అసెంబ్లీలో ఆస్తిపన్ను అంశం లేవనెత్తుతాం
సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు
పార్టీ ఆధ్వర్యంలో మానుకోటలో ఒక రోజు ఆందోళన
మహబూబాబాద్ : మున్సిపాలిటీలో పెంచిన ఆస్తిపన్నును తగ్గించాలనే అంశాన్ని అసెంబ్లీ లో లేవనెత్తుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. ఆస్తిపన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మానుకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం 24 గంటల నిరవధిక ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. ఆస్తిపన్ను తగ్గిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.
నర్సంపేట మున్సిపాలిటీలో పన్ను తగ్గింపుపై అక్కడి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారని, మానుకోట ఎమ్మెల్యేకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే అక్కడ పన్ను తగ్గించారని తెలిపారు. మానుకోటలో ఎక్సైజ్ సుంకం, ఇతర ట్యాక్స్‌ల పేర వ్యాపారులపై భారం మోపడం కూడా సరికాదన్నారు. సీపీఐ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బి.అజయ్ ఎమ్మెల్యే హామీ మేరకే పన్ను తగ్గింపుపై కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మాణం చేశారని తెలిపా రు. కౌన్సిలర్లు దాస్యం రామ్మూర్తి, మహ్మద్ ఫాతిమా, నాయకులు పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, నర్ర శ్రావణ్, మేక వీరన్న, చింతకుంట్ల వెంకన్న, వీరవెల్లి రవి, జటంగి శ్రీశైలం, బోళ్ల కిష్టయ్య, కిషోర్ పాల్గొన్నారు.