప్రయత్నం కొంతమేర ఫలించింది. తెలంగాణలో ఎయిమ్స్, ఐఐఎం ఏర్పాటుచేయాలని రెండున్నరేళ్లుగా ఉన్న డిమాండ్‌పై కేంద్రం స్పందించని సంగతి తెలిసిందే. గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు.
ప్రసంగం ముగిసే వేళ టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి లేచి మా ఎయిమ్స్ సంగతేంటని ప్రశ్నించారు. వెంటనే జైట్లీ.. తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ గత కొద్ది రోజులుగా వ్యూహాత్మకంగా పార్టీ లోక్‌సభాపక్ష నేత మినహా ఎవరూ సభకు హాజరు కాకుండా టీఆర్‌ఎస్ నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న విద్యాసంవత్సరంలోనే ప్రారంభమయ్యేలా ఎయిమ్స్ మంజూరు చేయాలని పార్టీ ఎంపీలు చేసిన డిమాండ్‌కు అంగీకరించిన కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ దిశగా అరుణ్ జైట్లీ సభలో ప్రకటన చేశారు. ఆ వెంటనే సభను మార్చి 9కి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.