సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే ఉగ్రవాదే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందువేనని.. అతనే నాథూరామ్ గాడ్సే అంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను అసద్ సమర్థించారు. మంగళవారం దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతిపిత గాంధీని చంపిన గాడ్సేను మహాత్ముడంటారా? రాక్షసుడంటారా? అని ప్రశ్నించారు. గాంధీని చంపినట్లు రుజువై.. శిక్ష కూడా పడిన వ్యక్తిని ఏమని పిలవాలని అన్నారు. హంత కుడిని గొప్పవాడిగా ఎలా అభివర్ణిస్తారన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నైరాశ్యంలో ఉన్నారని, ఆయనకు దేశమంతటా ఎదురుగాలి వీస్తోందని పేర్కొన్నారు. మోదీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. టీఆర్‌ఎస్ ఆధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు అభినందనీయమన్నారు. కేసీఆర్‌కు రాజకీయ విజన్, ఒక వ్యూహం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీని అసెంబ్లీలో ఒక్క సీటుకు పరిమితం చేయగలిగామని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ ఒక్క సీటు కూడా గల్లంతు కావడం ఖాయమన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment